రాజ్యసభ ఎన్నికల్లో టీడీపీ పోటీ: చంద్రబాబు 'డబుల్' స్కెచ్

June 05, 2020

టీడీపీ అధినేత చంద్రబాబు తాజా నిర్ణయంతో ఆంధ్రప్రదేశ్‌లో రాజ్యసభ ఎన్నికలు కాస్త ఆసక్తికరంగా మారాయి. ఏపీలో ఖాళీ అయిన నాలుగు స్థానాలూ అధికార వైసీపీ గెలుచుకునే పరిస్థితులే ఉన్నాయి. వైసీపీ నుండి మోపిదేవి వెంకటరమణ, పిల్లి సుభాష్ చంద్రబోస్, అయోధ్య రామిరెడ్డి, పరిమళ్ సత్వానీలు బరిలో ఉన్నారు. 175 సీట్లకు గాను గత ఎన్నికల్లో వైసీపీ 151 సీట్లు గెలిచింది. మరికొంతమంది టీడీపీ ఎమ్మెల్యేలు వైసీపీకి అనుబంధంగా కొనసాగుతున్నారు.

ఈ నేపథ్యంలో వైసీపీకి చెందిన 4గురి గెలుపు సునాయాసమే. దీంతో టీడీపీ పోటీ చేయదని భావించిన వారికి చంద్రబాబు మంగళవారం హఠాత్తుగా షాకిచ్చారు. రాజ్యసభ బరిలో టీడీపీ ఉంటుందని చెప్పారు. ఈ మేరకు వర్ల రామయ్యను అభ్యర్థిగా ప్రకటించారు. వైసీపీ ఆగడాల గురించి ప్రజల్లో చర్చ జరిగేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. గెలుపోటములు ముఖ్యం కాదన్నారు.

చంద్రబాబు మాటల్లో కూడా వర్ల ఓటమి ఖాయమని తేలింది. అయినప్పటికీ బరిలో నిలిచి, ఎన్నికలు జరగడానికి కారణముందని అంటున్నారు. ఒకటి టీడీపీ చెబుతున్నట్లు స్థానిక సంస్థల ఎన్నికల సమయంలో ప్రభుత్వ వైఫల్యం, కక్ష సాధింపుపై చర్చ జరిగేందుకు ఇది టిడిపికి లాభిస్తుందని అంటున్నారు. అలాగే చంద్రబాబు మరో కోణంలోను ఆలోచించారని చెబుతున్నారు.

వర్లను అభ్యర్థిగా ప్రకటించిన చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. రాజ్యసభ ఎన్నికల సందర్భంగా తమ పార్టీ నుండి గెలిచిన అందరి ఎమ్మెల్యేలకు విప్ జారీ చేస్తామని, పార్టీ ఏజెంట్‌కు చూపించి ఎన్నికల్లో ఓటేయాలని స్పష్టం చేశారు. పార్టీ ఆదేశాలు ఉల్లంఘిస్తే అనర్హత వేటుపడుతుందని హెచ్చరించారు.

చంద్రబాబు వ్యాఖ్యలతో ఆయన వ్యూహం తేలిపోయిందని చెబుతున్నారు. 2019లో టీడీపీ నుండి గెలిచిన వల్లభనేని వంశి, మద్దాలి గిరి వంటి ఎమ్మెల్యేలు వైసీపీకి అనుబంధంగా కొనసాగుతున్నారు. వారిని టార్గెట్‌గా కూడా చంద్రబాబు ఈ నిర్ణయం తీసుకొని ఉంటారని చెబుతున్నారు. ఎన్నికల్లో ఓడినప్పటికీ స్థానిక సమరం సందర్భంగా జగన్ ప్రభుత్వం వైఫల్యాలపై ప్రజల్లో చర్చ, పార్టీ నుండి గెలిచి వైసీపీకి మద్దతిచ్చే ఎమ్మెల్యేలు లక్ష్యంగా ప్లాన్ వేశారని చెబుతున్నారు.