వల్లభనేని వంశీ వర్సెస్ దుట్టా.. గన్నవరంలో ఏం జరుగుతోంది

August 14, 2020

అధినేత మాటకు ఎదురుచెప్పేంత సీన్ ప్రాంతీయ పార్టీల్లో కనిపించదు.

అందులోని తెలుగు రాష్ట్రాల్లోని అధికార పక్షాల అధినేతకు వ్యతిరేకంగా గళం విప్పే ధైర్యం చేయరు.

మనసులో ఉన్న వేదనను సున్నితంగా చెప్పుకోవటం.. అవసరమైతే వేడుకోలుగా మాట్లాడటం.. ఆ విషయాలేవీ బయటకు రాకుండా జాగ్రత్తలు తీసుకోవటం చేస్తుంటారు.

అందుకు భిన్నంగా ఇటీవల కాలంలో జగన్ పార్టీ నేతలు కాస్తంత బాహాటంగానే బయటపడిపోతున్న వైనం వార్తలుగా మారుతున్నాయి.

తాజాగా అలాంటిదే ఒక ఉదంతం చోటు చేసుకుంది.

క్రిష్ణా జిల్లా గన్నవరం అసెంబ్లీ నియోజకవర్గానికి ఉప ఎన్నికలు జరిగిన పక్షంలో తనకు పార్టీ టికెట్ ఇవ్వాలని కోరుతున్నారు పార్టీ సీనియర్ నేత దుట్టా రామచంద్రరావు.

ఎప్పుడైతే పార్టీలోకి వల్లభనేని వంశీ ఎంట్రీ ఇచ్చారో.. అప్పటి నుంచి ఆయన ఆగ్రహంతో ఉన్నారు.

ఈ ఇరువురికి మొదట్నించి పొసగదు. వంశీ మీద ఒంటికాలి మీద విరుచుకుపడే ఆయన.. ఇప్పుడు పార్టీలో కలిసి సాగటాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు.

గన్నవరం అసెంబ్లీ స్థానానికి జరిగే ఉప ఎన్నికల్లో పార్టీ టికెట్ వల్లభనేని వంశీకి ఇచ్చిన పక్షంలో ఆయనకు శాశ్వితంగా ద్వారాలు మూసుకుపోతాయి.

ఇదే.. ఆయన్ను కలవరానికి గురి చేస్తుంది. అందుకే.. పార్టీలో తాను చేసిన సేవలు మొదలు.. దివంగత మహానేత వైఎస్ రాజశేఖర్ రెడ్డితో తనకున్న అనుబంధాన్ని చెప్పుకుంటున్నారు.

అంతేకాదు.. జిల్లాకు ఇంఛార్జి మంత్రిగా వ్యవహరిస్తున్న పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వద్దకు గన్నవరం పంచాయితీ వెళ్లగా.. దుట్టా తన వాదనను క్లియర్ గా చెప్పటమే కాదు.. తనకు అన్యాయం జరిగితే ఊరుకునేది లేదని వార్నింగ్ ఇచ్చినట్లుగా చెబుతున్నారు.

పార్టీ కోసం పదేళ్లుగా జెండా మోసిన తనకు అన్యాయం జరిగితే చూస్తూ ఊరుకోలేనని చెప్పినట్లు తెలుస్తోంది.

పార్టీలో ఎప్పటి నుంచో పని చేస్తున్న వారిని కాదని.. కొత్తగా వచ్చిన వారికి పదవులు ఇస్తే ఒప్పుకునేది లేదన్నారు.

కొత్త వ్యక్తుల పెత్తనాన్ని ఒప్పుకోనని స్పష్టం చేశారు.

గన్నవరం పంచాయితీని ఒక కొలిక్కి తెద్దామని ప్రయత్నించిన మంత్రి పెద్దిరెడ్డి..వాతావరణం బాగా వేడిగా ఉండటంతో మధ్యలో విషయాన్ని పక్కన పెట్టినట్లుగా తెలుస్తోంది.

ఏమైనా.. గన్నవరం ఉప ఎన్నిక ఏపీ అధికార పార్టీలో కొత్త రచ్చకు కారణమయ్యే అవకాశం ఉందన్న మాట వినిపిస్తోంది.దీన్ని జగన్ ఎలా కంట్రోల్ చేస్తారో చూడాలి.