ఐపీఎల్.. అసలేం జరగబోతోంది?

August 05, 2020

ముందునుంచి అందరూ ఊహించిందే జరిగింది. ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌-13వ సీజన్‌ వాయిదా పడింది. ఈ నెల 29 నుంచి ప్రారంభం కావలసిన లీగ్‌ను... వచ్చే నెల 15కు వాయిదా వేస్తూ బీసీసీఐ నిర్ణయం తీసుకుంది. కరోనా ఎఫెక్ట్‌వల్లే ఈ నిర్ణయం తీసుకుంది.

దేశంలో వైరస్ వ్యాపించకుండా కేంద్రం అనే జాగ్రత్తలు తీసుకుంది. ప్రేక్షకులు లేకుండా క్లోజ్డ్‌ డోర్స్‌లో మ్యాచ్‌లు నిర్వహించుకోవాలని బీసీసీఐకి సూచించింది. ఈ నిర్ణయాన్ని అమలు చేయడానికి ఫ్రాంచైజీలు ఇష్టపడలేదు. ప్రేక్షకులు లేని ఐపీఎల్‌ను ఊహించలేమని, తాము భారీగా నష్టపోతామని బీసీసీఐకి వెల్లడించాయి.

భారీగా జనం గుమికూడేందుకు అవకాశముంది కాబట్టి మ్యాచ్‌లను నిర్వహించలేమని కర్ణాటక, హర్యానా, మహారాష్ట్ర, ఢిల్లీ ప్రభుత్వాలు ఇప్పటికే బీసీసీఐకి తేల్చిచెప్పాయి. మ్యాచ్‌లకు అన్ని వైపుల నుంచి అవాంతరాలు ఎదురవడంతో, కనీసం రెండు వారాల పాటు లీగ్‌ను వాయిదా వేయాలని ఫ్రాంచైజీలు బీసీసీఐని కోరాయి. అందుకు బీసీసీఐ ఓకే చెప్పింది.

ఏప్రిల్‌ 14 వరకు విదేశీ ఆటగాళ్లు కూడా అందుబాటులో ఉండరు కాబట్టి, వాయిదా నిర్ణయం తీసుకున్నట్లు బీసీసీఐ అధికారి చెప్పారు. పరిస్థితులన్నీ అనుకూలిస్తే, ఏప్రిల్‌ 15 నుంచి ఐపీఎల్‌ను చూడొచ్చు. శనివారం ఐపీఎల్‌ గవర్నింగ్‌ సమావేశంలో ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది. ఏదోకరకంగా మ్యాచ్‌లు నిర్వహిస్తారని ఇన్నాళ్లు అనుకున్న క్రికెట్‌ ప్రియులు బీసీసీఐ నిర్ణయంతో నిరాశపడుతున్నారు. ఒకవేళ బీసీసీఐ కాంప్రమైజ్‌ అయ్యి , క్లోజ్డ్‌ డోర్స్‌ మధ్య లీగ్‌లు పెట్టినా ఉపయోగం ఉండదని, మైదానంలో మ్యాచ్‌ చూస్తేనే మజాగా ఉంటుందని సోషల్ మీడియాలో సందేశాలు పంపుకుంటున్నారు. అందుకే ఏప్రిల్ 15 వరకు ఆగకతప్పదని చెప్పుకుంటున్నారు.