ఐపీఎల్‌కు రంగం సిద్ధమవుతోందా?

August 13, 2020

ఇండియన్ ప్రిమియర్ లీగ్.. ప్రపంచ క్రికెట్ ప్రియుల ఫేవరెట్ క్రికెట్ లీగ్. ఇక భారతీయ క్రికెట్ లవర్స్ అయితే దీన్ని ఎంతగా అభిమానిస్తారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అంతర్జాతీయ టోర్నీలను మించి ఆదరణ సంపాదించుకున్న లీగ్ ఇది.

ప్రతి వేసవిలో అభిమానులంతా రెండు నెలల పాటు ఈ లీగ్‌లో మునిగి తేలుతారు. ఐతే ఈ వేసవిలో కరోనా పుణ్యమా అని అన్ని వినోదాలతో పాటు ఐపీఎల్‌ను కూడా మిస్సయిపోయారు. ఐతే పరిస్థితులు చక్కబడితే.. ఈ ఏడాది ఏదో ఒక సమయంలో లీగ్ నిర్వహిద్దామని బీసీసీఐ చూస్తోంది. కానీ మొన్నటిదాకా పరిస్థితి చూస్తే ఈసారికి ఐపీఎల్ మీద ఆశలు వదులుకోవాల్సిందేనేమో అనిపించింది. ఐతే తాజా పరిణామాల నేపథ్యంలో లీగ్‌పై ఆశలు చిగురిస్తున్నాయి.

లాక్ డౌన్-4కు సంబంధించిన విధి విధానాల్లో భాగంగా కేంద్ర ప్రభుత్వం చాలా మినహాయింపులే ఇచ్చింది. దేశంలో క్రీడా కార్యకలాపాలు మొదలుపెట్టుకోవచ్చని చెప్పింది. కాకపోతే కొన్ని నిబంధనలు తప్పక పాటించాలని అంది. స్టేడియాల్లోకి జనాల్ని అనుమతించకుండా టోర్నీలో టోర్నీలు నిర్వహించుకోవచ్చని తెలిపింది.

స్టాండ్స్‌లో అభిమానులు లేకుండా ఐపీఎల్ అంటే చాలా బోరింగ్‌గా ఉంటుందన్న మాట వాస్తవం. కానీ కనీసం ఆ రకంగా అయినా ఐపీఎల్ చూస్తే చాలన్న ఫీలింగ్ చాలా మందిలో ఉంది. ఐపీఎల్‌ను పూర్తిగా రద్దు చేస్తే ఏకంగా రూ.4 వేల కోట్ల నష్టం వస్తుందని బీసీసీఐ అంటోంది. అభిమానుల్ని స్టేడియాలకు దూరం పెట్టడం వల్ల నష్టం ఉంటుంది, ఫీల్ పోతుంది కానీ.. ఖాళీ స్టేడియాల్లో అయినా సరే లీగ్ నిర్వహిస్తే నష్టాన్ని చాలా వరకు తగ్గించుకోవచ్చు.

జూన్ నుంచి వర్షా కాలం మొదలై సెప్టెంబరు వరకు కొనసాగుతుంది. ఈ సమయంలో లీగ్ నిర్వహిస్తే చాలా మ్యాచ్‌లు రద్దవుతాయి. అలాగే విమాన ప్రయాణాలపై వివిధ దేశాలు ఆంక్షలు విధించిన నేపథ్యంలో రాబోయే మూణ్నాలుగు నెలల్లో లీగ్ నిర్వహిస్తే విదేశీ క్రికెటర్లు రారు. ఎలాగూ అక్టోబరులో నిర్వహించాల్సిన టీ20 ప్రపంచకప్ వాయిదా వేసేలా ఉన్నారు కాబట్టి ఆ నెలలోనే ఐపీఎల్‌ను ఆరంభించే అవకాశాలున్నాయి.