పాపం ఆయన.. పులుసులో ములక్కాయ అయ్యారుగా?

August 13, 2020

ఆశ చేసే చేటు అంతాఇంతా కాదు. అనుకుంటాం కానీ.. మనకు ఎదురయ్యే కష్టనష్టాలన్నింటికి మూల కారణం ‘ఆశ’నే. తాత్కాలిక ప్రయోజనం కోసం చూస్తే.. చివరకు ఏమవుతుందన్న విషయం ఏపీ ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ ఎపిసోడ్ ను చూస్తే ఇట్టే అర్థం కాక మానదు. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి ఏరికోరి పదవి ఇస్తానంటే.. వెంటనే ఓకే చెప్పేయటం వల్ల జరిగే నష్టం ఎంతన్నది? కష్టం ఎలా ఉంటుందన్నది తాజాగా రిటైర్డ్ జడ్జి జస్టిస్ కనగరాజ్ కు అర్థమవుతుందేమో?

ఏపీ ఎన్నికల కమిషనర్ గా వ్యవహరిస్తున్న ఆయన్ను.. సుప్రీం ఆదేశాల నేపథ్యంలో చివరకు చేసేదేమీ లేని పరిస్థితుల్లో అర్థరాత్రి వేళ జీవో జారీ చేసి.. తనకేమాత్రం పొసగని నిమ్మగడ్డ రమేశ్ కుమార్ ను నియమిస్తూ జీవో జారీ చేయటం తెలిసిందే. ఈ మొత్తం ఎపిసోడ్ లో నిమ్మగడ్డ తాను అనుకున్నది సాధిస్తే.. అనవసరమైన పట్టుదలకు పోయి ఇబ్బందికర పరిస్థితిని తెచ్చుకున్నారు ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. ఈ ఇద్దరి విషయాన్ని పక్కన పెడితే.. ఈ మొత్తం ఎపిసోడ్ తో ఏ మాత్రం సంబంధం లేకుండా.. తమిళనాడులో తన బతుకు తాను బతుకుతున్న రిటైర్డ్ జడ్జి జస్టిస్ కనగరాజ్ పరిస్థితి చూస్తే మాత్రం అయ్యో అనుకోవాల్సిందే.

ఏరికోరి తనను ఏపీ ఎన్నికల కమిషనర్ గా నియమిస్తూ ఒక రాష్ట్ర ప్రభుత్వం తన ముందుకు ప్రపోజల్ పెట్టినప్పుడు.. న్యాయశాస్త్రంలో అనుభవం ఉన్న పెద్దాయన.. కాస్త ఆలోచించాల్సి ఉంది. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి తన ఎజెండాలో భాగంగా తనకు ఆఫర్ ఇవ్వటాన్ని రిటైర్డు జడ్జిగా వ్యవహరిస్తున్న ఆయన అర్థం చేసుకొని ఉంటే.. ఇప్పుడీ ఇబ్బందికర పరిస్థితి వచ్చేదే కాదు. ఈ మొత్తం ఎపిసోడ్ చెప్పే నీతి మరొకటి కూడా ఉంది. పాలకుల అండతో కీలక పదవులు లభిస్తే ఏం ఫర్లేదన్న ధీమా ఇకపై ఉండదేమో?

నిజానికి పాలకుల ప్రాపకం కోసం ఇటీవల కాలంలో కొందరు అత్యున్నత స్థానాల్లో  ఉన్న వారు వ్యవహరిస్తున్న వైనం విమర్శలకు కారణంగా మారుతోంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇలాంటి పరిస్థితి తరచూ కనిపిస్తోంది. ఇలాంటి సంప్రదాయం ఏ మాత్రం మంచిది కాదన్న వాదన వినిపిస్తున్నా.. ఎవరు పట్టించుకోని పరిస్థితి.

పాలకులు చెప్పినట్లుగా చేసుకుంటూ పోతే.. మిగిలిన వ్యవస్థలు చూస్తూ ఊరుకోవన్న విషయం తాజా ఎపిసోడ్ తో అర్థమైనట్లే. పాలకులే స్వయంగా వచ్చి స్వాగతం పలికితే.. అందులోని మర్మాన్ని అర్థం చేసుకోకుండా.. వారు చెప్పినట్లు చేయటానికి సిద్ధమైతే చివరకు ఏమవుతుందన్న విషయం రిటైర్డు జడ్జి జస్టిస్ కనగరాజ్ కు మాత్రమే కాదు.. చాలామందికి అర్థమవుతుందని చెప్పక తప్పదు. 

Read Also

CRDA : రాజధాని బిల్లులకు గవర్నర్ ఆమోదం !
కొరటాల గారు.. ఆ ఇద్దరు ఎవరు?
చిలకపచ్చ చీర, జడలో మల్లెపూలు... శృం-గార రాణి