జయరాం కేసుతో జగన్‌కు ఏంటి ప్రయోజనం...?

May 29, 2020

తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర సంచలనం అయిన కోస్టల్‌ బ్యాంకు డైరెక్టర్, ఎన్నారై చిగురుపాటి జయరాం హత్య కేసులో భయంకర నిజాలు బయటికొస్తున్నాయి. మొదటి దీనిని రోడ్డు ప్రమాదంగా భావించడం.. తర్వాత అనుమానాస్పద మృతి అని అనుకోవడం.. చివరికి ఇది హత్యేనని తేల్చేయడం.. ఇలా జయరాం హత్య కేసు ఎన్నో మలుపులు తిరుగుతూ వచ్చింది. ఆయనను చంపింది రాకేశ్‌రెడ్డేనని ఏపీ పోలీసులు తేల్చేశారు. జయరామ్‌కు రాకేశ్‌ రూ.4.15 కోట్లు అప్పు ఇచ్చాడని, వాటిని వసూలు చేసుకునే క్రమంలోనే హత్య చేశాడని వారు వివరించారు. రాకేశ్‌ను ప్రధాన నిందితుడిగా, అతనికి సహకరించిన వాచ్‌మన్‌ను ఏ2గా చేర్చి.. మొదటి నుంచీ ఆరోపణలు ఎదుర్కొన్న జయరాం మేనకోడలు శిఖా చౌదరికి ఈ కేసుతో సంబంధం లేదని పోలీసులు తేల్చారు.

దీంతో ఈ కేసు కొత్త మలుపు తిరిగింది. జయరాం హత్య కేసు ప్రారంభం నుంచీ శిఖా చౌదరి పాత్రపైనే అందరికీ అనుమానాలు కలిగాయి. ఈ కారణంగానే ఆయన భార్య పద్మశ్రీ జూబ్లీహిల్స్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ కేసులో ఏపీ పోలీసులు జరిపిన దర్యాప్తు సంతృప్తి కరంగా లేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. హైదరాబాద్‌లో హత్య జరిగింది కాబట్టి కేసును ఇక్కడికే బదిలీ చేయాలని కోరారు. ఆమె ఫిర్యాదు మేరకు ఏపీ పోలీసులు ఈ కేసును తెలంగాణకు బదిలీ చేశారు. దీంతో హైదరాబాద్‌లోని సీపీ కార్యాలయంలో పోలీసులు సమీక్ష నిర్వహించారు.

 

తెలుగు రాష్ట్రాల్లో కలకలం రేపిన ఈ కేసును వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి కేసుకు ముడిపెడుతున్నారు కొందరు వైసీపీ నాయకులు. ఏపీ పోలీసులపై తమ అధినేతకు నమ్మకం లేదంటే అంతా విమర్శలు చేశారని, ఇప్పుడు అదే పరిస్థితి ఏర్పడిందని వారు అంటున్నారు. విశాఖ ఎయిర్‌పోర్టులో జగన్‌పై హత్యాయత్నం జరిగిన సమయంలో ఏపీకి చెందిన పోలీసులు బృందం హైదరాబాద్‌లో ఉన్న జగన్ వద్దకు వచ్చి విచారణ చేయబోయింది. ఆ సమయంలో వారికి వాంగ్మూలం ఇచ్చేందుకు ఆయన నిరాకరించారు. అప్పుడు సిటీ న్యూరో సెంటర్‌లో చికిత్స పొందుతున్న జగన్‌ కలుసుకుని వాంగ్మూలం ఇవ్వాల్సిందిగా పోలీసులు కోరారు. అయితే, తనకు ఏపీ పోలీసులపై నమ్మకం లేదన్న జగన్‌.. వారికి వాంగ్మూలం ఇచ్చేందుకు నిరాకరించారు.

ఏదైనా ఏజెన్సీ వారితో కలిసి వస్తే వాంగ్మూలం ఇస్తానని చెప్పారు. దీంతో పోలీసుల బృందం అక్కడి నుంచి వెనుదిరిగింది. ఇప్పుడు జయరాం భార్య కూడా అదే తరహా వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యతను సంతరించుకుంది. జగన్ కోర్టులో వేసిన పిల్ మేరకు కోడికత్తి కేసు ఎన్ఐఏ(జాతీయ దర్యాప్తు బృందం)కు బదిలీ చేశారు. ఇప్పుడు పద్మశ్రీ ఫిర్యాదుతో జయరాం కేసును తెలంగాణకు బదిలీ చేశారు. ఇక్కడి పోలీసులు చేసే దర్యాప్తులో శిఖా చౌదరి పాత్ర ఉన్నట్లు తేలితే పద్మశ్రీ ఆరోపణలకే కాదు.. జగన్ చేసిన వాదనకూ బలం చేకూరినట్లు అవుతుంది. ఇదే జరిగితే జగన్‌కు కూడా ప్రయోజనం కలిగినట్లేనని భావించాల్సిన పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇలాంటి ఉత్కంఠ పరిస్థితుల్లో జయరాం కేసు ఎలా సాగబోతుందోనన్న ఆసక్తి అందరిలో నెలకొంది.