జగన్ రాజధాని విశాఖకు పాకిస్తాన్ నుంచి ముప్పు

August 03, 2020

ఏపీ సీఎం జగన్ తన ప్రధాన రాజధానిగా మలచుకునేందుకు సిద్ధమవుతున్న విశాఖ నగరానికి పాకిస్తాన్ ఐఎస్ఐ నుంచి భారీ ముప్పు ఉందని తాజా ఘటనలు అప్రమత్తం చేస్తున్నాయి. దశాబ్దాల కిందట పాకిస్తాన్‌తో యుద్ధ సమయంలోనే విశాఖపట్నంపై దాడులకు పాకిస్తాన్ ప్రయత్నించిన సంగతి తెలిసిందే. అనంతరం యుద్ధ వ్యూహాలు మార్చుకున్న పాకిస్తాన్ భారత్‌లో ఉగ్రవాద కార్యకలాపాలు పెంచి తీరని నష్టం కలిగిస్తోంది. పాకిస్తాన్ నుంచి అలా తీవ్రమైన ముప్పు ఉన్న భారతీయ నగరాల్లో విశాఖ కూడా ఒకటని తాజా ఘటనలు రుజువు చేస్తున్నాయి. ముఖ్యంగా విశాఖ పట్నానికి 80 కిలోమీటర్ల దూరంలో తాజాగా శ్రీకాకుళంలో జిల్లాలో ఐఎస్ఐ ఏజెంట్లు అరెస్టు కావడం సంచలనంగా మారింది. విశాఖను లక్ష్యంగా చేసుకునే పాక్ ఐఎస్ఐ ఏజెంట్లు ఉత్తరాంధ్రలో ప్రవేశించారని నిఘా వర్గాల నుంచి సమాచారం తెలుస్తోంది.
ఉత్తరాంధ్ర జిల్లా శ్రీకాకుళంలో ఐఎస్‌ఐ ఆనవాళ్లు పోలీసులను షాక్‌కు గురిచేశాయి. శ్రీకాకుళం జిల్లాలోని చిలకపాలెం టోల్‌ గేట్ ప్రాంతంలో ఐఎస్ఐ ఏజెంట్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఇంటిలిజెన్స్ రిపోర్ట్ అందడంతో, అతన్ని అదుపులోకి తీస్కోని ఎన్‌ఐఏకి సమాచారం అందించారు. ప్రస్తుతం అతడ్ని రహస్య ప్రాంతంలో విచారిస్తున్నారు.
దక్షిణ భారత దేశంలో ముఖ్యంగా ఏపీలోని విశాఖలో భారీ దాడులకు పాల్పడేందుకు, ఐఎస్‌ఐ ఏపీ నుంచి వ్యూహాలు రచిస్తోందా అన్న అనుమానాలు కలుగుతున్నాయి. ప్రధానమైన రేవు పట్టణం కావడం.. అభివృద్ధి చెందిన నగరం కావడంతో దీనిపై పాక్ కన్ను పడిందన్న అనుమానాలు నిఘా వర్గాల నుంచి వినిపిస్తున్నాయి.