ఐటీ కంపెనీలు పరార్‌!

August 03, 2020

ఐటీ కంపెనీలు పరార్‌!
ఇప్పటికే కొన్ని హైదరాబాద్‌కు
రాజధాని మారితే మరిన్ని జంప్‌!
గుంటూరు, బెజవాడల్లో పెట్టిన సంస్థలకు షాక్‌
అమరావతిని చూసే వాటిలో 90 శాతం ఇక్కడకు
మాతృభూమిపై ప్రేమతో మరికొందరు ముందుకు
రాజధాని తరలింపు దెబ్బతో అవీ వెనక్కి!
విస్తరణ ప్రాజెక్టుల యోచన విరమణ 


నవ్యాంధ్రలో ఏర్పాటైన అనేక ఐటీ కంపెనీలు మెల్లగా తమ దారి తాము చూసుకుంటున్నాయి. సీఎం జగన్‌ దెబ్బకు రోజుకొకటి చొప్పున పరారవుతున్నాయి. విశాఖపట్నం నుంచి శ్రీసిటీ వరకు పెట్టిన అనేక సంస్థలు హైదరాబాద్‌, చెన్నై, పుణే, బెంగళూరులకు తరలిపోతున్నాయి. నెల్లూరు, చిత్తూరుల్లో తమ ప్రాజెక్టులను విస్తరించాలనుకున్న కంపెనీలు కూడా.. ఆ యోచన విరమించుకుంటున్నాయి. వేరే నగరాల్లో నేరుగా కార్యాలయాలను ఏర్పాటు చేసుకుంటున్నాయి. వీలువెంబడి ఇక్కడి నుంచి తరలిపోవాలని భావిస్తున్నాయి.

ఏదైనా రాష్ట్రానికి ఓ ఐటీ కంపెనీ రావడం అంటే మాటలు కాదు. కానీ పెట్టిన కంపెనీలను భయపెట్టే ప్రభుత్వం ప్రపంచంలో మనకు ఎక్కడా కనిపించదు. ఒక్క ఆంధ్రలోనే జగన్‌ ప్రభుత్వం కనిపిస్తోంది. ఆంధ్రప్రదేశ్‌లో ఐటీ అంటే విశాఖే. ఐటీ కంపెనీలకు అదో గమ్యస్థానం. గత ప్రభుత్వం కూడా విశాఖను ఐటీ, ఫిన్‌టెక్‌ హబ్‌గా ప్రోత్సహించింది. అభివృద్ధి వికేంద్రీకరణలో భాగంగా అప్పట్లో రాజధాని అమరావతికీ కొన్ని ఐటీ కంపెనీలను తీసుకొచ్చారు. సాధారణంగా ఐటీ కంపెనీలు విశాఖకు రావడానికే ఇష్టపడతాయి. అమరావతి ప్రాంతానికి వచ్చిన ఐటీ కంపెనీల్లో 90 శాతం రాజధానిగా అమరావతి ఉందన్న కారణంతోనే వచ్చాయి. రాజధానికి సమీపంలో ఉంటే ప్రభుత్వ కార్యాలయాల్లోని కాంట్రాక్టులు, ఇతరత్రా ప్రాజెక్టులు వస్తాయని వాటి అంచనా. రాష్ట్రంలో ప్రభుత్వం మారిన ఈ ఆరేడు నెలల్లో వీటిలో కొన్ని హైదరాబాద్‌కు తరలిపోయాయి. ఇప్పుడు రాజధాని మారితే మరికొన్ని కూడా రాష్ట్రం దాటిపోతాయనే ఆందోళన సర్వత్రా వ్యక్తమవుతోంది. గత ప్రభుత్వం హయాంలో గన్నవరం ప్రాంతంలో దిగ్గజ ఐటీ కంపెనీలు వచ్చాయి.

గన్నవరం విమానాశ్రయం సమీపంలోని మేథా టవర్స్‌ మొత్తం నిండిపోయింది. ఐటీ కంపెనీలకు స్పేస్‌ లేక మరో రెండు కొత్త టవర్లు కొత్తగా నిర్మిస్తున్నారు. హెచ్‌సీఎల్‌ తమకు ప్రత్యేకంగా కొత్త భవనం నిర్మించుకుంది. 28 ఎకరాల్లో అద్భుతమైన భవనం కట్టుకుంది. ఇప్పుడది ప్రారంభోత్సవానికి సిద్ధంగా ఉంది. అలాగే, అమెరికా, బ్రిటన్‌, ఆస్ర్టేలియా, దుబాయ్‌ లాంటి దేశాల్లో స్థిరపడిన ప్రవాసులు, అక్కడ ఐటీ రంగంలో ఉన్నవారు, మాతృభూమిపై ప్రేమతో ఇక్కడ కార్యాలయం ప్రారంభించాలని అనుకున్నారు. ప్రధాన బ్రాంచ్‌ కాకుండా మరో బ్రాంచ్‌ మాత్రమే పెట్టాలి, అది స్వరాష్ట్రంలోనే పెట్టాలి అనుకున్నప్పుడు.. రాజధాని ఉంది కాబట్టి అటు విజయవాడ, ఇటు గుంటూరులను ఎంచుకున్నారు. ఇలా ఎన్నడూ లేనిది విజయవాడ, గుంటూరు, తాడేపల్లి, మంగళగిరిల్లో కూడా పలు ఐటీ కంపెనీలు ప్రారంభమయ్యాయి. ఒకేరోజు పదుల సంఖ్యలో ఐటీ కంపెనీలను ప్రారంభించిన సందర్భాలూ ఉన్నాయి. చిన్న కంపెనీలే అయినా.. ఇవి కూడా పలువురికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించాయి. ఇలాంటి కంపెనీలకు రాజధాని తరలింపు దిగ్భ్రమ కలిగిస్తోంది. సాధారణంగా తయారీ రంగం పరిశ్రమలు, సెజ్‌లు, ఎంఎస్‌ఎంఈలను ఎక్కడైనా పెడతారు. వాటికి కావలసిన నీరు, ఇతర మౌలిక సదుపాయాలుంటే చాలు.

కానీ ఐటీ రంగం ప్రత్యేకమైంది. ఈ రంగం రావాలంటే కొంత విభిన్న వాతావరణం ఉండాలి. కాస్మోపాలిటన్‌ నగర వాతావరణం, ఇతర హంగులు అవసరం. ఇవన్నీ ఉన్నచోటకే ఐటీ సంస్థలు రావడమే కాదు.. వారికి అవసరమున్న నైపుణ్య మానవ వనరులూ అక్కడే లభిస్తాయి. మన రాష్ట్రంలో ఆ వాతావరణం ఎక్కువగా ఉన్నది విశాఖలోనే. ఆ వాతావరణం లేకపోయినా అమరావతికి వచ్చిన చాలా కంపెనీలు.. రాజధాని మార్పు చేస్తే మాత్రం రాష్ట్రం దాటిపోవడమో లేదంటే విశాఖకు వెళ్లిపోవడమే జరగొచ్చనని అంటున్నారు. జగన్‌ పాలన చూస్తున్నవారు ఎవరూ విశాఖకు వెళ్లరు. మళ్లీ అక్కడ ఆయన ఏం చేస్తాడోనన్న భయమే దీనికి కారణం.