అది ఊటీ కాదు...జపాన్

August 12, 2020

కరోనా మహమ్మారిని దీటుగా ఎదుర్కొనేందుకు వీలుగా కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా 21 రోజుల షట్ డౌన్ ప్రకటించిన సంగతి తెలిసిందే. దీంతో, దాదాపుగా దేశప్రజలంతా ఇళ్లకే పరిమితమయ్యారు. లాక్ డౌన్ సమయంలో ఇంట్లో ఊసుపోక చాలామంది మెమేలు, టిక్ టాక్ వీడియోలు చేసి సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నారు. లాక్ డౌన్ సమయంలో ప్రజలంతా.... పంజరంలోని చిలకలా...ఆక్వేరియంలోని చేపల్లా గిలగిలా కొట్టుకుంటున్నారని...పక్షులు, జంతువులు తమను బంధించినపుడు ఇలాగే ఫీల్ అవుతాయని సోషల్ మీడియాలో పోస్ట్ లు వైరల్ అవుతున్నాయి. ఇక, లాక్ డౌన్ పుణ్యమా అంటూ రోడ్లపైకి వాహనాలు రాకపోవడంతో ధ్వని, శబ్ద కాలుష్యం తగ్గి రోడ్లన్నీ నిర్మాణుష్యంగా మారాయని....ఈ క్రమంలోని అడవుల్లోని వణ్యప్రాణులకు స్వేచ్ఛ దొరికిందని అంటున్నారు. లాక్ డౌన్ నేపథ్యంలోనే ఊటీ-కోయంబత్తూర్ రోడ్డుపై ఓ జింకల మంద సేద తీరుతున్న ఫొటో ఒకటి ట్విట్టర్ లో వైరల్ అయింది. అయితే, తాజాగా ఆ ఫొటో ఊటీలో తీసింది కాదని....జులై 28, 2014లో జపాన్ లో తీసిందని తేలడంతో ఆ ఫొటో పోస్ట్ చేసిన నెటిజన్ అవాక్కయ్యాడు.

చేతిలో స్మార్ట్ ఫోన్...అందుబాటులో మొబైల్ డేటా, వైఫై ఉండడంతో సోషల్ మీడియా వాడకం ఎక్కువైపోయింది. చాలామంది సోషల్ మీడియా యూజర్లు, నెటిజన్లు...తమ వాట్సాప్ లోనో..ట్విట్టర్లోనో వచ్చిన ప్రతి పోస్టును ఫార్వార్డ్ చేసేస్తే...తమ పనైపోయిందన్నట్టు ఫీలవుతుంటారు. కొన్ని సార్లు ఇలాగే తప్పుడు వార్తలు, వదంతులు వ్యాప్తి చెంది మత కలహాలు, గొడవలకు దారి తీసిన సందర్భాలూ ఉన్నాయి. ఇక, తాజాగా వైరల్ అవుతున్న జింకల మంద ఫొటో కూడా ఆ తరహాదే. జపాన్ లోని నారా ప్రాంతంలో ఈ జాతి జింకలను దైవదూతలుగా భావించి బోన్ లలో నిర్బంధించడం.పార్కుల్లో కట్టడి చేయడం వంటివి చేయరు. అందుకే, ఇవి జపాన్ రోడ్ల మీద ఫ్రీగా సంచరిస్తుంటాయి. 2014లో ఇలా రోడ్ల మీదకు వచ్చిన జింకల గుంపు ఫొటోను కొందరు జపాన్ వాసులు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఈ ఫొటోను తాజాగా లాక్ డౌన్ సందర్భంగా జంతువులకు స్వేచ్ఛ లభించిందంటూ.... ఐపీఎస్ అధికారి ధలివాల్ ట్విట్టర్ లో షేర్ చేశారు. అందులోని సైన్ బోర్డులు జపనీస్ భాషలో ఉన్నాయి. దీంతో, ఈ ఫొటో జపాన్ లో ఏడేళ్ల క్రితం తీసిందని తెలియడంతో తన పోస్ట్ డిలీట్ చేశారు. అందుకే, ఏదైనా సమాచారాన్ని షేర్ చేసేముందు కనీస స్థాయిలో చెక్ చేయడం అవసరం. ఏమంటారు?