ముస్లింలపై జగన్ కు ప్రేమ... ఇప్పుడు తేలిపోవడం పక్కా

June 01, 2020
CTYPE html>
రాష్ట్రంలోని బడుగు బలహీన వర్గాలతో పాటు ముస్లిం మైనారిటీలకు ఏ ఒక్క ప్రభుత్వం ఇవ్వనంత ప్రాధాన్యం ఇస్తున్నామని చెబుతున్న వైసీపీ అధినేత, ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి ఇప్పుడు నిజంగానే అసలు సిసలు పరీక్ష ఎదురు కాబోతోంది. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ప్రతిపాదించిన సీఏఏ, ఎన్నార్సీలకు తాము వ్యతిరేకమని వైసీపీ చెప్పింది కదా. ఆ మాట మేరకు త్వరలో ప్రారంభం కానున్న అసెంబ్లీ సమావేశాల్లో సీఏఏ, ఎన్నార్సీలకు వ్యతిరేకంగా తీర్మానం చేయాలని ఓ ఎమ్మెల్యే పట్టుబడుతున్నారు. అంతేనా... వైసీపీకే చెందిన సదరు ఎమ్మెల్యే ఏకంగా జగన్ కే డెడ్ లైన్ తో పాటు వార్నింగ్ లాంటి మాటను కూడా వినిపించేశారు.
 
ఆ ఎమ్మెల్యే ఎవరు? జగన్ కు ఆ ఎమ్మెల్యే ఇచ్చిన వార్నింగ్ ఏమిటన్న వివరాల్లోకి వెళితే,... మొన్నటి ఎన్నికల్లో గుంటూరు తూర్పు స్థానం నుంచి వైసీపీ అభ్యర్థిగా బరిలోకి దిగిన మహ్మద్ ముస్తఫా ఘన విజయం సాధించారు. వరుసగా రెండోసారి ఎమ్మెల్యేగా గెలిచిన ముస్తఫాకు ఈ దఫా మంత్రి పదవి ఖాయమని అంతా అనుకున్నారు. అయితే ముస్తఫాను పక్కనపెట్టేసిన జగన్ తన సొంత జిల్లా కడపకు చెందిన అంజాద్ బాషాకు మంత్రి పదవి ఇవ్వడంతో పాటుగా డిప్యూటీ సీఎం పోస్టు కేటాయించేశారు. సరే... ఎలాగూ ముస్లింలకు ప్రాధాన్యం దక్కింది కదా అన్న భావనతో ముస్తఫా సర్దుకుపోయారట. అయితే దేశంలోని ముస్లిం మైనారిటీలకు అశనిపాతంగా పరిగణిస్తున్న ఎన్నార్సీ, సీఏఏలను అస్త్రాలుగా చేసుకున్న ముస్తఫా.. జగన్ కు ఏకంగా సవాల్ లాంటి మాటను హెచ్చరిక రూపంలో ఇచ్చేశారు.
 
వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో సీఏఏ, ఎన్నార్సీలకు వ్యతిరేకంగా తీర్మానం చేసి కేంద్రానికి పంపాల్సిందేనని ముస్తఫా డిమాండ్ చేశారు. ఆదివారం గుంటూరులో నిర్వహించిన సింహగర్జన సదస్సులో పాల్గొన్న ముస్తఫా మాట్లాడుతూ, త్వరలో జరగబోయే అసెంబ్లీ సమావేశాల్లో సీఏఏ, ఎన్నార్సీలకు ప్రభుత్వం తీర్మానం చేస్తుందని, లేనిపక్షంలో ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని సంచలన ప్రకటన చేశారు. ముస్లింల సంక్షేమానికి వ్యతిరేకంగా జగన్ వ్యవహరించబోరన్న నమ్మకం తనకు ఉందని ఆయన అన్నారు. ఈ వ్యాఖ్యల ద్వారా జగన్ పై ఒత్తిడి పెంచేసిన ముస్తపా... తాను అనుకున్నది సాధిస్తారో, లేదంటే తాను పెట్టిన పరీక్షలో జగన్ ఫెయిల్ అయితే పార్టీని వీడి జగన్ కు ఝలక్ ఇస్తారో చూడాలి.