మెగా కృష్ణారెడ్డి ఇంట్లో ఐటీ సోదాలు

July 12, 2020

మేఘా ఇంజినీరింగ్ ఆండ్ ఇన్ఫ్రాస్ట్ర‌క్చ‌ర్ లిమిటెడ్‌....ఈ పేరు గురించి ప‌రిచ‌యం అవ‌స‌రం లేదు. తెలుగు రాష్ట్రాలలో రెండు ప్ర‌భుత్వాల ముఖ్య‌మంత్రులు చేప‌డుతున్న‌, చేప‌ట్టిన ప్ర‌తిష్టాత్మ‌క ప్రాజెక్టులు, ఎత్తిపోత‌ల ప‌థ‌కాల‌ను ఈ కంపెనీయే నిర్మించింది. నిర్మిస్తోంది. తెలంగాణ ముఖ్య‌మంత్రి, టీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్‌కు, ఏపీ ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్ రెడ్డికి సంస్థ య‌జ‌మానులు స‌న్నిహితులనే ప్ర‌చారం సైతం ఉంది. ఇదిలాఉండ‌గా...తాజాగా మేఘా సంస్థ య‌జ‌మానుల నివాసంలో ఐటీ అధికారులు త‌నిఖీలు చేయ‌డం చ‌ర్చ‌నీయాంశంగా మారింది.
వివిధ మీడియా సంస్థ‌ల్లో, సోష‌ల్ మీడియాలో జ‌రుగుతున్న ప్ర‌చారం ప్ర‌కారం, ఐటీ అధికారులు ఏకకాలంలో మేఘా కృష్ణారెడ్డి ఇల్లు కార్యాలయాల్లో సోదాలను ఐటీ అధికారులు మొద‌లుపెట్టారు.జూబ్లీహిల్స్ చెక్ పోస్టులోని కార్యాలయం, బాలానగర్‌లోని కార్యాలయం,  ఎంసీహెచ్‌ఆర్డీ సమీపంలోని ఇంట్లో ఐటీ అధికారులు సోదాలు చేస్తున్నారు. ఈ వార్త పెద్ద ఎత్తున వైర‌ల్ అయింది. అయితే, దీనిపై మేఘా సంస్థ వివ‌ర‌ణ ఇచ్చింది. త‌మ కార్యాల‌యాల్లో ఐటీ సోదాలు నిజ‌మ‌ని తెలిపింది.  అయితే, ఇవి సాధార‌ణ త‌నిఖీలు మాత్ర‌మేన‌ని ప్ర‌క‌టించింది.

ఈ త‌నిఖీల‌ను సాధార‌ణ‌మైన అంశాలుగా మాత్ర‌మే ప‌రిగ‌ణించి...క‌వ‌రేజీ విష‌యంలో అంత ప్రాధాన్యంగా తీసుకోవ‌ద్ద‌ని కొంద‌రు జ‌ర్న‌లిస్టుల‌ను మేఘా సంస్థ ప్ర‌తినిధులు కోరారు. ఫార్వ‌ర్డ్ మెసేజ్‌ల‌ను ప‌ట్టించుకోవ‌ద్ద‌ని కోరారు. అయితే, ప‌లువురు జ‌ర్న‌లిస్టులు మాత్రం....ఈ త‌నిఖీల్లో ఏదైనా ముఖ్య‌మైన స‌మాచారాన్ని ఐటీ అధికారులు గుర్తిస్తే.. ఆ విష‌యం మేఘా సంస్థ వెల్ల‌డిస్తుందా? ఈ తనిఖీలను వార్త‌గా భావించ‌వ‌ద్ద‌ని త‌మకు ముందే స‌మాచారం ఇవ్వ‌డం ఏంట‌ని సందేహం వ్య‌క్తం చేస్తున్నారు.