ఐవైఆర్... కొన్నింటిపైనే ఎందుకు మాట్లాడతారు?

June 01, 2020

ఐవైఆర్ కృష్ణారావు... ఏమాత్రం పరిచయం అక్కర్లేని పేరే. ఎందుకంటే... ఉమ్మడి రాష్ట్రంలో సీనియర్ ఐఏఎస్ అధికారిగా, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా కీలకంగా వ్యవహరించడంతో పాటుగా తెలుగు నేల రెండు రాష్ట్రాలుగా విడిపోయిన నేపథ్యంలోనూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా పనిచేసిన అధికారిగా అందరికీ చిరపరచితులే. అంతేనా.. నవ్యాంధ్రలో చంద్రబాబు సర్కారు మొట్టమొదటి సారి ఏర్పాటు చేసిన బ్రాహ్మణ కార్పొరేషన్ కు చైర్మన్ గానూ వ్యవహరించిన ఐవైఆర్... ఆ తర్వాత చంద్రబాబునే వ్యతిరేకించి అవమానకర రీతిలో ఆ పదవి నుంచి తప్పుకున్నారు. మొత్తంగా అటు అధికారిగా, ఇటు బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ గా పనిచేసిన ఐవైఆర్... తెలుగు నేలలో అందరి నోళ్లలో నానుతున్న ప్రముఖ వ్యక్తే.

సరే... అంతా బాగానే ఉన్నా... ఇప్పుడు ఐవైఆర్ ప్రస్తావన ఎందుకన్న విషయానికి వస్తే.. ఎందుకనో గానీ... ఐవైఆర్ అన్ని విషయాలపై మాట్లాడతారు. అలాగని ఏ విషయానికి కూడా కట్టుబడి ఉన్నట్టుగా కనిపించరు. చంద్రబాబు సీఎంగా ఉన్న సమయంలో టీడీపీ ప్రభుత్వాన్ని విమర్శిస్తూ వ్యాఖ్యలు చేశారు. అదే సమయంలో జగన్ సీఎం అయ్యాక... వైసీపీ ప్రభుత్వాన్ని విమర్శిస్తూ కూడా సంచలన వ్యాఖ్యలు చేశారు. అయితే, చంద్రబాబును టార్గెట్ చేసినట్లు చేయలేదు. ఎక్కువ సార్లు ప్రతిపక్షాన్ని వ్యతిరేకించారు.  ఐవైఆర్ వ్యాఖ్యలు చూస్తే... తానొక్కరే పలువురు సీఎంల దగ్గర పనిచేసినట్టు, తానొక్కడికే అన్నీ తెలుసు అన్నట్లుగా వ్యవహారం ఉంటుందన్న వాదనలూ వినిపిస్తున్నాయి. ఈ కారణంగానే సోషల్ మీడియాలో ఐవైఆర్ ను విమర్శిస్తూ... ట్రోల్ చేస్తూ లెక్కలేనంత మంది కామెంట్లు పోస్టు చేస్తూ ఉంటారు. 

తాజాగా ఏపీ రాజధాని అమరావతిని రక్షించుకునేందుకు రాజధాని రైతులు ఉద్యమిస్తుంటే... వారికి మద్దతుగా పార్టీలు, ప్రజా సంఘాలతో పాటు పలువురు స్వామీజీలు కూడా రంగంలోకి దిగారు. రాజధాని రైతులకు మద్దతుగా స్వామీజీలు ఎంట్రీ  ఇచ్చిన వైనాన్ని విమర్శిస్తూ ఐవైఆర్ కొన్ని వ్యాఖ్యలు చేశారు. రాజధానితో స్వామీజీలకు ఏం పని? అంటూ వ్యాఖ్యానించిన ఐవైఆర్... స్వామీజీలకు రాజధాని అంశం అంత అవసరమా? రాష్ట్రంలో హిందూ ధర్మానికి పెను ముప్పు పొంచి ఉంది. దానిపై స్వాములు దృష్టి సారిస్తే మంచిదంటూ ఐవైఆర్ పేర్కొన్నారు. ఈ తరహాలో ఐవైఆర్ వ్యాఖ్యలు చూస్తే... ఆయనకు ఏదో ప్రత్యేక ఎజెండా ఉన్నట్టేనన్న అనుమానాలు కలుగున్నాయన్న వాదన వినిపిస్తోంది.  అయినా... అడక్కుండానే అన్నింట్లో వేలుపెడుతున్న ఐవైఆర్ ఉద్దేశమేంటో మరి?