స్ట్రాంగ్ కామెంట్... జగన్ ముమ్మాటికీ సుద్దపప్పే

August 03, 2020

వైసీపీ అధినేత, ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఇప్పుడు నిజంగానే అడ్డంగా బుక్కైపోయారు. అది కూడా నిండు శాసనసభలో ఆయన నోట నుంచి వచ్చిన ఓ డైలాగే ఆయనను పట్టించేసింది. అంతే... ఆయన సుద్దపప్పు అయిపోయారు. అసలు తానేం మాట్లాడుతున్నానన్న విషయాన్నే పట్టించుకోకుండా... తనకు తోచిన వివరాలను చెప్పేసుకుంటూ పోయిన జగన్ ను.... ఎన్నారై టీడీపీ నేత బుచ్చిరాంప్రసాద్ ఏమాత్రం ఆలస్యం లేకుండా పట్టేశారు. నెట్టింట జగన్ ను బుచ్చిరాంప్రసాద్ సుద్ద పప్పును చేసి పారేశారు. బుచ్చిరాంప్రసాద్ పోస్ట్ చేసిన ఈ పోస్ట్ ఇప్పుడు నిజంగానే వైరల్ గా మారిపోయింది.

అయినా నిత్యం ఎదుటి వారిపై విరుచుకుపడే జగన్... బుచ్చిరాంప్రసాద్ కు ఎలా దొరికారన్న వివరాల్లోకి వెళితే... సోమవారం ప్రారంభం అయిన ఏపీ శాసన సభా సమావేశాల్లో భాగంగా మహిళల భద్రతపై చర్చ జరిగింది. ఈ సందర్భంగా మహిళల రక్షణకు తీసుకోవాల్సిన చర్యలపై సభ చాలాసేపే చర్చించింది. ఈ చర్చలో పాలుపంచుకున్న జగన్... ఇటీవల తెలంగాణలో చోటుచేసుకున్న దిశ హత్యాచారంపై తనదైన శైలిలో వివరాలు చెప్పేశారు. బైక్ పై ఇంటి నుంచి బయలుదేరిన దిశ... టోల్ గేట్ వద్ద తన బైక్ కు ట్యాక్స్ కట్టేందుకు దిశ తన బైక్ ను ఆపితే... ఇదే అదనుగా నలుగురు నిందితులు ఆమెను ట్రాప్ చేశారని జగన్ చెప్పుకొచ్చారు. అయినా బైక్ కు టోల్ ట్యాక్స్ కట్టడమేమిటన్న విషయాన్ని సభ్యులు అంతగా పట్టించుకోలేదు. 

అయితే విదేశాల్లో ఉన్నా... ఏపీలో జరిగే రాజకీయ పరిణామాలు, అసెంబ్లీ సమావేశాలను ఎన్నారైలు ఆసక్తిగా తిలకిస్తారు కదా. అందులోనూ టీడీపీలో సభ్యులుగా ఉంటూ... ఎన్నారై టీడీపీలో కీలకంగా వ్యవహరిస్తున్న బుచ్చిరాంప్రసాద్ లాంటి వారైతే మరింత ఆసక్తిగా గమనిస్తారు. ఇలా సోమవారం నాటి అసెంబ్లీ సమావేశాలను తిలకిస్తున్న బుచ్చిరాంప్రసాద్...  బైక్ కు టోల్ ట్యాక్స్ కట్టేందుకు దిశ తన బైక్ ను ఆపారన్న మాటలు జగన్ నోట నుంచి వినిపించగానే అలర్ట్ అయిపోయారు. భారీ వాహనాలు, కార్లకు మాత్రమే టోల్ ట్యాక్స్ వసూలు చేయడం చూశామని, ఇలా బైక్ లకు కూడా టోల్ ట్యాక్స్ వసూలు చేస్తారన్న మాటను జగన్ నోట నుంచే విన్నామన్న బుచ్చిరాంప్రసాద్ వెనువెంటనే సోషల్ మీడియా వేదికగా జగన్ అజ్ఝానాన్ని ఎండగట్టేశారు. జగన్ ను సుద్దపప్పుగా అభివర్ణిస్తూ బుచ్చిరాంప్రసాద్ చేసిన పోస్ట్ ఇప్పుడు వైరల్ గా మారిపోయింది.