జగన్, బీజేపీ దోస్తీ ముగిసింది.. కుస్తీ మొదలైంది

July 15, 2020

ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాల్లో పరిస్థితులు క్రమంగా మారుతున్నాయి. బాలారిష్టాలను దాటుకుంటూ వైసీపీ ప్రభుత్వం కుదురుకుంటున్నకొద్దీ ఆ పార్టీకి శత్రువులు పెరుగుతున్నారు. ప్రథమ శత్రువు టీడీపీ తన విమర్శలు పెంచడం ఒకెత్తయితే ఎన్నికలకు ముందు, ఆ తరువాత కూడా కొద్దికాలం పాటు వైసీపీ పట్ల సానుకూలంగా వ్యవహరించిన బీజేపీ ఇప్పుడు వైసీపీని పూర్తిగా టార్గెట్ చేయడానికి నిర్ణయించుకున్నట్లే కనిపిస్తోంది. నిజానికి బీజేపీ బలం... మోదీ, అమిత్‌షాల సత్తా పూర్తిగా అర్థం చేసుకున్న జగన్ ఆదిలోనే ఆ పార్టీకి తాను విధేయుడినని చెప్పకనే చెప్పారు.. బీజేపీ తన వరకు రాకుండా, కనీసం రెండు టెర్ములు తనకు ఇబ్బందులు పెట్టకుండా ఉండాలంటే తగ్గి ఉండాలన్న సత్యం బోధపడి ఆయన వారికి సలాం కొట్టేశారు. ప్రధాని మోదీని కలిసినప్పుడు ఆయన బాడీ లాంగ్వేజ్ కానీ, దేశంలో నంబర్ 2 అయిన అమిత్ షాను కాదని ఏమీ చేయలేమని ఆయన తాను ప్రమాణ స్వీకారం చేసిన కొద్దిరోజులకే అనడం వంటివన్నీ దీని ఉదాహరణలు. అయితే, ఇవేవీ ఏపీలో విస్తరించాలన్నబీజేపీ కోరికలను ఆపలేకపోతున్నాయట. జగన్‌‌ను పాంపర్ చేయడం కన్నా రాజకీయంగా పాపర్ చేయడమే ఇప్పుడు ఆ పార్టీ టార్గెట్ అంటున్నారు.
మరోవైపు ఎన్నికలకు ముందు వరకూ బీజేపీతో సన్నిహితంగా ఉన్న జగన్, ఆ తరువాత కూడా విధేయత చూపిస్తున్నా అదంతా నటన అని బీజేపీ భావిస్తున్నట్లు తెలుస్తోంది. అందుకు కారణం విద్యుత్ పీపీఏలు, పోలవరం రీటెండర్లు  వంటి విషయాల్లో కేంద్రం మాటలను ఏమాత్రం పట్టించుకోకుండా జగన్ మొండి పట్టుదలకు పోవడమేనని తెలుస్తోంది. ఈ రెండు ఇష్యూస్ కేంద్రానికి కోపం తెప్పించాయంటున్నారు.
బీజేపీ అధిష్ఠానం వైఖరిని అర్థం చేసుకున్న రాష్ట్ర బీజేపీ కూడా వైసీపీపై పూర్తిస్థాయి పోరాటానికే సిద్ధమైంది. ఆ క్రమంలోనే ప్రధాన ప్రతిపక్షం టీడీపీ కంటే ఎక్కువగా ప్రభుత్వంపై విమర్శలు సంధిస్తోంది. అంతేగాక ప్రభుత్వ వ్యతిరేక నిరసన కార్యక్రమాలు సైతం భారీగానే నిర్వహిస్తోంది. ప్రధానంగా పోలవరం ప్రాజెక్టు రీ టెండర్ల ప్రక్రియ పూర్తయిన తరువాత ఇప్పుడు ఆ ప్రాజెక్టు నిర్మాణం నేరుగా కేంద్రమే చేపట్టేలా కార్యాచరణ సిద్ధమవుతోందని వార్తలు వస్తున్నాయి. ఈ ప్రాజెక్టుపై రాష్ట్ర ప్రభుత్వానికి ఎలాంటి ప్రత్యక్ష, పరోక్ష సంబంధాలు లేకుండా చేస్తుందని సమాచారం. ఇక పీపీఏ విధానంలో చేపట్టిన సౌర, పవన విద్యుత్‌ విషయంలో తమ మాట పెడచెవిన పెట్టినందున కేంద్రం బొగ్గు సరఫరా విషయంలో కూడా రాష్ట్రానికి సహకరించే అవకాశం లేదని బీజేపీ వర్గాలు వెల్లడిస్తున్నాయి. దీంతో రాష్ట్రంలో విద్యుత్‌ కొరత ఏర్పడటం ఖాయమని, అదే జరిగితే జనంలో జగన్‌ సర్కారుపై పూర్తిస్థాయి వ్యతిరేకత వస్తుందని వారు భావిస్తున్నారు.
ప్రస్తుతం రాష్ట్ర రాజకీయాల్లో జరుగుతున్న పరిణామాలతో భవిష్యత్తులో జరిగే ఎన్నికల్లో సీఎం జగన్‌కు బీజేపీ సహకారం ఉండబోదన్న సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. మరోవైపు రాష్ట్ర నాయకులు రాజకీయపరంగా వ్యవహరిస్తుండగా బీజేపీ ఏపీ వ్యవహారాలు చూసుకుంటున్న సునీల్ దేవధర్ పార్టీ నిర్మాణంపై దృష్టి పెట్టి క్షేత్ర స్థాయి నుంచి బలోపేతం చేసే ప్రయత్నాల్లో ఉన్నారు. స్థానిక నాయకత్వం, క్యాడర్‌ను ఏర్పాటు చేసుకుంటూ ఆయన బీజేపీని గ్రామస్థాయిలోనూ ప్రజలకు పరిచయం చేస్తున్నారు. ఇదంతా చూస్తుంటే జగన్‌ హానీమూన్ పీరియడ్ ముగిసి బీజేపీ ఆట మొదలైనట్లుగా అర్థమవుతోందని విశ్లేషకులు చెబుతున్నారు.

Read Also

రవి ప్రకాష్ పై తప్పుడు కేసు పెట్టినందుకు కస్టడీకి ఒప్పుకో ని నాంపల్లి కోర్ట్ 
ఆర్టీసీ సమ్మె పై 'టాక్ లండన్' బహిరంగ లేఖ
తెలంగాణ జర్నలిస్ట్‌లకు సందేశం--నేను మీ రవిప్రకాశ్