ఏపీలో ఒక మంచి పని జరుగుతోంది

August 05, 2020

కరోనా ప్రభావం మొదలైన కొత్తలో.. ఆ వైరస్ గురించి చేసిన వ్యాఖ్యలు, దాన్ని డీల్ చేసే తీరుతో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీవ్ర విమర్శలు, వ్యతిరేకత ఎదుర్కొన్నారు. దీనికి తోడు తెలంగాణ ముఖ్యమంత్రి సమర్థంగా కరోనా కట్టడి చర్యలు చేపడుతుంటే.. జగన్ ఆయన ముందు తేలిపోతున్నట్లు కనిపించారు.  ఐతే తర్వాత ఆయనకు వాస్తవం బోధపడింది.

నెగెటివిటీని తగ్గించుకోకపోతే కష్టమని అర్థమైంది. అప్పట్నుంచి జగన్‌ మార్పు చూపించారు. కట్ చేస్తే ఇప్పుడు కరోనా కట్టడిలో ఏపీపై ప్రశంసలు కురుస్తున్నాయి. దేశంలోనే అత్యధికంగా టెస్టులు చేసిన రాష్ట్రంలో ఒకటిగా ఏపీ కొనసాగుతుండటం విశేషం. ఇప్పటికే ఏపీలో 7 లక్షల దాకా టెస్టులు చేయడం విశేషం. రోజూ పది వేలకు తగ్గకుండా టెస్టులు చేస్తున్నారక్కడ. సోమవారం 16 వేలకు పైగా శాంపిల్స్‌ను పరీక్షించారు.

ఐతే మన జనాభాను బట్టి చూస్తే ఈ టెస్టుల సంఖ్య సరిపోదు. ఇంకా పెంచాల్సిన అవసరం ఉందన్నది వాస్తవం. ఈ నేపథ్యంలోనే ఏపీ ముఖ్యమంత్రి జగన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రం ప్రతి ఇంటికీ కనీసం ఒక శాంపిల్ సేకరించి పరీక్ష జరపాలని నిర్ణయించారు.

ఐతే ఇదంత సులువైన విషయం కాదు. కోటికి తక్కువ కాకుండా పరీక్షలు జరపాల్సి ఉంటుంది. అన్ని కిట్లు ఇప్పటికే సేకరించారా.. సేకరించబోతున్నారా అన్నది తెలియదు. ఇది భారీ ఖర్చుతో కూడుకున్న పని. అసలే ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్న రాష్ట్రానికి ఇది సవాలుతో కూడుకున్న విషయమే.

ఐతే జగన్ ఆదేశాలిచ్చారంటే ఇంటింటికీ కచ్చితంగా టెస్టులు చేయబోతున్నట్లే. ఇదే కనుక నిజంగా జరిగితే కరోనా కట్టడిలో కీలకమైన ముందడుగు పడ్డట్లే. అన్ని టెస్టులూ పూర్తయ్యేసరికి భారీగా కేసులూ బయటపడవచ్చు.

మరి వారిలో ఎంతమందిని ఆసుపత్రులకు తరలిస్తారు.. ఎంతమందిని ఇళ్లలో ఉంచి చికిత్స అందిస్తారు.. అందుకు తగ్గ వసతులు, వైద్య సిబ్బంది సంగతేంటి అన్నది చూడాలి. కరోనా పరీక్షలతో పాటు ఇళ్లలో పెద్ద వాళ్లకు బీపీ, షుగర్ టెస్టులూ చేసి మందులు ఇవ్వాలని జగన్ ఆదేశించడం విశేషం.