జగన్ మార్క్ నిర్ణయం... !

June 02, 2020

ప్రతీకారం, పగ, ఇగో అనే లక్షణాలకు నికార్సైన ఉదాహరణగా మారుతున్నారు ఏపీ ముఖ్యమంత్రి జగన్ రెడ్డి. ఒకవైపు ఇతరులకు కులపిచ్చి అని తీవ్రంగా ద్వేషిస్తూనే తాను చేపట్టే ప్రతి నియామకాన్ని రెడ్డి కులస్తులకే అప్పగిస్తున్నారు. జగన్ కుల పక్ష పాతం ఒక్కమాటలో చెప్పాలంటే... ఇప్పటివరకు ప్రముఖ పోస్టుల్లో అన్ని కులాల వారిని తొలగించి... తన సామాజిక వర్గం వారికి మాత్రమే ఆ పదవులు అప్పగిస్తున్నారు. తాజాగా ప్రత్యేక ఆర్డినెన్స్ తేవడం ద్వారా ఎన్నికల కమిషనర్ పదవీ కాలాన్ని తగ్గించి... నిమ్మగడ్డ రమేష్ కుమార్ ను తొలగించి ఆయన స్థానంలో తన సామాజిక వర్గానికి చెందిన రామ సుందరరెడ్డిని జగన్ ఎన్నికల కమిషనర్ గా నియమించారు.

ఇక్కడ ఒక్క మాట చెప్పుకోవాలి. ఢిల్లీలో మర్కజ్ సభకు హాజరైన తబ్లిగీలు 16, 17 తేదీల్లో ఏపీకి చేరుకున్నారు. సరిగ్గా అదే సమయంలో ఏపీలో జరగాల్సిన ఎన్నికలను వాయిదా వేస్తూ ఎన్నికల కమిషనర్ తనకున్న స్వతంత్ర నిర్ణయాధికారం, విచక్షణతో వాయిదా వేశారు. వాస్తవానికి ఎన్నికలు మొదలయ్యేది 21 మార్చి. అవి మార్చి 29వరకు జరుగుతాయి. అంటే లాక్ డౌన్ సమయం అది. ఒకవేళ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఎన్నికలను వాయిదా వేయకపోయినా కోర్టు గాని, కేంద్రం గాని వాయిదా వేసే వారు. కానీ ముందు చూపుతో నిమ్మగడ్డ వాయిదావేసి తన పదవిని పోగొట్టుకున్నారు. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే ఎన్నికలకు ముందే ఏపీలో 200 కరోనా కేసులున్నాయి. కానీ అవి మార్చి 28 తర్వాత బయటపడ్డాయి. అంటే.. నిమ్మగడ్డ రాష్ట్రాన్ని తద్వారా ముఖ్యమంత్రి అయిన జగన్ ని కాపాడినట్టా లేక ఇబ్బంది పెట్టినట్టా? ఇది ప్రజలు అర్థం చేసుకుంటారు. 

ఇంకో విషయం... నిమ్మగడ్డ కమ్మ కాబట్టి అతను చంద్రబాబుకు అనుకూలంగా వ్యవహరిస్తారు అని జగన్ స్వయంగా ఆరోపణలు చేశారు. మరి రామసుందరరెడ్డి ... రెడ్డి కులం కాబట్టి జగన్ కి అనుకూలంగా వ్యవహరిస్తారు అని ఇపుడు జనం అర్థం చేసుకోవాలని చెప్పినట్టేగా. 151 స్థానాలు గెలుచుకున్న జగన్ ఈ కొత్త నియామకంతో ప్రజల్లో తనకు ఆదరణ తగ్గిందని తనంతట తానే ఒప్పుకున్నట్టు. ఆదరణ తగ్గకపోతే కమిషనర్ గా ఏ వ్యక్తి ఉన్నా, ఎన్నికలు ఎపుడు జరిగినా... కచ్చితంగా తానే గెలుస్తాడు కదా. ఆదరణ లేనపుడే కదా ఇలాంటి నిర్ణయాలు తీసుకునేది.