జగన్ లాజిక్ మరిచిపోతున్నాడు

May 29, 2020

అధికార‌బ‌దిలీ జ‌రిగిన ప్ర‌తిసారీ దాడుల మామూలే. ఎవ‌రెన్ని చెప్పినా.. ఎంత జాగ్ర‌త్త‌గా ఉన్న‌ప్ప‌టికీ వీటిని అడ్డుకోవ‌టం సాధ్యం కాదు. దీనికో చ‌క్క‌ని ఉదాహ‌ర‌ణ చెప్పొచ్చు. మీరు ఎ అనే పార్టీని ఇష్ట‌ప‌డ‌తారు. మీ స్నేహితుడు బి అనే పార్టీని ఇష్ట‌ప‌డ‌తారు. మీరిద్ద‌రి మ‌ధ్య మాట‌లు జ‌రిగిన‌ప్పుడు.. వ్య‌క్తిగ‌తంగా మీరెంత మంచి మిత్రులైన‌ప్ప‌టికి రాజకీయ అంశాలు వ‌చ్చిన‌ప్పుడు మీ అభిప్రాయాలు క‌ల‌వ‌వు. మిత్రుల మ‌ధ్యే ఇలా ఉన్న‌ప్పుడు రాజ‌కీయంగా రెండు గ్రూపులుగా ఉండి.. విశాల దృక్ఫ‌దం త‌క్కువ‌గా ఉండే మారి మ‌ధ్య చిన్న చిన్న మాట‌లు సైతం పెద్ద పెద్ద విష‌యాలుగా మార‌తాయి.
దీనికి తోడు రాజ‌కీయ విభేదాలు నిన్ననో మొన్న‌నో పుట్టేవి కావు. వాటి నేప‌థ్యంలో చాలా సుదీర్ఘంగా ఉంటుంది. ఎక్క‌డిదాకానో ఎందుకు? తెలుగు వారికి సుప‌రిచిత‌మైన రాయ‌ల‌సీమ ఫ్యాక్ష‌న్ చూస్తే.. చిన్న మాట ద‌గ్గ‌ర వ‌చ్చే త‌గ‌దా రావ‌ణ‌కాష్టంలా కాలుతూ ఏళ్ల‌కు ఏళ్ల పాటు సాగ‌ట‌మే కాదు.. పెద్ద ఎత్తు ప్రాణాల్ని కోల్పోయేలా చేస్తుంది. ఇదంతా ఎందుకంటే.. ఒక జ‌గ‌న్ కానీ.. మ‌రెవ‌రో కానీ చెప్పార‌ని దాడులు జ‌ర‌గ‌వు.
ఐదేళ్లు అధికారంలో ఉన్న టీడీపీ నేత‌లు..ఆ పార్టీకి చెందిన చోటా నేత‌లు.. కార్య‌క‌ర్త‌లు..త‌మ ప‌వ‌ర్ ను చూపించ‌టం.. దాని కార‌ణంగా వైఎస్సార్ కాంగ్రెస్ నేత‌లు ఇబ్బంది ప‌డ‌టం మామూలే. ఇప్పుడు ప‌వ‌ర్ ఛేంజ్ అయిన‌ప్ప‌డు త‌మ‌కు జ‌రిగిన దానికి బ‌దులు తీర్చుకోవాల‌నుకునే సాధార‌ణ ప్ర‌జానీకం ఉండే స‌మాజంలో దాడుల వ్య‌వ‌హారానికి ఎక్కువ ప్రాధాన్య‌త ఇవ్వ‌టం స‌రికాదు.
అదే స‌మ‌యంలో.. దాడుల విష‌యంలో అతిశ‌యోక్తి మాట‌ల‌తో అన‌ర్థ‌మే ఎక్కువ‌. ఇటీవ‌ల కాలంలో వైఎస్సార్ కాంగ్రెస్ నేత‌లు ప‌లువురు మాట్లాడుతూ.. టీడీపీ నేత‌లే గొడ‌వ‌కు దిగుతున్నార‌ని ఆరోపిస్తున్నారు. ఇలాంటి మాట‌ల కార‌ణంగా జ‌రిగే న‌ష్టం ఎక్కువ‌గా ఉంటుంది. ఒక‌సారి అధికార బ‌దిలీ జ‌రిగిన త‌ర్వాత ఎంత బ‌ల‌వంతుడైన చోటా నేత అయినా కాస్త త‌గ్గి ఉంటారు.
ఎందుకంటే.. ఏ మాత్రం చెల‌రేగిపోయినా అధికార‌ప‌క్షం చూస్తూ ఊరుకోద‌న్న విష‌యం అత‌నికి తెలియంది కాదు. ఈ విష‌యం చిన్న పిల్లాడికి కూడా తెలుసు. అలాంట‌ప్పుడు జ‌రుగుతున్న ప‌రిణామాల్ని వీలైనంత‌వ‌ర‌కు కంట్రోల్ చేయ‌టం మీద‌నే అధికార‌ప‌క్షం దృష్టి పెట్టాలే కానీ.. బాధితుల్ని బాధ్యులుగా అభివ‌ర్ణించి చేసే వ్యాఖ్య‌లు పుండు మీద కారం రాసిన చందంగా మార‌తాయ‌న్న‌ది మ‌ర్చిపోకూడ‌దు. అందుకే.. కొన్ని విష‌యాల మీద వీలైనంత‌వ‌ర‌కూ మాట్లాడ‌కుండా ఉండ‌టం మంచిది. త‌ప్ప‌దు మాట్లాడాల‌నుకుంటే.. ఆచితూచి అన్న‌ట్లుగా వ్య‌వ‌హ‌రిస్తే మంచిద‌ని మ‌ర్చిపోకూడ‌దు.