డిఫెన్స్ లో పడింది... చంద్రబాబా? జగనా?

April 06, 2020

ఏపీలో అధికార వైసీపీ, విపక్ష టీడీపీల మధ్య ప్రచ్ఛన్న యుద్ధం తారాస్థాయికి చేరిందనే చెప్పాలి. మాటలు తూటాల్లా పేలుతుంటే.. ప్రత్యర్థి వర్గం తమ దెబ్బకు అయోమయంలో పడిపోయిందని రెండు పార్టీల నేతలు చేస్తున్న ప్రకటనలు జనానికి మంచి వినోదాన్నే పంచుతున్నాయి. నానాటికీ భీకరంగా మారుతున్న ఈ పోరులో అసలు డిఫెన్స్ (ఆత్మరక్షణ)లో పడిందెవరన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారిపోయిందని చెప్పక తప్పదు. ఇటీవల ఐటీ దాడులను బూచిగా చూపి టీడీపీతో పాటు ఆ పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు పని అయిపోయిందని వైసీపీ చెబుతోంటే... ఇప్పుడు జగన్ ఢిల్లీ చుట్టూ చేస్తున్న ప్రదక్షిణలను చూపుతూ వైసీపీ నేతలు, ముఖ్యంగా సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి డిఫెన్స్ లో పడిపోయారని టీడీపీ వాదిస్తోంది. ఈ వాదనలను ఎవరికి వారు అనువుగా మలుచుకుంటున్న వైనం కూడా ఆసక్తి రేకెత్తిస్తోంది. రెండు వర్గాల వాదనలు విన్న తర్వాత, ఆ రెండు వాదనలను శూలశోధన చేస్తే... డిఫెన్స్ లో పడింది వైసీపీనేనని, అసలు ముప్పు పొంచి ఉన్నది జగన్ కేనన్న వాదనలు వినిపిస్తున్నాయి.

 

మొన్నటి ఎన్నికల్లో బంపర్ మెజారిటీతో విజయం సాధించి ఏకంగా సీఎం కుర్చీలోనే కూర్చున్న జగన్ ఎలా డిఫెన్స్ లో పడిపోతారన్నదే కదా మీ ప్రశ్న? అయితే ఆ వివరాల్లోకి వెళ్లిపోదాం పదండి. జగన్ తండ్రి వైఎస్ రాజశేఖరరెడ్డి సీఎంగా ఉండగా జగన్ కొత్తగా పెట్టిన సాక్షి పత్రికలో వందల కోట్ల మేర పెట్టుబడులు పెట్టిన ప్రముఖ పారిశ్రామికవేత్త నిమ్మగడ్డ ప్రసాద్ గుర్తున్నారు కదా. మ్యాట్రిక్స్ ప్రసాద్ గా అందరూ పిలుచుకునే నిమ్మగడ్డ... ఏ ప్రాజెక్టు చేతబట్టినా అది ఇట్టే లాభాల్లోకి వచ్చేస్తుందన్న మాటలు గతంలో వినిపించాయి కదా. మరి ఇప్పుడు అదే నిమ్మగడ్డ ఎక్కడున్నారు? ఏం చేస్తున్నారు? జగన్ కు అత్యంత సన్నిహితుడిగా మారిన ఆయన... జగన్ సీఎం అయ్యాక అస్సలు అడ్రెస్ లేకుండా ఎలా పోయారు?. నిజంగానే ఈ ప్రశ్నలన్నీ ఆసక్తికరమే. అప్పుడెప్పుడో సెర్బియా వెళితే... నిమ్మగడ్డను అక్కడి పోలీసులు అరెస్ట్ చేశారన్న వార్తలు వచ్చాయి కదా. మరి ఆ తర్వాత ఆయన విడుదలైనట్లుగా, దేశానికి వచ్చినట్లుగా ఎలాంటి అప్ డేట్ లేదు. అంటే... నిమ్మగడ్డ ఇంకా అక్కడి పోలీసుల అదుపులోనే ఉన్నారని అనుకోవాల్సిందే కదా. ఇన్ని రోజుల పాటు నిమ్మగడ్డను సెర్బియా పోలీసులు అదుపులోనే పెట్టుకుని ఉన్నారంటే... ఆయన దాదాపుగా బుక్కైనట్టేగా.

 

సరే... నిమ్మగడ్డను సెర్బియా పోలీసులు బుక్ చేసుకుంటే... జగన్ కు వచ్చిన ఇబ్బందేమిటంటారా? ఇక్కడా ఓ కీలక లాజిక్కుంది. వైఎస్ హయాంలో నిమ్మగడ్డ వెలగటెబ్టిన వాన్ పిక్ ఉదంతం తెలిసిందేగా. నిమ్మగడ్డ పేరు మీదే ప్రమోట్ అయిన వాన్ పిక్ లో రస్ ఆల్ ఖైమా పెట్టుబడులే అధికం అన్న విషయం కూడా తెలిసిందేగా. వైఎస్ చనిపోయాక... వాన్ పిక్ రద్దు కాగా... తాను పెట్టిన పెట్టుబడులను వెనక్కివ్వాలని రస్ ఆల్ ఖైమా న్యాయపోరాటం చేస్తోంది. ఈ విషయంలో ఆ సంస్థ ఇప్పటికే  కేంద్ర ప్రభుత్వానికి ఫిర్యాదు చేసింది కూడా. రస్ ఆల్ ఖైమా పెట్టిన పెట్టుబడులు రూ.50 వేల కోట్ల పైమాటే. ఆ నిధులను రాబట్టేందుకు రస్ ఆల్ ఖైమా కాస్తంత గట్టిగానే యత్నిస్తోందట. ఈ క్రమంలోనే నిమ్మగడ్డ సెర్బియా వచ్చారన్న సమాచారంతో ఆ సంస్థే సెర్బియా పోలీసులకు ఫిర్యాదు చేసి మరీ ఆయనను అరెస్ట్ చేయించిందట. అంతేకాకుండా తనకు రావాల్సిన రూ50 వేల కోట్లు ఇచ్చేదాకా ఆయనను వదిలొద్దంటూ కూడా ఆ సంస్థ పట్టుబడుతోందట. అయితే... రస్ ఆల్ ఖైమా పెట్టుబడులు అన్నీ నిమ్మగడ్డ ద్వారా జగన్ కు చేరాయన్నది అసలు సిసలు ఆరోపణ. ఖైమా డబ్బు తన వద్ద లేదని, జగన్ కే చేరిపోయిందని నిమ్మగడ్డ ఒప్పుకున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో తన డబ్బు ఎవరి వద్ద ఉందో వారి నుంచే వసూలు చేయించాలని రస్ ఆల్ ఖైమా ఇప్పుడు కేంద్రం వద్ద పంచాయతీ పెట్టిందట. ఈ విషయం తెలిసిన నేపథ్యంలోనే జగన్ ఢిల్లీ చుట్టూ పరుగులు పెడుతున్నారని విశ్వసనీయ సమాచారం. సో... ఇప్పుడు డిఫెన్స్ లో పడింది చంద్రబాబు కాదని, జగనేనని తేలిపోయినట్టేగా.