ఏపీలో హిందుత్వంపై జగన్ దాడి - బుచ్చి సంచలన వ్యాఖ్యలు

August 06, 2020

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ సంవత్సరం హిందూమతంపై తీవ్రమైన దాడి జరిగిందని, వాటికి సంబంధించి సాక్ష్యాలతో ముందుకు వచ్చామని బుచ్చి రాంప్రసాద్ తెలిపారు. గతంలో టీటీడీలో అన్యమత ప్రచారానికి సంబంధించి ఎల్వీ సుబ్రహ్మణ్యం సదరు ఉద్యోగులను మార్చుతూ జీవో ఇస్తే ఆయనను సాగనంపిన విధానం అందరికీ తెలిసిందే అన్నారు. టీటీడీలో అన్యమత ప్రచారంపై జరుగుతుందని తెలిసి ఉద్యోగులను మార్చినందుకే అవమానకర పరిస్థితుల్లో పంపించారన్నారు.

ఆ తర్వాత టీటీడీ వెబ్ సైట్‌లోను పరమత బోధనలు వచ్చాయని, దీనిపై ప్రజల్లో విపరీతమైన ఆగ్రహావేశాలు పెల్లుబుకాయన్నారు. దీంతో వాటిని తొలగించారని చెప్పారు. ఆ తర్వాత దేవుడిపై నమ్మకం లేని పృథ్వీరాజ్ అనే వ్యక్తిని ఎస్వీబీసీ చైర్మన్‌గా పెట్టారన్నారు. దైవ కార్యక్రమాల కోసం ఎస్వీబీసీ ఛానల్ ఉందని, కానీ ఆ పృధ్వీరాజ్ ఓ ఉద్యోగితో అసభ్యంగా ప్రవర్తించి దొరికిపోయారని గుర్తు చేశారు. దీంతో ఆయనను కూడా తొలగించారన్నారు.

ఆ తర్వాత హిందుత్వంపై దాడి పరాకాష్టకు చేరి, వందలు, వేల కోట్ల రూపాయిల టీటీడీ భూములను అమ్మకానికి పెడితే ప్రజల నుండి వ్యతిరేకత రావడంతో దీనిపై కూడా వెనక్కి తగ్గారన్నారు. 2017లో చంద్రబాబు ఇచ్చిన జీవోనే అని చెప్పే ప్రయత్నం చేశారని, కానీ నాడు అదే టీడీపీ.. టీటీడీ వద్దనుకుంటే ఆ నిర్ణయం వారి ఇష్టమని చెప్పారన్నారు. జగన్ ప్రభుత్వం హిందూ వ్యతిరేక ధోరణితో ముందుకు వెళ్తోందన్నారు.

టీటీడీకి చెందిన సప్తగిరి పుస్తకంతో పాటు పరమత పుస్తకం కూడా రావడం మరో పరాకాష్ట అన్నారు. ఒంగోళులో ప్రింట్ అయినా ఆ పుస్తకం తిరుపతికి ఎలా వచ్చిందో విచారణ జరపాలన్నారు. దీనిని పోస్టల్ డిపార్టుమెంట్‌పైకి నెట్టేశారని మండిపడ్డారు. ఒక పద్ధతి ప్రకారం ఏడాది కాలంగా టీటీడీ ద్వారా జగన్ ప్రభుత్వం హిందూ వ్యతిరేకతను వెళ్లగక్కుతోందన్నారు. శ్రీశైలంలో రూ.2 కోట్లకు పైగా టిక్కెట్ అవినీతి జరిగిందన్నారు. దీనిపై సీబీఐ విచారణ జరపాలని డిమాండ్ చేస్తే ఏసీబీ విచారణ వేశారన్నారు. యథారాజ తథా ప్రజలా ఉందని, అందుకే జగన్‌కు హిందూమతంపై వ్యతిరేక ఆలోచనలు ఉండటంతో ఉద్యోగస్తులు కూడా అదే పని చేస్తున్నారన్నారు.

విజయవాడలోని సత్యనారాయణపురంలో శ్రీ కాశీ విశ్వేశ్వరస్వామి దేవస్థానం ఉంది. ఈ దేవాలయ అభివృద్ధికి సత్యనారాయణపురానికి చెందిన తాడేపల్లి సీతమ్మ 1957లో దాదాపు 600 గజాల ఇళ్లును, వెనుక 300 గజాలు ఉచితంగా ఇచ్చారని, ఇప్పుడు దానిపై కన్ను పడిందన్నారు. 2016లో నాటి ప్రభుత్వం దీనికి అంగీకరించలేదని, ఓ ధర్మకర్త వ్యతిరేకించారని, ఇప్పుడు కూడా ఓ ధర్మకర్త వ్యతిరేకించినప్పటికీ తగ్గడం లేదన్నారు. ఇది రూ.10 కోట్ల ఆస్తి అన్నారు.

ఓ పద్ధతి ప్రకారం హిందూ మతంపై ఆంధ్రప్రదేశ్‌లో దాడి జరుగుతోందన్నారు. 25 ఏళ్ల క్రితం గజపతి కుటుంబం నుండి విడిపోయిన వ్యక్తి ఇప్పుడు తెరపైకి వచ్చారని, ఆమె పరమతంపై అభిమానం ఉన్నట్లుగా పోస్టులు పెడుతున్నారని, అలాంటి ఆమెను మాన్సస్ ట్రస్టుకు చైర్మన్‌గా పెట్టడం ఏమిటన్నారు. ఎవరి పైన అయినా ఆరోపణలు ఉంటే విచారణ జరిపించాల్సి ఉందన్నారు. కరోనా తర్వాత హిందుత్వంపై జరుగుతున్న దాడిపై ఉద్యమిస్తామన్నారు. కేంద్రానికి దీనిని వివరించి సరైన ముగింపు తీసుకు వస్తామన్నారు.