జగన్ ను చూస్తేనే... జడిసిపోతున్న లేడీ ఐఏఎస్

May 25, 2020

ఏపీకి మూడు రాజధానుల దిశగా దూకుడుగా సాగుతున్న వైసీపీ అధినేత, ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి... హైకోర్టు ఆదేశాలను కూడా పట్టించుకున్నట్లుగా కనిపించడం లేదు. దీంతో ఆయన ఏరికోరి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా నియమించున్న సీనియర్ ఐఏఎస్ అధికారిణి నీలం సహానీ ఏకంగా బెంబేలెత్తిపోతున్నారట. అంతేకాదండోయ్ అప్పుడెప్పుడో వైఎస్ రాజశేఖరరెడ్డి జమానాలో ప్రభుత్వ పెద్దల మాటలు విని సంతకాలు చేసిన పాపానికి అడ్డంగా బుక్కైన సీనియర్ ఐఏఎస్ అధికారిణి శ్రీలక్ష్మికి పట్టిన గతే తనకూ పడుతుందా? అని నీలం జడిసిపోతున్నారట. మొన్నటిదాకా కేంద్ర సర్వీసుల్లో కొనసాగిన సహానీ... నింపాదిగా విధులు నిర్వర్తిస్తూ వచ్చారు. అయితే ఎన్నికల సమయంలో ఎలక్షన్ కమిషన్ ఏపీ సీఎస్ గా నియమించిన ఎల్వీ సుబ్రహ్మణ్యాన్ని వదిలించుకునేందుకు సిద్ధపడ్డ జగన్... సెంట్రల్ సర్వీసుల్లోని నీలంను రాష్ట్ర సర్వీసులకు పిలిపించేశారు. 

నేరుగా జగన్ నుంచే... అది కూడా సీఎంగా ఉన్న జగన్ నుంచి కబురు రాగానే సంభ్రమాశ్చర్యాలకు గురై ఢిల్లీ నుంచి రెక్కలు కట్టుకుని వచ్చినట్లుగా వాలిపోయిన సహానీకి... జగన్ కూడా ఘనంగానే స్వాగతం పలకడంతో పాటు తమ వద్ద సీఎస్ గా పనిచేయాలని కోరారు. నేరుగా సీఎం కోరితే... ఎవరు మాత్రం కాదంటారు? అది కూడా సర్వీసు చరమాంకంలో ఉండగా... ప్రతి ఐఏఎస్ అధికారి కలల పోస్టు అయిన సీఎస్ పోస్టు వెతుక్కుంటూ మరి వస్తే... ఎందుకు కాదంటారు? నీలం కూడ అలాగే ఆలోచించారు. జగన్ ప్రతిపాదనకు జైకొట్టారు. సీఎస్ గా పదవీ బాధ్యతలు చేపట్టారు.

అక్కడిదాకా బాగానే ఉన్నా...నీలం సీఎస్ గా పదవీ బాధ్యతలు చేపట్టిన తర్వాతే జగన్ మూడు రాజధానుల మాట ఎత్తుకున్నారు. దీనిని నిరసిస్తూ రాజధాని రైతులు పెద్ద ఎత్తున నిరసనలు కొనసాగిస్తున్నారు. హైకోర్టునూ ఆశ్రయించారు. ఈ క్రమంలో రైతుల పిటిషన్ విచారణ సందర్భంగా మూడు రాజధానుల దిశగా తాను చెప్పేదాకా ఎలాంటి చర్యలు చేపట్టరాదని కోర్టు చెప్పింది. కోర్టులంటే జగన్ కు అంతగా గౌరవం ఉన్నట్టుగా కనిపించడం లేదన్న వాదనలను నిజం చేస్తూ జగన్ చీకటి జీవోలు జారీ చేస్తూ... ఒక్కటొక్కటిగానే ప్రభుత్వ విభాగాలను అటు విశాఖకు, ఇటు కర్నూలుకు తరలిస్తున్నారు. ఈ జీవోలపై జగన్ సంతకం చేయరు కదా. సంతకం చేయాల్సింది సీఎస్ గా ఉన్న నీలం సహానీనే కదా. మరి రేపు కోర్టు ఆగ్రహిస్తే బుక్ అయ్యేది ఎవరు? జగన్ కాదు కదా. నీలం సహానీనే కదా. అందుకే... జగన్ ను చూస్తుంటే... నీలం సహానీ జడిసిపోతున్నారట.