సాయిరెడ్డి కోసం చ‌ట్టం మారిందిగా..!

July 05, 2020

అధికారంలో ఉంటే ఏదైనా చేయొచ్చు. ఇది ప్ర‌తిసారీ నిరూపించ‌బ‌డుతున్న విష‌యం. ఏ పార్టీ అధికారంలో ఉంటే.. ఆ పార్టీకి అనుకూలంగా నిర్ణ‌యాలు, ప్రాధాన్యాలు మారిపోతుంటాయి. తాజాగా ఇలాగే వ్య‌వ‌హ‌రించారు ఏపీ సీఎం జ‌గ‌న్‌. త‌న కు అత్యంత అనుకూల‌మైన నాయ‌కుడు, ఆడిట‌ర్ విజ‌య‌సాయిరెడ్డికి ప‌ద‌విని క‌ట్ట‌బెట్టే విష‌యంలో జ‌గ‌న్ ఇలానే చ‌ట్టాన్ని మార్చుకున్నారు. తాజాగా వైసీపీ పార్లమెంటరీ పార్టీ నేత వి.విజయసాయిరెడ్డిని ఢిల్లీలోని ఏపీ భవన్‌లో ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధిగా నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం.

ఎటువంటి జీత భత్యాలు, కేబినెట్‌ ర్యాంకు లేకుండా ఆయన్ను నియమించనున్నట్టు అధికార వర్గాలు తెలిపాయి. ఆయనకు ఎటువంటి అధికారిక సదుపాయాలను కూడా కల్పించడం లేదు. కేవలం సేవా భావంతోనే ఢిల్లీలోని ఏపీ భవన్‌లో రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధిగా విజయసాయిరెడ్డి వ్యవహరించనున్నారు. వాస్త‌వానికి గత నెల 22వ తేదీన విజయ సాయిరెడ్డిని కేబినెట్‌ ర్యాంకుతో ఢిల్లీలోని ఏపీ భవన్‌లో ఏపీ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధిగా నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే.

అయితే రాజ్యసభ సభ్యుడిగా ఉంటూ మరో లాభదాయక పదవి (ఆఫీస్‌ ఆఫ్‌ ప్రాఫిట్‌) చేపట్టడం నిబంధనలకు విరుద్ధమని తేలడంతో విజయసాయిరెడ్డి నియామక ఉత్తర్వులను రాష్ట్ర ప్రభుత్వం ఈనెల 4వతేదీన రద్దు చేసింది. దీంతో ఇక‌, కొత్త‌వారికి అవ‌కాశం క‌ల్పిస్తార‌ని అంద‌రూ అనుకున్నారు. అయితే, జ‌గ‌న్ మాత్రం ఎట్టిప రిస్థితిలోనూ విజ‌య‌సాయిని ఏపీ ప్ర‌తినిధిగా నియ‌మించే విష‌యంలో జ‌గ‌న్ ఒక్క అడుగు కూడా వెన‌క్కి ప‌డ‌లేదు. ఈ క్ర‌మంలోనే ఆయ‌న చ‌ట్టానికి మార్పులు చేశారు.

తాజాగా ఎటువంటి జీత భత్యాలు, కేబినెట్‌ తదితర హోదా లేకుండా ఢిల్లీలోని ఏపీ భవన్‌లో ఏపీ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధిగా ఆయన్ను నియమించేందుకు వీలుగా ఆఫీస్‌ ఆఫ్‌ ప్రాఫిట్‌ నిబంధనల్లో సవరణలు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఆర్డినెన్స్‌ జారీ చేసింది. విజయసాయిరెడ్డిని ఢిల్లీలోని ఏపీ భవన్‌లో ఏపీ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధిగా నియమిస్తూ ఒకటి రెండు రోజుల్లో ఉత్తర్వులు జారీ కానున్నాయని అధికారిక వర్గాలు తెలిపాయి. మొత్తానికి జ‌గ‌న్ కూడా పాత‌త‌రం ప్ర‌భుత్వ పాల‌కుల‌నే త‌ల‌పించారు. మ‌రి రాబోయే రోజుల్లో ఇంకెన్ని నిర్ణ‌యాలు ఇలాంటి వ‌స్తాయో చూడాలి.