మండేలాతో పోల్చుకుని బుక్కయిన జగన్

August 06, 2020

అందుకే అంటారు ఆచితూచి మాట్లాడాలని. అత్యున్నత స్థానాల్లో ఉన్న వారిని ఉద్దేశించి కీలక వ్యక్తుల నోట వచ్చే మాటలు కొంతవరకూ ఓకే. అంతకు మించితేనే కష్టం. ఇప్పుడు అలాంటి పరిస్థితే ఎదురైందని చెప్పాలి. ప్రముఖులతో అధినేతల్ని పోల్చటం ఎప్పటి నుంచో వస్తున్న సంప్రదాయం. కానీ.. అలాంటివి కొన్నిసార్లు రివర్స్ అవుతాయన్న విషయాన్ని మర్చిపోకూడదు. మహనీయుల ప్రస్తావన తెచ్చేటప్పుడు.. తమ మాటలకు కౌంటర్ పడేందుకు అవకాశం ఎంత ఉందన్న విషయాన్ని గుర్తించాల్సిన అవసరం ఉంది. తాజాగా ఏపీ ఆర్థిక మంత్రి బుగ్గనకు అలాంటి పరిస్థితే ఎదురైందని చెప్పాలి.

మొన్న ఏపీ బడ్జెట్ ప్రవేశ పెట్టిన సందర్భంగా కీలక వ్యాఖ్య ఒకటి రాష్ట్ర ఆర్థికమంత్రి బుగ్గన నోటి నుంచి వచ్చింది. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నెల్సన్ మండేలా మాదిరి కమిట్ మెంట్ ఉన్న వాడని.. ఆయన్ను గుర్తు చేసుకోవాలని సీఎం చెబుతారని పేర్కొన్నారు. తన నోటి నుంచి వచ్చిన మాటకు పర్ ఫెక్ట్ పంచ్ పడుతుందని బుగ్గన అంచనా వేసి ఉండరు. ఒకవేళ ఆ విషయం మీద ఏ మాత్రం అవగాహన ఉన్నా.. మండేలా ప్రస్తావన తెచ్చి ఉండేవారు కాదేమో?

దివంగత మహానేత వైఎస్ రాజశేఖర్ రెడ్డికి అత్యంత సన్నిహితుడు కమ్ ఆఫ్తుడైన ఉండవల్లి అరుణ్ కుమార్ ఎంతటి మాటకారి.. చమత్కారి అన్న సంగతి తెలిసిందే. విషయాల పట్ల లోతైన విశ్లేషణతో పాటు.. ప్రాపంచిక విషయాల మీద ఆయనకు పట్టు ఎక్కువ. బుగ్గన నోటి నుంచి వచ్చిన మండేలా ప్రస్తావనపై తాజాగా స్పందించారు. సీఎం జగన్ మీద తనకున్న అభ్యంతరాల్ని మొహమాటం లేకుండా మాట్లాడే అలవాటున్న ఉండవల్లి.. బుగ్గన నోటి నుంచి వ్యాఖ్యకు భారీ పంచ్ వేశారు. జగన్ చేస్తున్న తప్పును ఉదాహరణతో చెప్పేశారు.
‘‘మండేలాను ఆదర్శంగా తీసుకోవాలని జగన్ చెప్పినట్లుగా ఆర్థికమంత్రి బుగ్గన చెప్పారు.

చూస్తుంటే.. మండేలాను జగన్ ఆదర్శంగా తీసుకున్నట్లు లేదు. ఎందుకంటే.. మండేలా జైల్లో ఉన్నప్పుడు రోజూ కొట్టేవారు. ఆయనపై పోలీసు అధికారులు మూత్రం పోసేవారు. ఆ తర్వాత మండేలా దేశాధ్యక్షుడు అయ్యాక.. ఒక సమావేశానికి మండేలా హాజరయ్యారు. దానికి తనపై మూత్రం పోసిన పోలీసు అధికారే వచ్చారు. భయంతో వణికిపోతుంటే.. సిబ్బందిని ఇచ్చి  బయటకు పంపారు. తాను అధికారంలోకి వచ్చింది తనను ఇబ్బంది పెట్టిన వారిపై ప్రతీకారం తీర్చుకోవటానికి కాదు. ఇవాళ తెల్ల.. నల్ల అంతా సమానం’’ అని చెప్పుకొచ్చారు.

తాను జగన్ కు చెప్పేదొక్కటేనని.. అధికారం ఉన్నది ప్రత్యర్థుల్ని అణిచివేయటానికికాదన్నారు. సీఎంతో తనకు సంబంధం లేదని.. ఉన్నది ఉన్నట్లే చెప్పటం తనకు అలవాటుగా చెప్పారు. గతంలోనూ తాను ఇలానే వ్యవహరించారనని చెప్పారు. చంద్రబాబు పాలనలోని లోపాల్ని ఇలానే చెప్పానని.. ఇప్పుడు కూడా అదే చేస్తున్నట్లు చెప్పటం ద్వారా ఉండవల్లి తన ప్రత్యేకతను.. విలక్షణతను మరోసారి ప్రదర్శించారని చెప్పక తప్పదు. ఉండవల్లి పుణ్యమా అని.. రానున్న రోజుల్లో మహనీయులతో జగన్ ను పోల్చే సాహసం ఆయన పరివారం చేయకపోవచ్చేమో?