అయోమయం మంత్రులు.. ఆడుకుంటున్న అధికారులు

February 25, 2020

ఏపీలోని జగన్ మంత్రివర్గంలో చాలామంది కొత్తవారే. పాలనా వ్యవహారాల్లో అనుభవలేమి కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. అయితే... త్వరత్వరగా నేర్చుకుని పట్టు సాధించాల్సింది పోయి తమ చేతకానితనాన్ని అధికారులపై చిందులేస్తూ కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేస్తున్నారట కొందరు మంత్రులు. ఆ క్రమంలోనే తాజాగా ఏపీ విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్ తన ఓఎస్డీ శ్రీనివాసరెడ్డిపై చిందులేశారని సెక్రటేరియట్లో చెవులు కొరుక్కుంటున్నారు.
ఏపీ విద్యారంగంలో పెట్టుబడులు పెడతామంటూ ఆస్ట్రేలియా ప్రతినిధి బృందం ఒకటి శుక్రవారం మంత్రి సురేశ్‌ను కలిసేందుకు వచ్చింది. అయితే... వారితో మీటింగ్ ఉందని ఆ సమయం వరకు మంత్రికి తెలియలేదు. దీంతో ఏం మాట్లాడాలో కూడా తెలియక తీవ్రమైన ఫ్రస్ట్రేషన్‌కు గురైన ఆయన తన కోపాన్నంతా తన ఓఎస్డీపై చూపించారు. ఆస్ట్రేలియన్ డెలిగేట్స్‌తో మీటింగుకు ఆ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ కానీ, ఇతర సీనియర్ అధికారులు కానీ ఎవరూ రాలేదు. అసలు మీటింగ్‌కు సంబంధించిన అంశంపై సమాచారమూ సిద్ధం చేయలేదట.
దీంతో ఆస్ట్రేలియా ప్రతినిధి బృందంతో సమావేశంలో మంత్రి నీళ్లు నములుతూ నాలుగైదు నిమిషాలకే మమ అనిపించి బయటకొచ్చేశారు. ‘అజెండా ఏదీ... అధికారులు ఏరీ.. ఎందుకు నాకు ముందే చెప్పలేదు.. విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ, ఇతర అధికారులు ఏమయ్యారు అంటూ అందరిపై కోపాన్ని ఓఎస్డీపై చూపించారట.
దీనంతటికీ కారణం మంత్రికి శాఖపై పట్టులేకపోవడమేనని అధికారుల నుంచి వినిపిస్తోంది. అధికారులతో సమన్వయం చేసుకోవడం.. విద్యాశాఖకు సంబంధించిన విషయాలు తెలుసుకోవడంలో మంత్రి రెండు నెలలైనా పట్టు సాధించలేకపోవడంతో అధికారులు ఆయన్ను ఏమాత్రం పట్టించుకోవడం లేదని టాక్.
ఇది ఒక్క విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్‌కే పరిమితం కాదు.. మిగతా మంత్రుల్లోనూ చాలామంది పరిస్థితి ఇలాగే ఉందట. మంత్రులుగా గత అనుభవం ఉన్న కొద్దిమంది తప్ప మిగతావారందరిదీ ఇదే పరిస్థితని తెలుస్తోంది. మంత్రులుగా అనుభవం ఉన్న నేతలకు ప్రాధాన్యం లేని శాఖలు ఇవ్వడంతో వారి అనుభవం ఎందుకూ కొరగాకుండా పోతోంది. తొలిసారి మంత్రులైనవారికి కీలకమైన హోంశాఖ, విద్యాశాఖ, నీటి పారుదల శాఖ, పరిశ్రమల శాఖ, ఆర్థిక శాఖ వంటివన్నీ కొత్తవారికే ఇవ్వడంతో వారికి ఆయా శాఖల గురించి తెలుసుకోవడానికి సమయం పట్టేస్తోంది. దీంతో పట్టు సాధించలేకపోతున్నారు. మంత్రులకు శాఖలపై ఏమాత్రం అవగాహన లేకపోవడంతో కొన్ని శాఖల్లో అధికారులు మంత్రులను లైట్‌గా తీసుకుని పట్టింపులేకుండా వ్యవహరిస్తున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి.