కనీసం దాన్ని కూడా జగన్ క్యాచ్ చేసుకోలేకపోయాడా..?

May 28, 2020

ఎన్నికలు దగ్గరపడుతున్న ఈ తరుణంలో ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు బాగా వేడెక్కుతున్నాయి. గెలుపే లక్ష్యంగా అధికార, ప్రతిపక్ష పార్టీలు ఓ రేంజ్ లో వ్యూహాలు రచిస్తూ ముందుకు సాగుతున్నాయి. ఇక ఇందులో ఆ పార్టీ నుంచి ఈ పార్టీకి, ఈ పార్టీ నుంచి ఆ పార్టీకి అంటూ జంపింగ్ జిలానీలను చూస్తూనే ఉన్నాం. ఓ వైపు అధికార టీడీపీ వినూత్న పథకాలతో రాష్ట్ర ప్రజలందరినీ ఆకట్టుకుంటుండగా, ప్రధాన ప్రతిపక్షం వైఎస్సార్ సీపీ అందుకు తగిన వ్యూహాలు రచించడంలో విఫలమవుతోంది. గత ఎన్నికల్లో పరాజయం పాలైన వైఎస్ జగన్ ఈ సారి ఎలాగైనా గెలవాలని కంకణం కట్టుకున్నారు. కానీ ఆయన పోకడ చూస్తుంటే అది సాధ్యం కాదని స్పష్టమవుతోందని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.

తనకు తెలిసే చేస్తున్నారో లేక తెలియక జరుగుతున్నాయో తెలియదు గానీ… వైసీపీ అధినేతగా జగన్ కొన్ని పొరపాట్లు చేసుకుంటూ వెళుతున్నారన్న టాక్ మాత్రం బలంగా వినిపిస్తోంది జనాల్లో. ఈ క్రమంలోనే జగన్, వైసీపీ నేతలంతా అందివచ్చిన అవకాశాన్ని క్యాచ్ చేసుకోలేక పోవటం వారి చాతకానితనానికి నిదర్శనం అని చెప్పుకుంటున్నారు. జగన్ తండ్రి వైఎస్ జీవిత చరిత్రలో ఎవ్వరూ మరచిపోలేని విలువైన ఘట్టం ఆయన పాదయాత్ర. ఈ యాత్రనే ఆయనను ముఖ్యమంత్రి సీట్లో కుర్చోపెట్టింది. ఓవరాల్ గా చూస్తే వైఎస్ రాజశేఖర్ రెడ్డి పరంగా ప్రజల మదిలో చిరస్థాయిగా నిలిచిపోయే ఘట్టం పాదయాత్రనే! అయితే సరిగ్గా ఇదే అంశాన్ని బేస్ చేసుకొని ‘యాత్ర’ సినిమా రూపొందించారు డైరెక్టర్ మహి వీ రాఘవ. ఇటీవలే విడుదలైన ఈ సినిమా మంచి సక్సెస్ సాధించింది. సినిమాను చూసిన జనమంతా చాలా సంతోషంగా ఫీల్ అయ్యారు. అయితే స్వయంగా వైసీపీ నేతలు మాత్రం ఈ సినిమాను పట్టించుకోకపోవటం, దానిపై స్పందించక పోవటం రాష్ట్ర ప్రజలను ఆశ్చర్యపరిచింది.

ఏపీ అసెంబ్లీకి ఎన్నికలు సమీపిస్తున్న కీలక సమయంలో ఈ సినిమా విడుదల కావటం వైసీపీకి సూపర్ మైలేజీ తెచ్చిపెట్టిందని చెప్పుకోవచ్చు. కానీ ఈ సినిమాపై వైసీపీ అధినేత జగన్ కానీ, ఆయన చెల్లెలు షర్మిల కానీ స్పందించకపోవటం అందరినీ విస్మయానికి గురిచేసింది. అంటే పార్టీ పరంగా ఈ సినిమా ద్వారా లభించే మైలేజీని వైసీపీ శ్రేణులు సద్వినియోగం చేసుకోలేక పోయారని అర్థమవుతోంది. వైఎస్ ‘యాత్ర’ పట్ల వైసీపీ చూపిన ఈ వైఖరిపై ఆ పార్టీ అభిమానులు అసంతృప్తిగా ఉండగా, అందివచ్చిన అవకాశాన్ని కూడా తనకు ప్లస్ చేసుకోలేక పోయిన జగన్.. ఇక మున్ముందు జరిగే పరిణామాలు ఎలా హ్యాండిల్ చేస్తాడు? అని జనం మెదళ్లలో ప్రశ్నలు మొదలయ్యాయి.