జగన్ మహిమ... తహశీల్దార్ ఆస్తులు అటాచ్ అయిపోయాయి

February 22, 2020
CTYPE html>
నిజమే... నిండా అక్రమాస్తులతో మునిగిపోయిన వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి... ఏపీకి సీఎంగా పదవీ బాధ్యతలు చేపట్టిన వేళా విశేషమో? ఏమో తెలియదు గానీ... తహశీల్దార్ స్థాయి అధికారి అక్రమాస్తులను కూడా ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ అటాచ్ చేస్తూ సంచలన నిర్ణయం తీసుకుంది. చూడ్డానికి ఈ కేసు చాలా చిన్నదే అయినా గానీ... ఏకంగా ఈడీ సదరు అధికారి ఆస్తులను అటాచ్ చేసిన వైనం చూస్తుంటే... తన లెన్స్ కు అడ్డంగా బుక్కైపోయిన జగన్ పాలనలోని రాష్ట్రంలో చిన్న స్థాయి అధికారుల అక్రమాలపైనా ఈడీ దృష్టి సారించేసిందన్న వాదనలు ఆసక్తి రేకెత్తిస్తున్నాయి. సరే.. మరి జగన్ పాద మహిమ కారణంగా ఈడీ అటాచ్ చేసిన తహశీల్దార్ కు సంబంధించిన వివరాల్లోకి వెళ్లిపోదాం పదండి.
 
ఏపీలోని నెల్లూరు జిల్లాలోని సంగం మండలానికి తహశీల్దార్ గా పనిచేస్తున్న గంటా సుశీల గతంలో అక్రమాస్తులు కూడబెట్టిన వైనంపై ఏసీబీ అధికారులు కేసు నమోదు చేశారు. ఈ కేసు ఏసీబీ కోర్టు విచారణలో ఉండగానే... ప్రివెన్షన్ ఆఫ్ మనీ ల్యాండరింగ్ యాక్ట్ చట్టం కింద గంటా సుశీల నిధులను కూడబెట్టారన్న సమాచారంతో ఈడీ అధికారులు రంగంలోకి దిగిపోయారు. విచారణలో సుశీల... పబ్లిక్ సర్వెంట్ గా పనిచేస్తూనే అక్రమంగా ఆదాయాన్ని ఆర్జించేసి తన పేరిట తన కుమారుడు, కుమార్తె పేరిట నెల్లూరు జిల్లాతో పాటు కర్ణాటక రాజధాని బెంగళూరులోనూ స్థిరాస్తులు కూడబెట్టారు. ఇళ్లు, ఇళ్ల స్థలాలు, ఫ్లాట్లు కొనేశారు. వీటన్నింటిపై దృష్టి సారించిన ఈడీ... సుశీల కుటుంబ సభ్యులపై రిజిష్టర్ అయిన 12 ఆస్తులను గుర్తించింది. వీటి విలువ రూ.1.08 కోట్లుగా నిర్ధారించింది. అంతేకాకుండా సుశీల ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టారన్న విషయాన్ని కోర్టులు నిర్ధారించడంతో ఈడీ సదరు ఆస్తులను అటాచ్ చేసింది. 
 
బడా రాజకీయ వేత్తలు, పారిశ్రామికవేత్తలు వందలు, వేలాది కోట్ల రూపాయల ఆస్తులను కూడబెట్టిన వైనంపై లెక్కలేనన్ని కేసులు నమోదు చేసిన ఈడీ... జగన్ పైనా కేసులు నమోదు చేసింది. అంతేకాకుండా జగన్ ఫ్యామిలీ ఆధ్వర్యంలో నడుస్తున్న పలు వ్యాపార సంస్థలకు చెందిన వందల కోట్ల రూపాయల మేర విలువ చేసే ఆస్తులను కూడా అటాచ్ చేసింది. ఇలా పెద్ద పెద్ద నేరాల్లోనే చర్యలు తీసుకునే ఈడీ... ఓ తహశీల్దార్ స్థాయి అధికారి ఆస్తులను అటాచ్ చేస్తూ నిర్ణయం తీసుకోవడం, అది కూడా జగన్ పాలనలో ఉన్న ఏపీకి చెందిన చిరు ఉద్యోగిపై కొరఢా ఝుళిపించడాన్ని చూస్తుంటే... జగన్ లెగ్ మహిమతోనే ఈ ఘటన జరిగిందన్న కోణంలో ఆసక్తికర విశ్లేషణలు సాగుతున్నాయి.