బడ్జెట్ ని చూశాక జగన్ తన ఐడియా మార్చుకున్నారు

June 01, 2020

తాను అధికారంలోకి వస్తే... ప్రతి పార్లమెంటు నియోజకవర్గాన్ని ఓ జిల్లాగా మారుస్తానంటూ వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే ఆయన ఆశించినట్టుగానే జనం వైసీపీకి బంపర్ మెజారిటీ ఇచ్చారు. జగన్ సీఎం అయ్యారు. అయితే కొత్త జిల్లాలపై తొలుత ఓ మోస్తరు కసరత్తు జరిగినా... ఎందుకనో గానీ ఆ తర్వాత ఆ మాట అస్సలు వినపడలేదు. తాజాగా ఇప్పుడు కేంద్ర బడ్జెట్ ను ఆధారం చేసుకుని 25... అంతకంటే మించి జిల్లాలను ఏర్పాటు చేసే దిశగా జగన్ ఆలోచిస్తున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఎన్నికలకు ముందు తాను ప్రకటించినట్టుగా మొత్తం జిల్లాల సంఖ్యను 25కు పెంచడం, వీలయితే జిల్లాల సంఖ్యను 25కు మించి పెంచే అవకాశాలను కూడా జగన్ పరిశీలిస్తున్నారట.
కేంద్ర బడ్జెట్ కు ముందు కొత్త వైద్య కళాశాలల ఏర్పాటు దిశగా కేంద్రం ప్రకటించిన ఓ ప్లాన్ ను ఆధారం చేసుకుని ప్రస్తుతానికి ఓ మూడు కొత్త జిల్లాలను ఏర్పాటు చేయాలని జగన్ తలచినట్టు వార్తలు వినిపించాయి. అంటే.. ఇప్పుడున్న 13 జిల్లాలకు అదనంగా మరో మూడు కొత్త జిల్లాలు... మొత్తంగా 16 జిల్లాలన్న మాట. అయితే శనివారం నాటి కేంద్ర బడ్జెట్ పుణ్యమా అని ఆ మూడు కొత్త జిల్లాల ప్రతిపాదనను పక్కనపెట్టేసిన జగన్... ఎన్నికలకు ముందు తాను పేర్కొన్న 25 జిల్లాల మాటను, వీలయితే 25 జిల్లాలకు మించి మరిన్ని కొత్త జిల్లాలను ఏర్పాటు చేయాలన్న దిశగా జగన్ భావిస్తున్నారట. ఈ దిశగా జగన్ సీరియస్ గానే ఆలోచిస్తున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి.  
జగన్ ఈ దిశగా ఆలోచన చేయడానికి  కేంద్ర బడ్జెట్ లోని ఏ అంశం ప్రాతిపదికగా మారిందన్న విషయానికి వస్తే... వైద్యుల సంఖ్య పెంచేందుకు ఓ కొత్త విధానాన్ని తీసుకొచ్చారు. ప్రతి జిల్లా ఆస్పత్రికి అనుబంధంగా ఓ మెడికల్ కాలేజీని నిర్మించాలని ప్రతిపాదించారు. అది పీపీపీ పద్ధతిలో నిర్మిస్తారట. రాష్ట్ర ప్రభుత్వం తక్కువ ధరకు భూమిని కేటాయిస్తే ఆ స్థలంలో పీపీపీ పద్ధతిలో వైద్య కళాశాలను నిర్మిస్తారు. దీని వల్ల ఏటా కొత్తగా మెడికల్ సీట్లు అందుబాటులోకి వస్తాయి. ఒక్కో ఆస్పత్రికి ప్రాథమికంగా 50 సీట్లు కేటాయించినా... ఎన్ని జిల్లాలు ఉంటే అన్ని మెడికల్ సీట్లు పెరుగుతాయి. ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్‌లోని విద్యార్థులకు మరిన్ని ఎక్కువ మెడికల్ సీట్లు దక్కించుకోవాలంటే.. జిల్లాల సంఖ్యను పెంచుకోవడం ఉత్తమం. ఈ దిశగానే జగన్ ప్రభుత్వం ఆలోచన చేస్తున్నట్టు తెలిసింది. మరి ఈ దిశగా జగన్ ఆలోచన చేస్తే... ఏపీలో 25 కంటే కూడా ఎక్కువ సంఖ్యలో జిల్లాలు ఉంటే.. రాష్ట్రానికి వీలయినంత మేర ఎక్కువ మెడికల్ సీట్లు లభిస్తాయి. అదే సమయంలో కొత్త జిల్లాల ఏర్పాటు అంత ఆషామాషీ కూడా కాదు. మరి జగన్ ఏం చేస్తారో చూడాలి.