ఆంధ్రప్రదేశ్ లో మూడు ఎమ్మెల్సీ స్థానాలకు నోటిఫికేషన్ వెలువడిన సంగతి తెలిసిందే. ఆగష్టు 26న ఎన్నికలు నిర్వహించనుండగా.. బుధవారంతో నామినేషన్ల ప్రక్రియ ముగియనుంది. అసెంబ్లీలో వైసీపీకి ఉన్న 151 మంది ఎమ్మెల్యేలను బట్టి చూస్తే మూడు ఎమ్మెల్సీ స్థానాలు వైసీపీ ఖాతాలోనే పడనున్నాయి. ఆశావాహుల సంఖ్య ఎక్కువగానే ఉండడంతో ఎవరెవరికి ఎమ్మెల్సీ సీట్లు దక్కుతాయన్నది నేటి వరకు సస్పెన్స్‌గానే ఉంది.
ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీకి చెందిన కరణం బలరామ కృష్ణమూర్తి - వైసీపీకి చెందిన ఆళ్ల శ్రీనివాస్ (నాని) - కొలగట్ల వీరభద్ర స్వామి ఎమ్మెల్యేలుగా గెలుపొందటంతో ఈ మూడు ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీ అయ్యాయి. ఈ మూడు స్థానాలకు ఉపఎన్నిక నిర్వహించేందుకు ఈసీ ఈ నోటిఫికేషన్ జారీ చేసింది.
జగన్ జెరూసలేం పర్యటనలో ఉన్నప్పటి నుంచే ఎవరిని ఎంపిక చేస్తారన్నది ఉత్కంఠగా మారింది.
సోమవారం ఉదయం వైసీపీ కేంద్ర కార్యాలయం నుంచి ప్రెస్‌నోట్ రిలీజ్ చేశారు. వైసీపీ ఎమ్మెల్సీ అభ్యర్థులుగా మంత్రి మోపిదేవి వెంకటరమణ - మైనార్టీ నాయకుడు మహ్మద్ ఇక్బాల్, కర్నూలు జిల్లా సీనియర్ నాయకుడు చల్లా రామకృష్ణారెడ్డి పేర్లు ఖరారయ్యాయి. ఇదిలా ఉంటే మూడో ఎమ్మెల్సీ స్థానాన్ని గుంటూరు జిల్లా చిలకలూరిపేటకు చెందిన సీనియర్ నేత మర్రి రాజశేఖర్‌కు ఇస్తారని అందరూ అనుకున్నారు.
ఎన్నికల్లో బీసీ మహిళ విడదల రజనీ కోసం సీటు త్యాగం చేసిన రాజశేఖర్‌కు ఎమ్మెల్సీతో పాటు మంత్రి పదవి కూడా ఇస్తానని జగన్ చిలకలూరిపేట బహిరంగ సభలో ఓపెన్‌గానే ప్రకటన చేశారు. జగన్ తొలి కేబినెట్లో రాజశేఖర్‌కు మంత్రి పదవి ఇవ్వలేదు. కనీసం ఆయనకు ఎమ్మెల్సీ అయినా ఇస్తారని అందరూ అనుకున్నారు. ఇప్పుడు జగన్ మాట నమ్మి సీటు త్యాగం చేసి, పార్టీ కోసం కష్టపడ్డా రాజశేఖర్‌కు షాక్ తప్పలేదు.
గుంటూరు జిల్లా పార్టీ అధ్యక్షుడిగా కూడా పనిచేసిన రాజశేఖర్‌కు మంచి పేరుంది. ఇప్పుడు జగన్ ఆయన్ను నమ్మించి దెబ్బేశారని కూడా ఆయన అనుచరులు వాపోతున్నారు. ట్విస్ట్ ఏంటంటే ఎన్నికలకు ముందు పార్టీలో చేరిన ఇక్బాల్‌కు, చల్లా రామకృష్ణారెడ్డికి ఎమ్మెల్సీలు ఇచ్చిన జగన్ రాజశేఖర్‌కు మంత్రి పదవి హామీ ఇచ్చి కూడా కనీసం ఎమ్మెల్సీ ఇవ్వలేదు.