తల పట్టుకున్న జగన్ !

July 08, 2020

అతను ఒక సాధారణ సీఐ.
మనిషిగా ఎవరి స్థానం వారికి ఉంటుంది.
ఎవరి ఆత్మగౌరవం వారికి ఉంటుంది.
అందులో తేడా ఏం లేదు.
కానీ ప్రజలకు సంబంధించినపుడు తప్పు జరిగితే వేలెత్తి చూపుతారు. ఒకరి అవగాహన రాహిత్యం వల్ల రాష్ట్రానికి జరిగే నష్టం ఎవరు పూడ్చగలరు? కేవలం కులం కార్డుతో జగన్ ఆడిన గేమ్ ఈరోజు పెనుముప్పు తెచ్చిపెట్టింది. రాజ్యాధికారం అనేది ఓసీలు, బీసీలు, ఎస్సీలు మాత్రమే కాదు... హిజ్రాలకు, కురూపిలకు, అత్యంత తక్కువ స్థాయి వ్యక్తికి కూడా దక్కవచ్చు. అది రాజ్యాంగం కల్పించిన హక్కు. కానీ... పదవి అంటే అధికారం కాదు, బాధ్యత. దానిని నిర్వర్తించడానికి ఆలోచన, సమాజం పట్ల బాధ్యత, మాట్లాడేటపుడు జాగరూకత, సమస్యలపై అవగాహన అన్నీ అవసరం. అలాంటి అవగాహన లేని వ్యక్తికి పదవి దక్కితే ఎలా ఉంటుందో తాజాగా జరిగిన ఘోరం మళ్లీ మళ్లీ రిపీట్ అవుతుంది.
14 వేల కోట్ల పెట్టుబడి అంటే మాటలు కాదు, అమెరికా దేశం కూడా రెడ్ కార్పెట్ పరిచి ఆహ్వానించేంతటి పెద్ద సొమ్ము అది. అలాంటి పెట్టుబడి రాష్ట్రంలోకి వస్తే... కళ్లకు అద్దుకుని కాపాడుకోవాలి. కానీ రాష్ట్రం ఆర్థిక వ్యవస్థకు ఊతమిచ్చిన వేలాది కోట్ల పెట్టుబడి పెట్టిన కియా కంపెనీని... ఇటీవలే ఎంపీ అయిన ఒక సాధారణ సీఐ బెదిరించడం ఏంటి? అత్యంత ప్రతిష్టాత్మకమైన అంతర్జాతీయ మీడియా హాజరైన కార్యక్రమంలో కారుపై నిరసన గీతలు రాయడం ఏంటి? ఇంత బాధ్యతా రాహిత్యమా? అంత పెద్ద పెట్టుబడి పెట్టిన కంపెనీని ఇంత అవమానిస్తారా?
చివరకు పక్కనున్న వైసీపీ నేతలే విస్మయం చేశారంటే... గోరంట్ల మాధవ్ చేసింది ఎంత పెద్ద తప్పో ఇట్టే అర్థమవుతోంది.
ఆయన అక్కడితో ఆగలేదు. తన స్థాయి మరిచి కంపెనీ ప్రతినిధులపై స్థానికులకు ఉద్యోగాలు కల్పించడం లేదని మొహం మీదే తిట్టారు. ప్రతినిధులు నిశ్చేష్టులై చూస్తుండిపోయారు. అయినా... కియా పరిశ్రమ వల్లే వచ్చే 11 వేల ఉద్యోగాలు చాలా... ఇతర ఏ ప్రయోజనాలు వద్దా? అసలు ఒక పరిశ్రమ వస్తే దాని వల్ల పరోక్ష లాభాలు ఎన్ని? రాష్ట్ర ఖజానాకు వచ్చే ఆదాయం ఎంత? దానికి అనుగుణంగా వెలిసే ఉప పరిశ్రమలు ఎన్ని? వాటి వల్ల కలిగే ఉద్యోగాలు ఎన్ని? ఇంతమందికి అవసరమైన సాధారణ అవసరాలకు సంబంధించి సృష్టించబడే ఉపాధి ఎంత.... ఇవన్నీ ఆలోచించాలి. పరిశ్రమ చుట్టూ జరిగే ఈ ప్రయోజనాలతో పోల్చుకుంటే... ఆ 11 వేల ఉద్యోగాలు అనేవి అసలు లెక్కనే కాదు. అసలు ఎకరా 30 వేలకు కూడా ఎవరూ కొనని ఆ భూమి ఇపుడు కియా చుట్టుపక్కల గ్రామాల్లో కోటి నుంచి 5 కోట్లు పలుకుతోంది. సుమారు సమీప గ్రామాల్లో 20 వేల మంది ప్రజల సంపద కొన్ని వేల కోట్లు పెరిగింది. ఇక పరిసర నియోజకవర్గాల్లో భూముల ధరలు పెరగడం, వాటి వల్ల వెలసిన కొత్త మార్కెట్, తరలివచ్చిన సంపదతో పోల్చుకుంటే... ఆ ఉద్యోగాలు ఏ పాటి?
ఈ కనీస అవగాహన లేకుండా అంత పెద్ద పెట్టుబడిని భయబ్రాంతులకు గురిచేస్తే భవిష్యత్తులో ఎవరైనా ఏపీ మొహం చూస్తారా? మాకేం కర్మ... అంటారు. అపుడు ఏపీ ప్రజలు నాలుక గీసుకుని కూర్చోవాలి. అందుకే... ఈ విషయం అర్థమైంది కాబట్టే... వెంటనే వచ్చి తనను కలవమని గోరంట్లకు జగన్ కబురు పంపారు. ఈరోజు విజయవాడలో సదస్సు పెట్టి పెట్టుబడులు తెండి అని బతిమాలుతుంటే... నోటికొచ్చిన కూతలు కూసి నా ఫ్యూచర్ ను ముంచుతావా? అంటూ జగన్ ఆల్రెడీ ఫోన్లో క్లాస్ పీకినట్టు తెలిసింది. కులం, చదువు కంటే... బాధ్యత, అవగాహన పదవులు అలంకరించేవారికి ఎంత ప్రధానమో చెప్పే సంఘటన ఇది. జగన్ ఇపుడు కనుక జాగ్రత్త పడకపోతే పరిస్థితి చేయిదాటిపోతుంది.