జగన్ కామెంట్స్.. చెల్లెలు టార్గెట్ అయింది

July 12, 2020

రాజకీయ నాయకుల వ్యక్తిగత జీవితాల్ని తవ్వితే చాలా లుకలుకలు  బయటికి వస్తాయి. కాబట్టి ఏం విమర్శలు చేసినా రాజకీయంగా చేయాలి తప్ప వ్యక్తిగత జీవితాల గురించి కామెంట్లు చేయకూడదని అంటారు. ఈ విషయంలో రాజకీయ నాయకులే ఎవరికి వారు పరిమితులు విధించుకోవాలి. ఒక వేలు అవతలి వాళ్ల వైపు చూపిస్తే.. నాలుగు వేళ్లు మన వైపు చూపిస్తాయనే సామెత ఇక్కడ ప్రస్తావనార్హం. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనవసరంగా పవన్ వ్యక్తిగత జీవితం గురించి అభ్యంతరకర వ్యాఖ్యలు చేసి తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్నాడు. ఏపీలో వచ్చే విద్యా సంవత్సరం నుంచి ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడియం ప్రవేశ పెట్టాలన్న నిర్ణయంపై విమర్శలు చేసిన అందరినీ టార్గెట్ చేస్తూ మాట్లాడాడు జగన్. 

మిగతా వాళ్ల సంగతలా ఉంచితే పవన్ దగ్గరికొచ్చేసరికి ఆయనకు ముగ్గురు భార్యలు ఉన్నారన్నాడు. వాళ్ల పిల్లలు ఏ మీడియం స్కూల్లో చదువుతున్నారని ప్రశ్నించాడు. ఇక్కడ పవన్ పెళ్లిళ్ల గురించి మాట్లాడాల్సిన అవసరమే లేదు. కానీ తనను రాజకీయంగా గట్టిగా ఢీకొడుతున్న పవన్ మీద జగన్‌లో ఉన్న మంట ఈ వ్యాఖ్యలతో స్పష్టంగా బయటపడిపోయింది. ఐతే ఒక వ్యక్తి అక్రమ సంబంధాలు పెట్టుకుంటే తప్పు కానీ.. భాగస్వామి నచ్చకుంటే చట్టబద్ధంగా విడాకులిచ్చి మళ్లీ మళ్లీ పెళ్లి చేసుకోవడంలో తప్పేముంది? కానీ పవన్‌ను విమర్శించడానికి వేరే అంశాలు లేక చాలామంది అతడి పెళ్ళిళ్ళ వ్యవహారాన్ని తెరపైకి తెస్తుంటారు. 

ఐతే సాధారణ కార్యకర్తలు, చిన్న స్థాయి నాయకులు ఈ రకమైన విమర్శలు చేస్తే ఓకే కానీ.. ప్రతిపక్ష నేతగా ఉన్నపుడు ఒకసారి ఇదే విషయంపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన జగన్.. ఇప్పుడు ముఖ్యమంత్రిలో పదవిలో ఉంటూ కూడా పవన్ పెళ్ళిళ్ళ వ్యవహారం గురించి మాట్లాడటం ఆయన స్థాయిని తగ్గించేసింది. ఈ వ్యాఖ్యల నేపథ్యంలో జనసైనికులు ఊరుకుంటారా? జగన్ చెల్లెలు ముందు తన మావయ్యనే పెళ్లి చేసుకుని.. ఆయన నుంచి విడిపోయి మరో పెళ్లి చేసుకోవడాన్ని ప్రస్తావిస్తూ దీనికేమంటావని జగన్‌ను ప్రశ్నిస్తున్నారు. ఒకసారి విడాకులు తీసుకుని మరో పెళ్లి చేసుకుంటే లేని తప్పు.. రెండుసార్లు విడాకులు తీసుకుని మళ్లీ పెళ్లి చేసుకుంటే తప్పెలా అవుతుందని అడుగుతున్నారు. అలాగే షర్మిళ వ్యక్తిగత జీవితానికి సంబంధించి గతంలో వచ్చిన కొన్ని ఆరోపణల్ని కూడా బయటికి తీస్తున్నారు.