అపుడెందుకు సిగ్గుపడలేదు జగన్?

October 18, 2019

పాపం కొందరు ప్రజావేదిక అక్రమకట్టడం... కూల్చేస్తా అనగానే జగన్ మొగోడ్రా భాయ్... మంచోడ్రా భాయ్... అంటూ సంకలు గుద్దుకుని ఉంటారు. రాజకీయ నాయకులు చెప్పిన మాటపై నిలబడితే ఈపాటికి ఏపీకి ప్రత్యక హోదా వచ్చేది. ఢిల్లీని తలదన్నే రాజధాని వచ్చేది. మరి ఆగి తరచి చూస్తే... ఐదేళ్లలో మంచా చెడా తెలుస్తుంది. అయితే, కొందరి మాటలు భవిష్యత్తు చూశాక గాని చెప్పలేం. కానీ మన  ముఖ్యమంత్రి జగన్ మాటలు గతం చూసి చెప్పేయొచ్చు.
ఒక వారం రోజులు వెనక్కు వెళ్దాం.
కృష్ణానదీ తీరంలో తొట్టతొలి నిర్మాణం గణపతి సచ్చిదానంద స్వామి ఆశ్రమం. గుర్తుందా మొన్ననే కేసీఆర్ జగన్ కలిసి అక్కడ జగన్ దేహం అయిన (అదేనండి జగన్ తన ప్రాణం అని స్వరూపానంద చెప్పినపుడు జగన్ స్వరూపానందకు దేహమే కదా) స్వరూపానంద (స్వామీజీ అనమంటారా) ని గట్టిగా సత్కరించారు. ఓ అక్రమ నిర్మాణంలో మా గురువు గారికి సన్మానం చేయాల్సి వచ్చినందుకు సిగ్గుగా ఉందని ఆరోజు చెప్పలేకపోయారు. ఎందుకంటే ఆ ఆశ్రమానికి చంద్రబాబుకు సంబంధం లేదుకదా. అందుకని చెప్పలేదు.
ప్రజా వేదికకు అవతలిపక్క వీహెచ్‌పీ, బీజేపీలో కీలక నాయకుడు గోకరాజు రంగరాజు గారి పుణ్యక్షేత్రం ఉంది. మరి దాన్ని కూలగొట్టేకుండా ఉంటే జగన్ కి సిగ్గేస్తుందా? వేయదా? 
ఆ పక్కనే ప్రజా ప్రకృతి వైద్యుడు (స్వయంప్రకటితం) మంతెన సత్యనారాయణ రాజు ఆశ్రమం ఉంది... దాని కూలగొట్టుకుంటే జగన్ కు సిగ్గేస్తుందా వేయదా?
మరి బీజేపీ పెద్దలకు ప్రీతిపాత్రమైన శివస్వామి ఆశ్రమం కూలగొడతాడా? కూలగొట్టడా?
పాపం... జగన్ ప్రజావేదిక అక్రమాల గురించి చెప్పేటపుడు వీటన్నిటిని ఆయన ఏదో కంగారులో మరిచిపోయి ఉంటాడు... మనోళ్లవే ఎక్కువున్నాయి సార్ అని గుర్తుచేయాల్సింది కదా.  అయితే.. ప్రజావేదిక, చంద్రబాబు ఇల్లు కూలగొట్టాక... అప్పుడు ప్రజాభిప్రాయం మేరకు ఈ అక్రమ కట్టడాల కూల్చివేత ఆగిపోతుందన్నమాట. ప్రజలే దేవుళ్లు కాట్టి ప్రజాభిప్రాయం గౌరవించక తప్పదు కదా.

"అక్రమ కట్టడాలు నా నియోజకవర్గంలో ఉండటం వలన ఎల్లుండు నేనే దగ్గరుండి కూల్చివేతకు సహకరిస్తా" - మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి

ప్రభుత్వ కట్టడం ఆ ప్రజావేదిక. దానికి ఓ జేసిబి రమ్మని, కూల్చేయమని చెబితే కూల్చేస్తారు. దానికి ఎగేసుకొంటూ సహకరించాలా? ఆళ్ల గారు... ఆశ్రమాలతో సహా అన్నీ కూల్చేస్తే మీ దమ్మేంటో జనానికి తెలుస్తుంది. ఎవరూ అడ్డుపడని, ప్రభుత్వ ప్రజావేదిక కూల్చడానికి ఇంత ఢాంభీకాలు ఎందుకు?