​ట్రంప్ చేసిందే.. చేస్తున్నాను, తప్పేముంది - జగన్

August 04, 2020

మా ఉద్యోగాలు మాకే రావాలి అన్న వాదన నుంచి వెనక్కు తగ్గే ప్రసక్తి లేదని ముఖ్యమంత్రి జగన్ వ్యాఖ్యానించారు. విజయవాడలో జరుగుతున్న పెట్టుబడుల సదస్సులో ఆయన పాల్గొని ప్రసంగించారు. ముఖ్యంగా ఉద్యోగాల్లో స్థానికత అన్న అంశంపై జగన్ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. అసలు ఆ నిబంధన తేవడం వెనుక మరో లాజిక్ కూడా ఉందని చెప్పారు.

ప్రపంచం వ్యాప్తంగా నిరుద్యోగ సమస్య పెరిగిన నేపథ్యంలో... మనవాళ్లకు ఆ ఇబ్బంది రాకుండా స్థానికులకే ఉద్యోగాలు అనే అంశంపై మా ప్రభుత్వం కట్టుబడి ఉందని వైఎస్ జగన్ ప్రకటించారు. పరిశ్రమలకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఎన్నో రాయితీలు ఇవ్వాల్సి వస్తుంది. భూములు తక్కువకే ఇస్తాం. పైగా పరిశ్రమల ఏర్పాటుతో స్తానికులకు కొన్ని సమస్యలు వస్తాయి. అవి ప్రజల్లో ప్రభుత్వంపై వ్యతిరేకత రాకుండా ఉండాలంటే... స్థానికులకు ఆ పరిశ్రమ వల్ల ఉపయోగం ఉండాలని జగన్ పేర్కొన్నారు. దీనివల్ల శాంతి భద్రతలు కూడా ఉండవని... కంపెనీ పెట్టిన ఊరికి కంపెనీ వల్ల కాలుష్యమో ఇంకో నష్టమో జరుగుతున్నపుడు కనీసం వారికి ఉద్యోగ భద్రత అయినా లభిస్తే... ధర్నాలు చేయరు అని, పరిశ్రమలను అడ్డుకోరని... దీనివల్ల శాంతి భద్రతలు ఉంటాయని జగన్ అన్నారు.
ఈ సందర్భంగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రస్తావన తెచ్చారు జగన్. అమెరికాలో స్థానికత ఇపుడు ప్రధాన అంశం అయ్యింది. అమెరికా చేస్తున్న పనినే నేను చేస్తున్నాను. మన రాయితీలతో, మన నేలపై నడుస్తున్న కంపెనీలో మన వాళ్లకు ఉద్యోగాలు కోరుకోవడ తప్పేం కాదన్నారు జగన్. ఈ విషయంలో ప్రభుత్వం వెనక్కు వెళ్లదని చెప్పారు. 75 శాతం ఉద్యోగాలకు సంబంధించి తాను తీసుకున్న నిర్ణయాన్ని సమర్థిస్తూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
నైపుణ్యంతో కూడిన మానవ వనరుల సమస్య ఉందని కంపెనీలు భావిస్తే... తమకు ఎలాంటి నైపుణ్యాలతో కూడిన మానవ వనరులు కావాలో ప్రభుత్వానికి ముందుగా తెలియజేయాలని కోరారు. అలా చేస్తే స్థానిక ఇంజనీరింగ్ కాలేజీల్లో స్కిల్ డెవలప్‌మెంట్ సెంటర్స్ ఏర్పాటు చేసి విద్యార్థులకు ఆయా నైపుణ్యాలో శిక్షణ ఇచ్చేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని జగన్ వెల్లడించారు. మానవ వనరుల కొరత రానియ్యకుండా చేస్తామని స్పష్టం చేశారు.