అన్నింటా కోతలే... జగన్ మార్కు సంక్షేమమిదే

May 28, 2020

వైసీపీ అధినేత, ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తన పేరును యాడ్ చేసి ప్రకటించిన జగనన్న విద్యా దీవెన పథకం కోతల పథకంగా మారిందన్న వాదనలు ఆసక్తి రేకెత్తిస్తున్నాయి. రాష్ట్రంలో విద్యకు పెద్ద పీట వేస్తున్నామని, ఏ ఒక్క పేద విద్యార్థి కూడా డబ్బు లేదన్న కారణంగా విద్యకు దూరం కాకూడన్న భావనతోనే ఈ పథకాన్ని ప్రవేశపెట్టామని చెప్పిన జగన్... సోమవారం విజయనగరం కేంద్రంగా ఈ పథకానికి శ్రీకారం చుట్టారు.  ఈ పథకం కింద ఐటీఐ, ఇంటర్ తదనంతర విద్యను అభ్యసిస్తున్న విద్యార్థులకు ఏటా రూ.20వేలు ఇస్తున్నట్లుగా జగన్ ప్రకటించారు. అంతేకాకుండా ఈ పథకం కింద 11 లక్షల మంది విద్యార్థులకు రూ.20 వేల చొప్పున వారి తల్లుల బ్యాంకు ఖాతాల్లో వేయనున్నట్లుగా కూడా జగన్ ప్రకటించారు. ఇంతదాకా బాగానే ఉన్నా... అసలు ఈ పథకం కింద జగన్ కొత్తగా చేర్చిన విషయాలు ఏమిటన్న అంశాన్ని పరిశీలిస్తే... ఈ పథకం ఓ కోతల పథకంగా కనిపించక మానదు.

జగనన్న విద్యా దీవెనకు ముందు ఇంటర్ విద్యార్థులతో కలిపి ఉన్నత విద్యనభ్యసించే బలహీన వర్గాలకు చెందిన విద్యార్థులకు ఏడాదికి డైట్ చార్జీల కింద రూ.14 వేలు, కాస్మెటిక్ చార్జీల కింద ఏడాదికి రూ.5 వేలు అందజేసేవారు. టీడీపీ పాలన కంటే ముందు ఈ చార్జీలు చాలా తక్కువగా ఉన్నా... చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తర్వాత డైట్ చార్జీలతో పాటుగా కాస్మెటిక్ చార్జీలను కూడా భారీగానే పెంచారు. అంతేకాకుండా ఈ చార్జీలను క్రమం తప్పకుండా కూడా చంద్రబాబు సర్కారు విడుదల చేసేది. అయితే జగన్ సీఎం అయ్యాక... ఈ రెండు రకాల చార్జీలను ఎత్తేశారు. ఈ రెండు రకాల చార్జీలను కలిపితే... ఒక్కో విద్యార్థికి ఏడాదికి రూ.19 వేలు అందుతుంటే... దానికి ఓ రూ.1 వెయ్యి మాత్రం పెంచేసి... రూ.20 వేల రౌండ్ ఫిగర్ చేసేసి జగనన్న విద్యా దీవెన అంటూ పథకానికి కొత్తగా ఓ పేరు పెట్టేశారు. 

అంటే... జగనన్న విద్యాదీవెన కొత్త పథకం ఏమీ కాదని తేలిపోయినట్టే కదా. రూ.19వేలను కాస్తా రూ.20 వేలకు పెంచేశారంతే. అయినా మేలే కదా అంటారా? అసలు మర్మం ఇక్కడే ఉంది. జగనన్న విద్యా దీవెన కింద ప్రస్తుతం 11 లక్షల మంది విద్యార్థులకు ఏడాదికి రూ.20 వేలు ఇస్తున్నామని చెబుతున్న జగన్ సర్కారు.. టీడీపీ హయాంలో డైట్, కాస్మెటిక్ చార్జీలు అందుకుంటున్న 16 లక్షల మంది లబ్ధిదారుల్లో ఏకంగా 5 లక్షల మంది విద్యార్థులను ఈ పథకం నుంచి తీసిపారేసింది. అంటే... టీడీపీ హయాంలో డైట్, కాస్మెటిక్ చార్జీలు 16 లక్షల మంది విద్యార్థులకు అందితే... జగనన్న విద్యాదీవెనలో ఈ సంఖ్యను 11 లక్షలకు కుదించేశారన్న మాట. అంటే... ఏకంగా 5 లక్షల మంది విద్యార్థులను ఈ పథకం నుంచి ఎత్తేశారన్న మాట. ఈ లెక్కన.. జగనన్న దీవెన పథకం కొత్తది కాకపోగా... కోతల పథకంగా మారిపోయిందన్న మాట. 

అయితే... పాత పథకాలను తనకు క్రెడిట్ వచ్చేలా రూపొందించుకోవడంలో మాత్రం, జగనే చేశాడు మిగతా వాళ్లు చేయలేదు అనేలా పబ్లిసిటీ చేసుకోవడంలో మాత్రం వైసీపీకి వందకు వంద మార్కులేయాలి. విద్యావిప్లవంలో తానేదో కొత్త విప్లవాన్ని సృష్టించినట్టు జరుగుతున్న ప్రచారం చూస్తుంటే.. పీఆర్ చేసుకోవడంలో వైసీపీ దేశంలో నెం.1 స్థానానికి వెళ్లిపోయిందేమో అనిపిస్తుంది.