హామీలిచ్చేటప్పుడు కండీషన్లు చెప్పరేం జగన్

May 26, 2020

ఒకటి కొంటే మరొకటి ఉచితం.. మెగా సేల్ 80% ఉచితమంటూ ఊరించే ప్రకటనల మీద ఓ బుల్లి నక్షత్రం ఉండటం.. సదరు చుక్క పరమార్థాన్ని విప్పి చెబుతూ.. షరతులు వరిస్తాయన్న మాటను ముచ్చటగా చెప్పేయటం చాలా షాపుల విషయంలో చూస్తున్నాం. ఇప్పుడు రాజకీయ పార్టీలు పరిస్థితి కూడా ఇంచుమించు ఇలానే ఉంది.
మాట మీద నిలబడే వంశం అంటూ గొప్పలు చెప్పే ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి.. ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసినంతనే హామీల మీద హామీల్ని అమలు చేస్తున్నట్లుగా ప్రకటనలు ఇచ్చేసుకోవటం తెలిసిందే. అంతేనా.. వంద రోజుల పాలనకు వంద మార్కులు వేసుకొని.. చంకలు గుద్దుకుంటున్న వేళ.. జగన్ సర్కారు చేసిన ప్రకటన ఆటో.. క్యాబ్ డ్రైవర్లకు ఆశనిపాతంగా మారింది.
పాదయాత్రలోనూ.. ఎన్నికల ప్రచారంలోనే తాను పవర్లోకి వచ్చినంతనే ఆటో డ్రైవర్లకు.. క్యాబ్ తమ్ముళ్లకు తమ ప్రభుత్వం రూ.10వేల ఆర్థిక సాయాన్ని అందించనున్నట్లు చెప్పారు. పదవిని చేపట్టిన వంద రోజులకు ఈ హామీపై ఒక ప్రకటనను విడుదల చేస్తూ.. దిమ్మ తిరిగేలా కొత్త విషయాన్ని చెప్పుకొచ్చారు.
తమ ప్రభుత్వం ఇచ్చే రూ.10వేల సాయాన్ని సొంతం చేసుకోవాలంటే సదరు ఆటో డ్రైవర్ కానీ.. క్యాబ్ తమ్ముడు కానీ సదరు వాహనం సొంతదారులై ఉండాలంటూ చెప్పాల్సిన మాటను చల్లగా చెప్పేసి ఆర్డర్ ఇచ్చేశారు. వాస్తవానికి ఆటో.. క్యాబ్ డ్రైవర్లలో చాలామంది అద్దెకు వాహనాల్నితీసుకొని నడిపే వారే కానీ.. సొంతంగా వాహనాలు ఉండేవి చాలాతక్కువమందికే. ఇలాంటివేళ.. జగన్ హామీ అమలు కారణంగా లబ్థి పొందే వారు చాలా తక్కువమందే ఉంటారన్నది కాదనలేని వాస్తవం.
అందుకే చెప్పేది.. హామీలు ఇచ్చేటప్పుడు వెనుకా ముందు చూసుకోకుండా డ్రైవర్లకు బంపర్ ఆఫర్ ప్రకటించిన జగన్.. తీరా ఇప్పుడు మాత్రం.. తానిచ్చిన హామీ అమలుకు షరతులు వర్తిస్తాయంటూ షాపులోళ్ల నక్షత్రం మాదిరి మాటలు మాట్లాడేస్తున్నారు.