ఏపీ సీఎం దేశం పరువు తీశాడు - కేంద్రమంత్రి

August 07, 2020

జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన కొత్తలో గత టీడీపీ ప్రభుత్వం హయాంలోని పీపీఏలను సమీక్షిస్తామని పలుమార్లు ప్రకటించింది. దీనిపై దేశీయంగా, అంతర్జాతీయంగా విమర్శలు వచ్చాయి. కేంద్ర ప్రభుత్వం కూడా రాష్ట్ర ప్రభుత్వానికి హెచ్చరికలు జారీ చేసింది. పీపీఏలలో అక్రమాలు ఉంటే అందుకు కారణమైన వ్యక్తులపై చర్యలు తీసుకోవాలని, కానీ సమీక్షించడం సరికాదని ఒకింత గట్టిగానే చెప్పింది. తాజాగా, కేంద్రమంత్రి పీయూష్ గోయల్ మరోసారి ఈ అంశంపై స్పందించారు. ఆయన ఎక్కడా రాష్ట్రం పేరు ప్రస్తావించలేదు. పరోక్షంగా వైసీపీ ప్రభుత్వాన్ని ఉద్దేశించి వ్యాఖ్యానించారు.

దావోస్‌లో జరిగిన ఓ సదస్సులో మాట్లాడుతూ.. దక్షిణాదిలోని ఓ రాష్ట్రం పీపీఏలపై పునఃసమీక్ష ప్రయత్నం చేసిందన్నారు. పీపీఏల పునఃసమీక్ష వల్ల అంతర్జాతీయ స్థాయిలో దేశ ప్రతిష్ట దెబ్బతిన్నదన్నారు. ఇలాంటి వాటికి పరిష్కారం లభించకుంటే కేంద్రం చర్యలు తీసుకుంటుందన్నారు. వీటిపై సీఐఐ వంటి సంస్థలు పరిష్కార మార్గాలు చూపించాలన్నారు.

పవర్ పర్చేజ్ అగ్రిమెంట్ వంటి అంశాలు భారత్ ప్రతిష్టాను తీవ్రంగా దెబ్బతీస్తాయన్నారు. ఇలాంటి వాటి పరిష్కారాలపై వర్క్ చేస్తున్నామని చెప్పారు. సీఐఐ సహకరించాలన్నారు. పార్టీలు, ప్రభుత్వాలు మారినప్పటికీ గత ప్రభుత్వాల కాంట్రాక్ట్స్ వంటి వాటిని మార్చడం సరికాదన్నారు. అది కేంద్ర ప్రభుత్వమైనా, రాష్ట్ర ప్రభుత్వమైనా వర్తిస్తుందని అభిప్రాయపడ్డారు.

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి పని చేయాలని, రాష్ట్ర ప్రభుత్వం ఆమోదించని పక్షంలో కేంద్రం నుంచి రాష్ట్రానికి వచ్చే నిధులలో కట్ చేయాలని ఆర్బీఐని ఆదేశిస్తామన్నారు. కానీ దేశ ప్రతిష్ట దెబ్బతీసేలా ఉంటేలా అంగీకరించే ప్రసక్తి లేదన్నారు. ఒప్పందాల్లో ఏమైనా తప్పులు జరిగినట్లుగా కనిపిస్తే ఆ తప్పు చేసిన వ్యక్తులపై చర్యలు తీసుకోవాలని, అంతేకానీ దేశ ప్రతిష్టను చంపేయవద్దన్నారు.