జగన్ గారూ.. మీ బిడ్డలు పాజిటివా? నెగెటివా?

May 28, 2020

వైసీపీ అధినేత, ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఓ విషయానికి సంబంధించిన ఫుల్ క్లారిటీ ఇప్పుడు ఇవ్వక తప్పదన్న వాదన వినిపిస్తోంది. విదేశాల్లో ఉన్న మనోళ్లు తిరిగి వస్తున్న నేపథ్యంలో కరోనా మహమ్మారి వారికి సోకిందేమోనని... అందరినీ ఎయిర్ పోర్టుల నుంచి అటు నుంచి అటే క్వారంటైన్ కు తరలిస్తున్నారు. జగన్ కు వ్యాపార మిత్రుడిగా ఉన్న ప్రముఖ పారిశ్రామికవేత్త నిమ్మగడ్డ ప్రసాద్ కూడా ఇలానే నెలల తర్వాత హైదరాబాద్ వస్తే... ఎయిర్ పోర్టు నుంచే ఆయనను క్వారంటైన్ కు తరలించారు. మరి జగన్ తన ఇద్దరు కుమార్తెలు విదేశాల నుంచి వస్తే నేరుగా ఇంటికి తీసుకెళితే... వారికి వైద్య పరీక్షలు జరిగాయో, లేదో చెప్పాల్సిన అవసరం ఉంది కదా. అంతేనా... అసలు జగన్ తన ఇద్దరు కుమార్తెలు కరోనాకు పాజిటివో, నెగెటివో చెప్పాల్సిందే కదా.

జగన్ పెద్ద కుమార్తె లండన్ స్కూల్ ఆఫ్ ఎకనమిక్స్ లో ప్రవేశం పొందిన సందర్భంగా జగన్ అనుకూల మీడియాతో పాటు దాదాపుగా అన్ని మీడియా సంస్థలు ఆమె ప్రతిభ గురించి కథలు కథలుగా చెప్పుకున్నాయి కదా. ఆమె ఇటీవలే లండన్ నుంచి ల్యాండైపోయారు. నేరుగా ఇంటికెళ్లిపోయారు. లండన్ స్కూల్ ఆఫ్ ఎకనమిక్స్ లో చదువుతున్న ఇద్దరు విద్యార్థులకు కరోనా సోకగా.. వారికి చికిత్స అందిస్తున్నారు. అదే విధంగా అమెరికాలోని నోట్రే డమ్ యూనివర్సిటీలో జగన్ రెండో కూతురు విద్యనభ్యసిస్తున్నారు. ఆమె కూడా ఇటీవలే రాష్ట్రానికి తిరిగి వచ్చారు. ఆమె కూడా పెద్దమ్మాయి మాదిరే నేరుగా ఇంటికెళ్లిపోయారు. జగన్ చిన్న కుమార్తె చదువుకుంటున్న నోట్రే డమ్ లో ఓ విద్యార్థినికి కరోనా వైరస్ సోకగా... ఆమెను ప్రస్తుతం క్వారంటైన్ లో ఉంచి చికిత్స అందిస్తున్నారు. మరి అదే వర్సిటీలో చదవుతున్న జగన్ చిన్న కుమార్తెకు కరోనా సోకిందో లేదో చెప్పాల్సిన అవసరం సీఎంగా ఉన్న జగన్ కు లేదా? అన్న వాదనలు వినిపిస్తున్నాయి.

మొత్తంగా కరోనా పేరు వింటేనే ప్రపంచ దేశాలన్నీ హడలిపోతున్న నేపథ్యంలో... ఇతరుల కంటే చాలా ఆలస్యంగా రాష్ట్రంలో కరోనా నివారణ చర్యలకు శ్రీకారం చుట్టిన జగన్... తన కడుపున పుట్టిన ఇద్దరు కూతుర్ల పరిస్థితి ఏమిటో చెప్పకుండా... కరోనా నివారణ చర్యలపై ఊకదంపుడు ఉపన్యాసాలు ఇస్తే సరిపోతుందా? అన్నది ఇప్పుడు అసలు సిసలు ప్రశ్నగా వినిపిస్తోంది. అసలు విదేశాల నుంచి వచ్చిన తన ఇద్దరు కుమార్తెలకు జగన్ వైద్య పరీక్షలు చేయించారా? లేదా? అన్న విషయాన్ని వెల్లడించాల్సిందే కదా. అంతేకాకుండా వైద్య పరీక్షల్లో తన బిడ్డలు ఇద్దరు కరోనాకు పాజిటివో, లేదంటే నెగెటివో అన్న విషయాన్ని కూడా జగన్ చెప్పాల్సిందే కదా. అంతేకాకుండా జగన్ తన ఇద్దరు కుమార్తెలను ఇంటిలోనే ఐసోలేషన్ లో ఉంచారా? లేదా? అన్న విషయాలను కూడా వెల్లడించాల్సిందే కదా. జనం నుంచి వస్తున్న ఈ ప్రశ్నలకు జగన్ నుంచి సమాధానం వస్తుందో? లేదో? చూడాలి.

జనం ఆస్కింగ్ జగన్ గారూ... మీరు కొంపదీసి ఇంటి చుట్టూ, వారి గదుల్లో, వారి లగేజీపై బ్లీచింగ్ పౌడర్ చల్లించి వారికి 650 గ్రాముల పారసిటమల్ వేసి పడుకోబెట్టారా ?