ఐఏఎస్ లు జగన్ ని ఎలా తిట్టారంటే...

June 01, 2020

ఊరందరిదీ ఒక దారైతే...ఉలికిపిట్టదొక దారి అన్న చందంగా తయారైంది ఏపీ సీఎం వైఎస్ జగన్ వ్యవహార శైలి. సీఎంగా ప్రమాణ స్వీకారం చేసినటప్పటి నుంచి పలు వివాదాస్పద నిర్ణయాలు తీసుకున్న జగన్...కరోనా విపత్తు సమయంలోనూ తన నైజాన్ని మార్చుకోలేదు. ఓ వైపు ప్రపంచమంతా కరోనా కట్టడి కోసం కలిసికట్టుగా పనిచేస్తోంటే.....జగన్ మాత్రం తన మార్క్ రాజకీయాలకు తెరలేపారు. కరోనా బారి నుంచి ప్రజలను ఎలా కాపాడుకోవాలిరా దేవుడా అని దేశ ప్రధాని సహా అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు తలలుపట్టుకుంటుంటే....ఏపీ సీఎం జగన్ మాత్రం కరోనా సంగతి తర్వాత...ముందు రాజకీయాలు ముఖ్యం అన్న చందంగా వ్యవహరిస్తున్నారు. ఓ వైపు ఏపీలో కరోనా కేసుల సంఖ్య నానాటికీ పెరుగుతోంది....మరోవైపు లాక్ డౌన్ ఎత్తివేయాలా ...లేదా..? ఒక వేళ ఎత్తివేస్తే తదనంతర పరిణామాలను ఎలా హ్యాండిల్ చేయాల్సి ఉంటుంది అన్న విషయాలపై అన్ని రాష్ట్రాల సీఎంలతో ప్రధాని మోడీ చర్చలు జరుపుతున్నారు. 

కానీ, ఇవేమీ పట్టనట్లు ఏపీ సీఈసీ పదవీ కాలం, అర్హతలు వంటి పలు విషయాలలో మార్పులుచేర్పులు చేస్తూ...జగన్ చరిత్ర లో కనీవిని ఎరుగని ఆర్డినెన్స్ తెేవడంపై ఇరు తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. జగన్ ప్రభుత్వం తాజాగా తెచ్చిన ఆర్డినెన్స్ పై ఐఏఎస్ అధికారుల సంఘం తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తోంది. జగన్ తీసుకున్న నిర్ణయంపై పలువురు తాజా, మాజీ ఐఏఎస్ అధికారులు, కేంద్ర ఎన్నికల సంఘం మాజీ ప్రధానాధికారి విమర్శలు గుప్పిస్తున్నారు. ఇప్పటివరకు రాష్ట్ర లేదా కేంద్ర ఎన్నికల సంఘం ప్రధానాధికారిగా రిటైర్డ్ ఐఏఎస్ లను నియమిస్తూ వస్తున్నారు. అయితే, కేవలం మాజీ ఐఏఎస్, ఏపీ మాజీ సీఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ పై కక్ష సాధించేందుకు గతంలో ఎన్నడూ లేని విధంగా ఓ సరికొత్త ఆర్డినెన్స్ ను జగన్ తీసుకువచ్చారు. సీఈసీ పదవీ కాలాన్ని మూడు సంవత్సరాలకు కుదించడంతోపాటు కేవలం రిటైర్డు హైకోర్టు జడ్జిలే ఆ పదవికి అర్హులంటూ నయా రూల్ పాస్ చేశారు. 
 
దీనిపై ఐఏఎస్ అధికారుల సంఘం మండిపడుతోంది. ఓ వైపు ఐఏఎస్ అధికారులంతా కరోనా కట్టడి కోసం తీవ్రంగా శ్రమిస్తోంటే...మరోవైపు సిగ్గులేని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం...కుల వివక్షతో కూడిన కక్ష సాధింపు చర్యలో భాగంగా రమేష్ కుమార్ ను తొలగించేందుకు కొత్త ఆర్డినెన్స్ ను తెచ్చింది. జగన్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం బూమరాంగ్ అవుతుందని కేంద్రం ఎన్నికల సంఘం మాజీ సీఈసీ  డాక్టర్ ఎస్ వై ఖురేషీ మండిపడ్డారు. ఎన్నికల నిర్వహణ అన్నది పూర్తిగా పాలనా పరమైన వ్యవహారమని, మన దేశంలోని ఎన్నికల ప్రక్రియ, ఎన్నికల సంఘం విధులు...ప్రపంచంలోకెల్లా గొప్పవని హిల్లరీ క్లింటన్ కితాబిచ్చారని ఖురేషీ గుర్తు చేశారు. అసలు విరగని వస్తువుని రిపేర్ చేయాలని అనుకోకూడదని...అలాగే మాజీ ఐఏఎస్ లతో ఎన్నికల ప్రక్రియ సజావుగా సాగుతున్న నేపథ్యంలో రిటైర్డు జడ్జ్ లను సీఈసీలుగా నియమించాలకుకోవడం జగన్ ప్రభుత్వం తీసుకున్న అనాలోచిత నిర్ణయమని విమర్శించారు. 
 
అర్ధాంతరంగా ఆగిపోయిన స్థానిక సంస్థల ఎన్నికలను ప్రభావితం చేసేందుకే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని, గతంలో ఉన్నవారికంటే రాబోయేవారు పవిత్రమైన వారు అనే ఉద్దేశ్యంతోనే ఇలా చేసినట్లు తెలుస్తోందని ఐఏఎస్ అధికారుల సంఘం అభిప్రాయపడింది. ఒక రాజకీయ నాయకుడు తర్వాతి ఎన్నికల గురించి ఆలోచిస్తాడని, ఒక రాజనీతి గలవాడు తన తర్వాతి తరం గురించి ఆలోచిస్తాడని విమర్శించింది. రాజ్యాంగబద్ధమైన, స్వయంప్రతిపత్తి కలిగిన రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రధానాధికారిని రాష్ట్రం ఈ రకంగా తొలగించడం రాజ్యాంగవిరుద్ధమని, దీనిని కోర్టులో సవాల్ చేయాలని అభిప్రాయపడింది. ఒక్క పాకిస్థాన్ లో మాత్రమే రాష్ట్ర, దేశ ఎన్నిలక సంఘం అధికారులుగా రిటైర్డు జడ్జిలు ఉన్నారని, అక్కడ ఎన్నికల ప్రక్రియ చాలా సజావుగా జరిగిందని, భారత్ లో మాత్రం అలా ఎప్పుడూ జరగలేదని చెప్పింది. భారత్ లోని రిటైర్డు జడ్జిలు క్షేత్ర స్థాయిలో ఎన్నికల విధులు, నిర్వహణ ఎలా ఉంటుందో త్వరలోనే తెలుసుకోబోతున్నారని అభిప్రాయపడింది.
 
రాష్ట్ర ఎన్నికల సంఘం స్వతంత్ర ప్రతిపత్తిని కాపాడటానికి రాజ్యాంగం నిబంధన విధించిందని, ఇష్టం వచ్చిన విధంగా రాష్ట్రాలకు మార్చే విధానం ఉంటే ఆ రాజ్యాంగ సంస్థకు రాజ్యాంగం కల్పించిన ప్రత్యేకత కు అర్థం లేదని మాజీ ఐఏఎస్ ఐవైఆర్ కృష్ణారావు అభిప్రాయపడ్డారు.  అలాంటప్పుడు పంచాయతీ రాజ్ శాఖ ద్వారానే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించవచ్చని, ఎన్నికల సంఘం అవసరం ఉండదని అన్నారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 243కే ప్రకారం రాష్ట్ర ఎన్నికల సంఘం పదవిలో ఉన్న కాలంలో సీఈసీకి ప్రతికూలంగా సర్వీసు నిబంధనలు మార్చకూడదని, పదవీ కాలం కూడా సర్వీసు నిబంధనల కిందకే వస్తుందని తాను అభిప్రాయపడుతున్నానని చెప్పారు. కాగా, తాజా ఆర్డినెన్స్ పై రమేష్ కుమార్ కోర్టును ఆశ్రయించబోతున్నారని తెలుస్తోంది. ఏది ఏమైనా, కరోనా విపత్తు సమయంలో కొత్త రాజకీయాలకు, సరికొత్త ఆర్డినెన్స్ లకు తెర తీసిన జగన్ ...తన అనాలోచిత నిర్ణయాల పరంపరను కొనసాగిస్తున్నారని చెప్పవచ్చు.