ఏపీ ఎటుపోతోంది ... ?

July 15, 2020

ప్రజాస్వామ్యంలో అధికారం పంచే హక్కును రాజ్యాంగం ప్రజలకు ఇచ్చింది. వారు తమకు మంచి చేస్తారు అనుకునే వారికి దానిని కట్టబెడుతూ ఉంటారు. వాస్తవానికి ఇంతవరకు ఎన్నో మార్పులు వచ్చినా... ఇప్పటికీ సమాజం సుఖసంతోషాలతో గడిపేలా పాలించే నాయకుడు మాత్రం పూర్తి స్థాయిలో దొరకలేదు. అందరూ ప్రజలను వాడుకున్నారు. ఇంకొందరు పగలు తీర్చుకుంటున్నారు. కొందరు ప్రజలకు కొంత మేలు చేశారు. ఇంకొందరు ఇంకొంత మేలు చేశారు. ఏ మేలు చేయని పాలకులు కూడా ఉన్నారు. 

అయితే, తమకు మంచి చేయాలని ప్రజలు జగన్ కి అధికారం కట్టబెట్టారు. కానీ ముఖ్యమంత్రి జగన్... ఆ అధికారాన్ని ప్రజలకు మంచి చేయడాని కోసం కంటే చంద్రబాబు మీద పగ తీర్చుకోవడానికే ఎక్కువ వాడుతున్నారు. జగన్ నిర్ణయాల్లో అత్యధికం తన ఇగోను సంతృప్తి పరచడం కోసమే తీసుకుంటున్నారు. అలాంటి కొన్ని నిర్ణయాలను పరిశీలిద్దాం. 

పాస్టర్లకు వేతనాలు? 

దీని ఉద్దేశం ఏమిటి? పాస్టర్ల వృత్తిని బతికించడం, వారిని ఆదుకోవడం అంటే.. మత మార్పిడులు చేసే వారికి ప్రభుత్వ జీతంతో బతికించడమే కదా. లేదు లౌకికతత్వం అనుకుంటే... అన్ని మతాలకు చెందిన ప్రార్థన మందిరాల వారికి ఈ పథకాన్ని వర్తింపచేయాలి కదా. అది జరగలేదు. కేవలం క్రిస్టియన్లకు మాత్రమే ఈ నిర్ణయం. 

జెరూసలెం యాత్రకు సాయం రెట్టింపు

జెరూసలెం యాత్ర చేయడం వల్ల సమాజానికి ఏం ఉపయోగం. ఆయా వ్యక్తులు పుణ్యం ఆశించి చేసే యాత్ర అది. అది వ్యక్తిగతమైనది. ప్రభుత్వ పన్నుల డబ్బులు అలా పంచడం మన లౌకిక వాదానికి విరుద్ధం. మరి దీనివల్ల క్రిస్టియానిటీలో నాస్తికుల పరిస్థితి ఏమిటి? వారికి ఇది అందదు కదా. అది పక్కన పెడితే... ఇతర మతాలు ఇండియాలో చాలా ఉన్నాయి. వారికి కూడా వారి ఆలయాల సందర్శనకు ప్రభుత్వం డబ్బులు ఇస్తుందా? 

ఇంగ్లిష్ మీడియం విద్య

తెలుగు మీడియం అనేది తప్పు కాదు, తప్పుడు విధానం కాదు. ప్రైవేటు స్కూళ్లన్నీ ఇంగ్లిష్ లో ఉన్నంత మాత్రాన సర్కారు బడులు ఇంగ్లిష్ లో ఉండాలా? మేక తోకను ఊపాలా? తోక మేకను ఊపాలా? ఉదాహరణ ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఐదేళ్లలోపు పిల్లలను ప్రభుత్వ బడుల్లోచేర్చుకోరు. ప్రైవేటు బడుల్లో చేర్చుకుంటారు. మరి ప్రైవేటు స్కూళ్లు చేర్చుకుంటాయి కాబట్టి సామాజిక వికాసాన్ని పక్కన పెట్టి ప్రైవేటు స్కూళ్లను ఫాలో అయ్యి గవర్నమెంటు స్కూళ్లలో కూడా మూడేళ్లకే చేర్చుకోరు కదా. ప్రభుత్వం ఆంగ్లంలోకి మారిస్తే... తెలుగు మీడియంలో చదవాలి అనుకునే వారు ఎక్కడ చదువుకోవాలి? మాతృభాష లేక పోతే తెలుగు సంస్కృతి అస్తిత్వం కోల్పోతుంది. తెలుగు సంస్కృతి అస్తిత్వం కోల్పోతే తెలుగు పండుగలకే ముప్పు వస్తుంది. 

మద్య పాన నిషేధం

జగన్ అనేక ఇతర హామీలు ఇచ్చారు. కానీ మద్యపాన నిషేధం చాలా ఆసక్తి చూపుతున్నారు. దీనికి అందులో తమ పార్టీ ఫండ్ సంపాదించుకునే ప్రయత్నమే గాని ఇంకేం లేదని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఒకవైపు ఆంగ్ల విద్యను ప్రోత్సహిస్తూ... దాని ద్వారా వచ్చిన ఆంగ్లేయుల కల్చర్ ను మాత్రం తరిమేస్తాను అంటారు. జగన్ తాగరు కాబట్టి అన్నీ మద్యం వ్యతిరేక నిర్ణయాలు చేస్తారు. కేసీఆర్ తాగుతారు కాబట్టి అన్నీ మద్యం అనుకూల నిర్ణయాలు చేస్తారు. అంటే పాలకుల కోసం అధికారం నడుస్తుందా? ప్రజల కోసం నడుస్తుందా? ఆస్పత్రులను, స్కూళ్లను బాగు చేయడం మానేసి ఎవరికీ అవసరం లేని నిర్ణయాలు తీసుకుంటూ ఏపీ ప్రభుత్వం వింత చర్యలకు పాల్పడుతోంది. ఇదే శ్రద్ధ... జగనే ప్రకటించిన ఇతర మంచి పథకాలు ఏవైనా ఉంటే వాటిపై ఎందుకు చూపరు. 

తిరుమలలో అద్దెగదుల రేట్లు పెంపు

తిరుమల ఉన్నది భక్తి సేవల కోసం. టీటీడీ లక్ష్యం ఆదాయార్జన కాదు. స్వామి వారికి హుండీకి ప్రజలే లెక్కలేనన్ని కానుకలు సమర్పిస్తారు. మరి అలాంటి నేపథ్యంలో ఎందుకు టీటీడీలో అద్దె గదుల  రేట్లు పెంచారు. వాస్తవానికి గదులను ఉచితంగా ఇచ్చేటంత డబ్బు స్వామి వారి వద్ద ఉంది. ప్రస్తుతం వసూలు చేస్తున్న డబ్బు దాని నిర్వహణకు సులువుగా సరిపోతుంది. అయినా కూడా ధరలు పెంచడంలో ముఖ్యమంత్రి ఉద్దేశం ఏంటో మరి. 

అమరావతి - పెద్ద నగరం వద్దు

హైదరాబాదులో కోటి మంది ఉపాధి పొందుతూ బతుకుతున్నారు. ఇది ఎలా సాధ్యం అంటే... అన్నిరకాల సామాజిక సదుపాయాలు, మౌలిక సదుపాయాలు ఇక్కడున్నాయి. అన్ని సంస్కృతుల మేళవింపు ఇది. జనాభా ఒక చోట పెరిగే కొద్దీ అనుబంధ సేవలు, పరిశ్రమల ఉపాధి పెరుగుతుంది. చిన్న చిన్న నగరాల్లో ఇలాంటి ఉపాధి దొరకదు. అందుకే పెద్ద నగరాలు ఉన్న మహారాష్ట్ర, తెలంగాణ, తమిళనాడు, ఢిల్లీ, పశ్చిమబెంగాల్, కర్ణాటక ఉన్న గుర్తింపు ఇతర రాష్ట్రాలకు లేదు. చిన్న రాష్టాల ప్రజలు పెద్ద నగరాలకు తరలివచ్చి ఉపాధి పొందుతున్నారు. ఎంత మందికి అయినా ఉపాధి సృష్టించే శక్తి పెద్ద నగరాలకు ఉంటుంది. కానీ విజన్ లేకుండా వ్యవహరిస్తున్న ఏపీ ముఖ్యమంత్రి జగన్ వల్ల ఏపీ ప్రజలకు మహా నగరం మిస్సవుతోంది. వారు పెద్ద నగరాలకు వలస బాట పడుతున్నారు. బెంగుళూరు, హైదరాబాదులో దొరికే ఉద్యోగం అమరావతిలోనో, వైజాగ్ లోనో దొరికితే అక్కడ కాకుండా ఎవరైనా వేరే ఊరిలో ఉద్యోగం చేయాలనుకోరు కదా. ఈ కామన్ సెన్స్ తో ప్రభుత్వం ఆలోచించాల్సిన అవసరం ఎంతయినా ఉంది.

ఇలా చెప్పుకుంటూ పోతే... జగన్ పాలన తనకు నచ్చినట్టు సాగుతోంది గాని ప్రజలకు నచ్చినట్టు సాగడం లేదని అనేక ఉదాహరణలతో నిరూపించొచ్చు.