ఖాళీ డైరీతో ఢిల్లీకి జగన్... అసలు కారణం అదే !

July 05, 2020

ఏపీ సీఎం హోదాలో వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సోమవారం ఉదయం ఢిల్లీ ఫ్లైట్ ఎక్కనున్నారు. సోమవారం ఉదయం ఢిల్లీ చేరుకునే ఆయన... మంగళవారం కూడా అక్కడే ఉంటారట. అయినా ఇప్పుడెందుకు జగన్ ఢిల్లీకి వెళుతున్నారంటే... ఇంకెందుకండీ బాబూ... చాన్నాళ్లుగా బీజేపీ జాతీయ అధ్యక్షుడు, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాతో బేటీ కోసమేనట. ఎంత ముఖ్యమైన విషయమో తెలియదు గానీ... ఇప్పటికే రెండు పర్యాయాలు అమిత్ షాతో భేటీకి షెడ్యూల్ ఖరారు చేసుకున్నా జగన్ కు ఫలతం దక్కలేదు. అపాయింట్ మెంట్ ఇచ్చినట్టే ఇచ్చేసి.. ఆ వెంటనే రద్దు చేసేస్తున్న అమిత్ షా తీరుతో జగన్ నానా ఇబ్బందులు పడిన వైనం మనకు తెలిసిందే. అయినా కూడా పట్టువదలని విక్రమార్కుడికి మల్లే... జగన్ ఈ సారి కూడా షాతో భేటీ కోసమే సోమవారం డిల్లీకి పయనమవుతున్నారు.

సరే... రెండు సార్లు కుదరలేదు. మరి మూడో సారి అయినా షాతో జగన్ భేటీ జరుగుతుందా? అంటే.. ఇప్పుడిప్పుడే ఈ విషయంపై ఏమీ చెప్పలేమన్న వాదనే జగన్ సైడ్ నుంచి వినిపిస్తోంది. ఎందుకంటే... జగన్ కు అమిత్ షా ఆదివారం రాత్రి పొద్దుపోయే దాకా అసలు అపాయింట్ మెంటే ఇవ్వలేదట. మరి అపాయింట్ మెంట్ దక్కకున్నా స్పెషల్ ఫ్లైట్ వేసుకుని మరీ జగన్ ఢిల్లీకి వెళ్లాల్సిన అవసరం ఏముంది? ఏమో... అమరావతిలోనే ఉండి అపాయింట్ మెంట్ ఇవ్వమంటే అమిత్ షా ఇవ్వడం లేదు కదా. మీ వద్ద ఢిల్లీలోనే ఉన్నాను... ఈ సారి అయినా కాస్తంత కనికరించండి మహాప్రభో అంటేనన్నా... అమిత్ షా కరుణిస్తారేమోనన్నది జగన్ భావనగా చెబుతున్నారు. 

అంటే... ఇప్పటికే రెండు సార్లు తన ఢిల్లీ టూర్ ను వాయిదా వేసుకున్న జగన్.. ఇప్పుడు ముచ్చటగా మూడో పర్యాయం ఢిల్లీ టూర్ ను ఖారారు చేసుకున్నారు. ఈ సారి తప్పనిసరిగా అమిత్ షాను కలిసి తీరాల్సిందేనని కూడా జగన్ గట్టిగానే అనుకున్నట్టుగా ఉంది. మహారాష్ట్ర ఎన్నికల ప్రచారాన్ని చూపిన అమిత్ షా... జగన్ తో భేటీకి ససేమిరా అన్నారు కదా. మరి ఇప్పుడు ఎన్నికల ప్రచారం ముగిసిపోగా... ఢిల్లీలోనే అమిత్ షా అండుబాటులోనే ఉంటారన్న పక్కా సమాచారంతోనే జగన్ ఢిల్లీ టూర్ ను ఖరారు చేసుకున్నట్టుంది. అయితే ఈ సారి అమిత్ షా తో భేటీ కోసం జగన్ ఏకంగా నిలువు కాళ్ల ఉద్యోగంలోకి మారిపోయి... షా అపాయింట్ మెంట్ కోసం అక్కడే ఢిల్లీలో వెయిట్ చేస్తారన్న మాట. మరి ఈ నిలువు కాళ్ల ఉద్యోగమైనా జగన్ కు అమిత్ షాతో అపాయింట్ మెంట్ ఇప్పిస్తుందో? లేదో? చూడాలి.