జగన్ ఢిల్లీకి.. కేసీఆర్ ముంబయికి.. ఎందుకో తెలుసా?

July 13, 2020

ఏపీ సీఎం జగన్ ఢిల్లీ వెళ్తుండగా.. తెలంగాణ సీఎం ముంబయి వెళ్తున్నారు. జగన్ శుక్రవారం రాత్రి ఢిల్లీకి బయలుదేరి వెళ్లనున్నారు. ఈ నెల 15న ఉదయం 10 గంటలకు నంబర్‌ 1, జన్‌పథ్‌లో వైసీపీ లోక్ సభ, రాజ్యసభ సభ్యులతో సమావేశం కానున్నారు. ఈ భేటీలో పార్లమెంటులో అనుసరించాల్సిన వ్యూహంపై ప్రధానంగా చర్చించనున్నారు. ఈ భేటీ అనంతరం కొందరు కేంద్ర మంత్రులను జగన్ కలుసుకునే అవకాశముంది. పార్లమెంటు సమావేశాలు ఈ నెల 17 నుంచి ప్రారంభం కానున్న నేపథ్యలో శనివారం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంటరీ సమావేశం నిర్వహిస్తున్నారు.
మరోవైపు కేంద్ర హోంమంత్రి అమిత్‌షాతో వైఎస్ జగన్ సమావేశం కానున్నారని బీజేపీ వర్గాల నుంచి వినిపిస్తోంది. నీతి ఆయోగ్ సమావేశాల్లో జగన్ పాల్గొంటారు. లోక్ సభ డిప్యూటీ స్పీకర్ పదవి విషయం కూడా బీజేపీ నేతలు, జగన్ మధ్య జరిగే చర్చల్లో ప్రస్తావనకు రావొచ్చని టాక్. దీంతో ఈ పదవి కోరుకుంటున్న ఎంపీలు జగన్‌ దీనిపై సానుకూలంగా స్పందిస్తారో లేదో అని ఎదురుచూస్తున్నారు.
తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు ముంబై వెళ్లనున్నారు. శుక్రవారం మధ్యాహ్నం మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఫడ్నవీస్‌నుతో సీఎం కేసీఆర్ సమావేశం కానున్నారు. 21 కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి ముఖ్యఅతిథిగా సీఎం ఫడ్నవీస్‌ను కేసీఆర్ ఆహ్వానించనున్నారు. ఈ కార్యక్రమానికి ఏపీ సీఎం జగన్ కూడా వెళ్తున్నారు. తెలంగాణ, ఏపీ, మహారాష్ట్ర సీఎంలు వస్తుండంతో పటిష్ఠ భద్రత ఏర్పాటు చేశారు. మావోయిస్టు ప్రాబల్య ప్రాంతం కావడంతో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా నాలుగువేలమంది పోలీసులతో కాళేశ్వరం ప్రాజెక్టు చుట్టూ భద్రత పెంచారు.