జగన్ పథకాలు... నవరత్నాలు కాదు, దశరత్నాలు

June 01, 2020

ఏపీ సీఎంగా పదవీ బాధ్యతలు చేపట్టేందుకు దాదాపుగా తొమ్మిదేళ్లకు పైగా వేచి చూసిన వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి... ఆ తొమ్మిదేళ్ల నిరీక్షణ ప్రతిఫలించేలా ఏపీ సీఎంగా పదవీ బాధ్యతలు చేపట్టగానే నవరత్నాలు అంటూ ఓ తొమ్మిది సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టారు. ఎక్కడికి వెళ్లినా, ఏది మాట్లాడినా, సమీక్ష ఏదైనా; సమావేశం ఏదైనా... జగన్ నోట ఇదే నవరత్నాలు పదే పదే వినిపిస్తున్నాయి. మొన్నటి ఎన్నికల ప్రచారంలోనూ జగన్ ఇదే నవరత్నాలను పలవరించినంత పనిచేశారు. అధికారం చేజిక్కే దాకా నవరత్నాలు అన్న జగన్... ఇప్పుడు అధికారం చేతికందగానే... నవరత్నాలకు బదులుగా దశ రత్నాలను పలవరిస్తున్నారు. నిజమా.? అంటే... జగన్ సీఎం అయ్యాక తీసుకున్న నిర్ణయాలను ఓసారి పరిశీలిస్తే... నవ రత్నాలకు ఇంకో రత్నం తోడైందని ఒప్పుకోక తప్పదు. 

ఆ కథా కమామీషు ఏమిటో చూద్దాం పదండి. జగన్ సీఎం అయ్యాక... తనదైన దూకుడును ప్రదర్శిస్తూ... తనకు గిట్టని ప్రతి దానిని రద్దు చేసుకుంటూ పోతున్నారు. ఈ క్రమంలో విద్యుత్ కొనుగోలు ఒప్పందాలు (పీపీఏ)ల రద్దుతో మొదలైన జగన్ పదో రత్నం... సోమవారం నాటి శాసన మండలి రద్దుతో పరిపూర్ణం అయ్యిందని చెప్పక తప్పదు. పీపీఏల నుంచి మండలి రద్దు మధ్యలో చాలా పథకాలకే జగన్ రద్దు చేశారు. వాటిలో చాలా కీలకమైన అన్న క్యాంటీన్లు కూడా ఉన్నాయి. ఇక జగన్ రద్దు చేసిన మిరికొన్ని పథకాలేమిటన్న విషయానికి వస్తే... మద్యం పాలసీని రద్దు చేసిన జగన్, ఆ తర్వాత ఇసుక పాలసీని రద్దు చేశారు. ప్రభుత్వ పాఠశాలల్లో తెలుగు మాద్యమం రద్దుకు శ్రీకారం చుట్టేసిన జగన్, కీలకమైన పోలవరం ప్రాజెక్టు టెండర్లను కూడా రద్దు చేశారు.

మొత్తంగా జగన్ తన నవరత్నాలకు రద్దుల పథకం అనే మరో రత్నాన్ని చేర్చుకుని దశ రత్నాలు అనే పేరును సార్దకం చేసుకున్నారన్న వాదన వినిపిస్తోంది. జగన్ కలవరిస్తున్న నవరత్నాల మాటేమిటో గానీ... జగన్ రద్దుల పథకం యమా హైలెట్ గా మారిపోతోంది. రద్దు దిశగా జగన్ ఏ నిర్ణయం తీసుకున్నా... దానిపై ఇటు ఏపీలోనే కాకుండా అటు తెలంగాణలోనూ ఆసక్తికర చర్చ నడుస్తోంది. మరి ఈ రద్దుల పథకాన్ని జగన్ ఇలాగే కొనసాగిస్తే... ఇంకెన్ని పథకాలు రద్దు అవుతాయోనన్న అంశంపై లెక్కలేనన్ని విశ్లేషణలు ఆసక్తి రేకెత్తిస్తున్నాయి.