సీబీఐకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చి జగన్ తప్పు చేశారా?

July 08, 2020

దేశానికి హోం మంత్రిగా పనిచేసిన చిదంబరాన్ని సీబీఐ అరెస్టు చేయడం దేశంలోని పలువురు నేతల వెన్నులో వణుకు పుట్టిస్తోంది. కేంద్రం టార్గెట్ చేసి కొందరు నేతలను అరెస్టు చేయించేందుకు ప్రయత్నిస్తోందని ఇప్పటికే కాంగ్రెస్ ఆరోపణలు చేస్తోంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే సీబీఐ, ఈడీ కేసులతో పాటు ఇతర క్రిమినల్ కేసులు ఎదుర్కొంటున్న బీజేపీయేతర నేతలు టెన్షన్ పడుతున్నారట. ఇప్పటికే చిదంబరం తరువాత సునంద పుష్కర్ మృతి కేసులో శశి థరూర్‌ను త్వరలో లోపలేస్తారన్న ప్రచారం జరుగుతోంది. మరోవైపు తాజా పరిణామాల నేపథ్యంలో వైసీపీ అధినేత, ఏపీ సీఎం జగన్‌కూ భవిష్యత్తుల్లో అరెస్టు ముప్పు ఉందన్న ప్రచారం ఒకటి మొదలైంది.
అక్రమాస్తుల కేసుల్లో జగన్‌పై సీబీఐ, ఈడీ కేసులున్నాయి. ఈ కేసుల్లో గతంలో జగన్ ఆస్తులనూ ఈడీ అటాచ్ చేసింది. గతంలో ఓసారి అరెస్టయిన జగన్ 16 నెలల కాలం జైలులోనూ గడిపారు. ఆ తరువాత కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంతో సఖ్యతగా ఉంటూ కేసుల విచారణ స్లోడౌన్ అయ్యేలా చేసుకున్నారని చెబుతుంటారు. అయితే.. బీజేపీ ఎప్పటికప్పుడు తన రాజకీయ వ్యూహాలను మార్చుకుంటూ ఒక్కో రాష్ట్రంలోఅధికారం దిశగా అడుగులు వేస్తున్న నేపథ్యంలో జగన్ విషయంలో ఆ పార్టీ ఇప్పుడు అనుసరిస్తున్న సాఫ్ట్ ధోరణి ముందుముందు అనుసరించకపోవచ్చని తెలుస్తోంది.
అదే జరిగితే జగన్ అక్రమాలు, అవినీతిని ప్రచారంలో తెచ్చి ఆయన్ను కూడా ఇబ్బంది పెట్టొచ్చని వినిపిస్తోంది. వైసీపీలోనూ దీనిపై చర్చ జరుగుతోందని... చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు సీబీఐని రాష్ట్రంలో అడుగు పెట్టకుండా ఇచ్చిన ఉత్తర్వులను జగన్ సీఎం కాగానే రద్దు చేసి తప్పు చేశారన్న వాదన ఒకటి వినిపిస్తోంది. సీబీఐ రాకకు వీలు కల్పిస్తూ జగన్ తీసుకున్న ఆ నిర్ణయమే భవిష్యత్తులో ఆయనకు ఇబ్బందులు తేవొచ్చంటున్నారు.