ఏపీలో కరోనాను మరపించే హాట్ టాపిక్స్ ఇవే

August 13, 2020

కరోనా పేరు చెబితేనే ప్రపంచ దేశాలు వణికిపోతున్నాయి. కరోనా సోకుతుందేమో అని భయపడి ప్రజలు బయటకు రావాలంటేనే వణికిపోతున్నారు. లాక్ డౌన్ పాటిస్తూ ఇళ్లలోనే బిక్కుబిక్కుమంటూ కాలం గడుపుతున్నారు. కరోనా కట్టడికి మిగతా దేశాల మాదిరిగానే భారత్ కూడా అన్ని రాష్ట్రాలకు మార్గదర్శకాలు విధించింది. కరోనాను తరిమి కొట్టేందుకు ఆయా రాష్ట్రాల ప్రభుత్వాలు కూడా అహర్నిశలు ప్రణాళికలు రచిస్తున్నాయి. ఎలాగైనా కరోనా బారి నుంచి బ్రతికి బట్టకట్టాలని వ్యూహాలు రచిస్తున్నాయి. అత్యధిక  కరోనా టెస్టులు నిర్వహించిన రాష్ట్రం మాదేనని...ఏపీ ప్రభుత్వం గణాంకాలు విడుదల చేసింది. అయితే, ఏపీ సర్కార్ కరోనాపై కంటే ఇతర విషయాలపై ఫోకస్ ఎక్కువగా పెట్టిందని విమర్శలు వస్తున్నాయి. ఏపీలో నిమ్మగడ్డ రమేష్ లేఖ వ్యవహారం, ఇంగ్లిష్ మీడియంపై సుధిష్ రాంబొట్ల పిటిషన్ వ్యవహారం, గ్రామ సచివాలయాలకు వైసీపీ రంగుల వివాదం, కరోనా కేసులు కొద్దిగా తగ్గగానే స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ..ఈ 4 విషయాలపై జగన్ ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నారని విపక్షాలు ఆరోపణలు చేస్తున్నాయి. ఇంకా చెప్పాలంటే ఏపీలో కరోనా అంటే ప్రజలే ఎక్కువగా భయపడుతున్నారని... ప్రభుత్వం కరోనాను లైట్ తీసుకుందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. 

కరోనా కంటే ఆ నాలుగు అంశాలపైనే జగన్ ఎక్కువగా ఫోకస్ చేశారనడానికి ఎన్నో విషయాలు దోహదం చేస్తున్నాయి. మొదటగా నిమ్మగడ్డ రమేష్ కుమార్ తొలగింపు, లేఖ వ్యవహారం. ఓ రకంగా చెప్పాలంటే జగన్ నెత్తిమీద నిమ్మగడ్డ రమేష్ పాలు పోశారు. ఎన్నికలు వాయిదా వేయకపోయి ఉంటే...ఏపీలో ఎన్ని పోలింగ్ కేంద్రాలు హాట్ స్పాట్ లుగా మారేవో లెక్కవేయడం కూడా కష్టమే. ఆ విషయాన్ని విస్మరించిన జగన్...హుటాహుటిన కక్ష పూరిత ధోరణితో ఆర్డినెన్స్ తెచ్చి...రమేష్ ను తొలగించి వి.కనగరాజ్ ను ఎస్ ఈసీగా నియమించారు. బాధ్యతలు చేపట్టిందే తడవు....ఏపీలో ఎన్నికలు ఎప్పుడైనా నిర్వహించడానికి సిద్ధంగా ఉండాలని అధికారులతో నిర్వహించిన సమీక్షలో కనగరాజ్ అన్నట్లు తెలుస్తోంది. ఏప్రిల్ 28వ తేదీన ఈ వ్యవహారంపై జరిగే విచారణపై జగన్ ఫోకస్ ఉందని విమర్శలు వస్తున్నాయి.  కరోనా ప్రభావం తగ్గాక సోషల్ డిస్టెన్స్, టైమ్ స్లాట్ విధానం ద్వారా దక్షిణ కొరియా తరహాలో ఎన్నికలు నిర్వహించాలి జగన్ సర్కార్ అనుకుంటోందట  

ఇక, కేంద్రానికి నిమ్మగడ్డ రమేష్ రాసిన లేఖపై సీఐడీ విచారణపై జగన్ ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. ఈ వ్యవహారంపై విజయసాయి...వంటి నేతలు శ్రద్ధ పెట్టారు. ఇక, ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడియం వ్యవహారంపై బీజేపీ అధికార ప్రతినిధి సుధిష్ రాంభొట్ల వేసిన కేసు...వాదనలపై పెట్టినంత శ్రద్ధ కరోనా కట్టడిపై జగన్ సర్కార్ పెట్టలేదన్న ఆరోపణలున్నాయి. చివరగా గ్రామసచివాలయాలకు వేసిన వైసీపీ జెండా రంగులపై హైకోర్టు అక్షింతలు వేయడం...ఆ రంగుల స్థానంలో ఏ రంగులు వేస్తే కేంద్రం మెప్పు పొందవచ్చన్న ప్రయత్నాలపై జగన్ సర్కార్ తీవ్రగా శ్రమిస్తోంది. ఇన్ని వ్యవహారాల నేపథ్యంలో కరోనా కట్టడి..లాక్ డౌన్ తదనంతర పరిణామాలపై ఫోకస్ చేయడానికి జగన్ అండ్ కో కు టైం లేదన్నది విమర్శ కాదు వాస్తవం అని చెప్పాల్సిన పరిస్థితులున్నాయి ఏపీలో. ప్యారాసిటమాల్, బ్లీచింగ్ తో కరోనాను కట్టడి చేయవచ్చిన...కరోనా అంటే జ్వరం వంటిదని చెప్పిన జగన్ పాలనలో కరోనా కట్టడిపై ఇంతకన్నా పురోగతి ఆశించడం అత్యాశే.