జగన్‌కు నోబెల్ బహుమతి ఇవ్వాలట

June 05, 2020

కరోనావైరస్ చికిత్సకు బ్లీచింగ్ పౌడర్, పారాసిటమాల్ మాత్రలు చాలన్న ఏపీ సీఎం జగన్మోహనరెడ్డిపై ఎన్ని సెటైర్లు పడుతున్నాయో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. సోషల్ మీడియాలో అయితే ఒకటే ట్రోలింగ్. ముఖ్యంగా మీమ్స్ అయితే లెక్కలేనన్ని. ఫేస్ బుక్, ట్విటర్, వాట్సాప్, హలో, షేర్ చాల్, ఇన్‌స్టా ఇలా అన్ని సోషల్ మీడియా యాప్స్ జగన్-పారాసిటమాల్ మీమ్స్‌తో నిండిపోతున్నాయి. అదే సమయంలో మరికొందరు జగన్ ఈ మహమ్మారి విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని.. ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారని మండిపడుతున్నారు.
ఏపీలోని నాయకులూ జగన్‌పె విమర్శలు చేస్తున్నారు. ప్రపంచమంతా దద్దరిల్లిపోతుంటే జగన్ మాత్రం నీరో చక్రవర్తిలా మాట్లాడుతున్నారంటూ మండిపడుతున్నారు. తాజాగా సీనియర్ నేత బైరెడ్డి రాజశేఖరరెడ్డి అయితే తనదైన శైలిలో జగన్‌పై విరుచుకుపడ్డారు. కరోనా వైరస్‌కు మందు కనిపెట్టిన జగన్‌కు నోబెల్ బహుమతి ఇవ్వాలంటూ బైరెడ్డి రాజశేఖర్‌రెడ్డి విమర్శించారు. అంతేకాదు, ప్రపంచ ఆరోగ్య సంస్థకు.. జాతీయ మానవహక్కుల కమిషన్‌కు జగన్‌పై ఫిర్యాదు చేస్తానని ఆయన చెప్పారు.
కరోనా వైరస్ వ్యాపిస్తుండడంతో స్థానిక ఎన్నికలు జరపకూడదని ఎన్నికల సంఘానికి రెండ్రోజుల తాను ఫిర్యాదు చేశానని, ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని ఎన్నికలను వాయిదా వేసిన ఎస్ఈసీ రమేష్ కుమార్‌ను బైరెడ్డి ప్రశంసించారు. జగన్ తానే ఒక శాస్త్రవేత్త అనుకుని మాట్లాడుతున్నాడని.. ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారని విమర్శించారు. కరోనా వైరస్‌పై సీఎం జగన్ ప్రెస్‌మీట్‌లో మాట్లాడిన అంశాల క్లిప్పింగ్స్‌ను రాష్ట్రపతి, గవర్నర్, డబ్ల్యూహెచ్‌వో, నేషనల్ హ్యూమన్‌ రైట్స్, విదేశీ ఆరోగ్య సంస్థలకు పంపిస్తానని ఆయన తెలిపారు. ప్రజలు చచ్చినా పర్లేదు కానీ, తాను రాజకీయ లబ్ధి పొందాలని జగన్ భావిస్తున్నారని బైరెడ్డి ఆరోపించారు.