మార్చి 5 వచ్చిపోయింది, మాట నిలబెట్టుకో జగన్

May 29, 2020

బీజేపీ పదేపదే చెబుతున్నట్లుగా ప్రత్యేక హోదా ముగిసిన అధ్యాయంగా కనిపిస్తోంది. ఎందుకంటే బీజేపీ, టీడీపీ, వైసీపీ, జనసేన.. ఇలా అన్ని పార్టీలు దానిని దాదాపు మరిచిపోయాయని చెప్పవచ్చు. ఐతే ప్రజల్లో మాత్రం ప్రత్యేక సెంటిమెంట్ ఉంది. తమను గెలిపిస్తే ప్రత్యేక హోదా సాధిస్తామని గత ఎన్నికల్లో జగన్ ఊదరగొట్టారు. కానీ ఇప్పటి వరకు దాని ప్రస్తావన లేదు. పైగా, కేంద్రంలో ఎన్డీయే ప్రభుత్వానికి పూర్తి మెజార్టీ ఉందని, కాబట్టి తాము ఏం చేయలేకపోతున్నామని చేతులెత్తేశారని చెప్పవచ్చు.

పూర్తి మెజార్టీ అంశాన్ని పక్కన పెడితే.. అసలు వైసీపీ ప్రత్యేక హోదా కోసం ఎక్కడా పోరాడినట్లుగా కనిపించడం లేదనే విమర్శలు వస్తున్నాయి. ప్రభుత్వాలకు పూర్తి మెజార్టీ ఉందని చెప్పి న్యాయంగా రావాల్సిన డిమాండ్లను పక్కన పెట్టడం ఏమిటని నిలదీస్తున్నారు. 20 మంది ఎంపీలను గెలిపిస్తే హోదా కోసం పోరాడుతామని జగన్ ఎన్నికల ప్రచారంలో పదేపదే చెప్పారని, ఇప్పుడు 22 మంది గెలిచినా ఫలితం లేకుండా పోయిందని ఆగ్రహిస్తున్నారు.

మెజార్టీ ఉండటం వేరు, న్యాయపరంగా రావాల్సిన హోదా కోసం పోరాడటం వేరు అని గుర్తు చేస్తున్నారు. ఈ సందర్భంగా సోషల్ మీడియాలోను జగన్‌పై ప్రశ్నలు, విమర్శల వర్షం కురిపిస్తున్నారు. ఎన్నికల ప్రచారం సమయంలో జగన్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

మార్చి 5వ తేదీన వైసీపీకి చెందిన ఎమ్మెల్యేలు, ఎంపీలు, సీనియర్ నేతలు ఢిల్లీకి వెళ్లి ప్రత్యేక హోదా కోసం అక్కడ ధర్నా చేస్తారని, హోదా మా హక్కు... ప్యాకేజీ మాకు వద్దు అని దేశ రాజధానిలో నిరసనలు వ్యక్తం చేస్తారని, బడ్జెట్ సమావేశాలు మార్చి 5న ప్రారంభమవుతాయని, ఆ రోజు నుండే వైసీపీ ఎంపీలు పార్లమెంటులో హోదా కోసం పోరాటం చేస్తారని, ఏప్రిల్ 6వ తేదీ వరకు నడిచే ఈ బడ్జెట్ సమావేశాల్లో.. ఆ నెల రోజుల పాటు ఎంపీలు అక్కడే ఉండి పోరాటం చేస్తారన్నారు.

ప్రత్యేక హోదా రావాలి.. ప్రత్యేక హోదా కావాలని వారు డిమాండ్ చేస్తారని చెప్పారు. ఏప్రిల్ ఆరో తేదీ వరకు వారు పోరాటం చేస్తారని, ఆ తర్వాత కూడా ప్రత్యేక హోదా రాకుంటే ఎంపీలు కఠిన నిర్ణయం తీసుకుంటారని జగన్ గత ఎన్నికల ప్రచార సమయంలో చెప్పారు. జగన్ మాట నిలబెట్టుకో అంటూ హోదా పోరాటం ఏమయిందని ప్రశ్నిస్తున్నారు. ఇప్పుడు ఈ వ్యాఖ్యలతో ప్రజలు, నెటిజన్లు వైసీపీని ఇరకాటంలో పెడుతున్నారు. ప్రధానంగా హోదా సెంటిమెంటుతో అధికారంలోకి వచ్చిన వైసీపీ ఆ దిశగా ఏం ప్రయత్నాలు చేస్తోందని నిలదీస్తున్నారు. మోడీ ప్రభుత్వానికి పూర్తి మెజార్టీ ఉందని చేతులెత్తేయడాన్ని తప్పుబడుతున్నారు.