కొన్నికొన్ని కటౌట్ చూసి నమ్మకూడదు డ్యూడ్

May 26, 2020

‘జగన్ సీఎం కావాలి’ అంటూ బలంగా నినాదాలు చేసినవారు కూడా ఇప్పుడు ఏపీలో సాగుతున్న వైసీపీ పాలన చూసి మౌనవ్రతం పాటిస్తున్నారు. ఏపీ పరిస్థితి ఇప్పుడు ఒకడుగు ముందుకు పదడుగులు వెనక్కు అన్నట్లుగా ఉందని చెప్పలేక చెప్పేస్తున్నారు. జగన్ సీఎం కావాలని బలంగా కోరుకున్న వర్గాల్లో చాలామంది ఇప్పుడు స్వయంగా తమకు నొప్పి తగిలేసరికి ఒళ్లో అగ్గిపోసుకున్నట్లయిందంటూ గగ్గోలు పెడుతున్నారు.

మొదటి ఓటు వేసిన ఉద్యోగులు, ఉపాధ్యాయులు జగన్ అధికారంలోకి రావాలని బలంగా కోరుకున్నారు. వారికి జగన్ ప్రత్యక్షంగా ఇప్పటివరకు అన్యాయం ఏమీ చేయనప్పటికీ జగన్ పేరు చెప్పుకొని హవా చెలాయించేవారి వల్ల ఇబ్బందులు పడుతున్నామని ఉద్యోగ, ఉపాధ్యాయవర్గాలు చెబుతున్నాయి. ముఖ్యంగా ఉపాధ్యాయులు స్కూళ్లలో ఫోన్లు మాట్లాడరాదంటూ నిబంధనలు పెట్టడంతో చాలామంది ఇబ్బందిపడుతున్నారు. పిల్లలను స్కూళ్లు, కాలేజీలకు పంపించి వచ్చే మహిళా ఉపాద్యాయులు.. ఇంట్లో నిస్సహాయంగా ఉండే పెద్దవాళ్ల గురించి మధ్యమధ్యలో ఫాలో అప్ చేయాల్సినవారు ఇబ్బందులు పడుతున్నారు. వీరు అత్యవసర సమయంలో ఫోన్ మాట్లాడడానికి అధికారుల వైపు ఆటంకాలేమీ లేనప్పటికీ స్థానికంగా ఉండే చోటామోటా వైసీపీ నాయకులు మాత్రం తాము పెత్తనం చేయాలన్న అత్యుత్సాహంతో స్కూళ్ల చుట్టూ తిరుగుతూ ‘‘ఏం మేస్టరూ.. బడిలో ఫోన్ తేవొద్దని సీఎం గారు చెప్పారు.. అయినా మాట్లాడుతున్నారా మీరు’’ అంటూ బెదిరింపులకు దిగే పరిస్థితులున్నాయని చెబుతున్నారు.
ఇక రెండో వర్గం రేషన్ డీలర్లు. జగన్ వస్తే తాము ఇష్టారాజ్యంగా డిపోలు నడిపించుకోవచ్చనుకున్నారో ఏమో కానీ చాలామంది రేషన్ డీలర్లు జగన్ రాకకోసం పరితపించిపోయారు. ఇప్పుడు గ్రామ వలంటీర్ల వ్యవస్థతో రేషన్ డీలర్లకు కష్టాలు మొదలయ్యాయి. దీంతో వీరు కూడా ఏదో అనుకుంటే ఏదో అయిందని బాధపడుతున్నారు.
భవన నిర్మాణాలు చేపట్టేవారు జగన్ వస్తే ఇసుక ఇంటికే వచ్చేస్తుందనుకున్నారు. కానీ.. ఇసుక విధానంలో అయోమయం కారణంగా ఇసుక బంగారం కంటే ప్రియమైపోయింది. వైసీపీ నేతల బ్లాక్ మార్కెటింగ్‌తో ఇసుక ధరలకు రెక్కలు వచ్చి ఇల్లు కట్టుకోవడం సామాన్యులకు కష్టంగా మారడంతో పాటు నిర్మాణాలు నిలిచిపోయి ఆ రంగంలో పనిచేసే లక్షలాది మంది కార్మికులు పస్తులుండాల్సిన పరిస్థితి ఏర్పడింది.
వైఎస్ హయాంలో రియల్ ఎస్టేట్ పెరిగినట్లే అతని కొడుకు వస్తే రాష్ట్రంలో భూముల ధరలకు కొత్త రెక్కలు వస్తాయనుకున్న రియల్ రంగానికి మామూలు షాక్ తగలలేదు. కొత్త రెక్కలు రావడం మాట పక్కన పెడితే ఉన్న రెక్కలు విరిగిపోయాయి. 
కొత్త పరిశ్రమలు వచ్చేస్తాయి అని ఆశపడిన ఎంటర్‌ప్రెన్యువర్లు, పారిశ్రామికవేత్తలకు కూడా ఆశాభంగమైంది. ఉన్న పరిశ్రమలకే పనిలేక అందులో పనిచేసేవాళ్లకు జీతాలివ్వలేక లాకౌట్ దిశగా సాగుతున్నాయి రాష్ట్రంలోని వేలాది పరిశ్రమలు.
జీతాలు రూ.10 వేలవుతాయని ఆశపడిన ఆశావర్కర్లకు నిరాశే మిగిలింది. అసలు ఎంతో కొంత జీతమిస్తే అదే పదివేలు అంటున్నారు వారిప్పుడు. బకాయిలు చెల్లించు భయ్యా అంటూ జగనన్నను వేడుకుంటున్నారు.
అమ్మఒడి పథకంలో రూ.15 వేలు వస్తాయన్న ఆశతో ఎందరో తల్లులు తమ బిడ్డలను ఈ ఏడాది నుంచే ప్రయివేటు స్కూళ్లకు పంపించడం ప్రారంభించారు. చేతిలో డబ్బు లేకపోతే అప్పు తెచ్చి మరీ ఫీజులు కట్టారు. అయితే.. ఆ పథకం ప్రారంభం కావడానికి ఇంకా చాలా టైముండడంతో అంతవరకు తెచ్చిన అప్పుపై వడ్డీలు కట్టలేక అవస్థలు పడుతున్నారు నిరుపేద తల్లులు.
అంతేకాదు... జగన్ తండ్రి వైఎస్ రాజశేఖరరెడ్డిలా పార్టీని, తనను నమ్ముకున్న ప్రతి కార్యకర్తకూ ఏదో ఒక లబ్ధి కలుగుతుందని చాలామంది ఆశించినా అలాంటి సూచనలేమీ కనపడడం లేదంటున్నారు. ఒకరిద్దరు నేతలే చక్రం తిప్పుతూ వారి మనుషులకే లబ్ధి కలిగిస్తున్నారు తప్ప సాధారణ కార్యకర్తలకు ఏమీ ప్రయోజనం లేదని వాపోతున్నారు.
అన్నిటికీ మించి మాటతప్పం, మడమ తిప్పం అన్న జగన్ నినాదం ఒట్టి మాటేనని తేలిపోయిందనీ చెబుతున్నారు. ఏపీ ప్రత్యేక హోదా కోసం అంత చేస్తాను, ఇంత చేస్తాను అని చెప్పిన జగన్, ఆ పార్టీ నాయకులు ఇప్పుడా ఊసే ఎత్తడం లేదని ప్రజలు మండిపడుతున్నారు. విశాఖ జోన్ తరలించినా.. ఆంధ్ర బ్యాంకు విలీనం చేసినా కేంద్రానికి కనీసం ప్రజల మనోభావాల గురించి జగన్ ఒక్క మాట కూడా చెప్పలేకపోతున్నారని విమర్శిస్తున్నారు. జగన్ పాదయాత్రలో ప్రతి ఊర్లో చెప్పినదానికీ ఇప్పుడు చేస్తున్నదానికీ అస్సలు పొంతన లేదని అంటున్నారు.