జగన్ ఫెయిల్ - ఉండవల్లి అరుణ్ కుమార్

August 15, 2020

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాజీ కాంగ్రెస్ నేత, రాజకీయ విశ్లేషకులు ఉండవల్లి అరుణ్ కుమార్ ఝలక్ ఇచ్చారు. ఇంతకాలం జగన్ ను భుజాల మీద మోసి ఉండవల్లి... ప్రజా వ్యతిరేకత అర్థమయ్యాక జగన్ ను ప్రశంసిస్తే జనం ఇక బూతులే తిడతారేమో అని సంశయించి గట్టి విమర్శలే చేశారు. అయినా ఈసారి కూడా పూర్తిగా జగన్ మీద తన అభిమానాన్ని చంపుకోలేక పోయారు. వైఎస్ కొడుకుగా జగన్ పై నాకు అభిమానం ఉంది. ఏపీ ముఖ్యమంత్రిగా నాకు అభిమానం లేదు అన్నారు.

ఒక్కో పాయింట్ పై జగన్ ను ఉండవల్లి అరుణ్ కుమార్ ఎలా విఫలమయ్యారో వివరిస్తూ విమర్శిస్తూ వచ్చారు.

మద్యం -

జగన్ మోహన్ రెడ్డికి చాలా భ్రమలు ఉన్నాయి. మద్యం ధరలు పెరిగితే తాగడం మానేస్తారు అనుకున్నారు. అది జరగదు. అది జగన్ భ్రమ. మద్యం అమ్మకాలు తగ్గడానికి కారణం మద్యం తాగడం మానేయడం కాదు, సారాయే కారణం అన్నారు. జగన్ నిర్ణయం పుణ్యమా అని సారా వ్యాపారులు తెగ వ్యాపారాలు చేసుకుంటున్నారు. అప్పట్లో ఐదు రూపాయలకు దొరికిన నాటుసారాని కూడా ఇపుడు వంద రూపాయలకు అమ్ముతున్నారు. వీలున్న వారు పక్క రాష్ట్రాల నుంచి తెచ్చుకుంటున్నారు. రెండు బాటిల్స్ తీసుకెళ్లడం చట్ట పరంగా తప్పు కాదు. స్మగ్లింగ్ పెరిగింది.

ఇసుక -

ప్రభుత్వం ఇసుకను సిస్టమైజ్ చేయడంలో విఫలమైంది. ఇసుక సామాన్యులకు అందుబాటులో లేదు. ఆన్ లైన్లో దొరకడం లేదు. పక్కనే గోదారి లో కావల్సినంత ఇసుక ఉన్నా బ్లాక్ లో కొంటున్నారు. బ్లాక్ లో కొనకపోతే పనులు ఆగిపోతున్నాయి. ఇసుక సమస్యలో పెద్ద విషయం అవినీతి కాదు, కూలీల ఉపాధి కోల్పోవడం ప్రమాదకరం.  ఇసుక సమయానికి దొరక్క ఉపాధి కోల్పోతున్నారు. ఏడాది కాలంగా ఇసుక సమస్యను ప్రభుత్వం తీర్చలేకపోయింది. ఇసుకపాలసీ, వరదలు, కరోనా... ఏదో ఒకదాని వల్ల పెద్ద ఎత్తున కూలీలకు నష్టం వాటిల్లింది. ఇది ప్రభుత్వం తప్పే.

ఇళ్ల స్థలాలు-

పేదల ఇళ్ల స్థలాల కోసం ఎక్కువ రేట్లకు ప్రభుత్వం భూములు కొనడం అసమర్థత. ఎక్కువ ధరలు పెట్టి భూములు కొనడం తప్పు. ఆవ భూములపై విచారణకు డిమాండ్ చేశాను. దానికి స్పందన లేదు. ఎవరూ పట్టించుకోలేదు. ఎపుడో కట్టిన ఇళ్లను కూడా పేదలకు ఇవ్వలేకపోయారు. అవినీతి రహిత పాలన ఇస్తానని చెప్పారు. ఈ భూముల వ్యవహారంపై ఎందుకు చర్య తీసుకోలేదు?

ప్రతీకార పాలన-

నెల్సన్ మండేలా తనకు ఆదర్శమని జగన్ చెప్పారు. కానీ నాకు అలా అనిపించడం లేదు. నెల్సన్ మండేలా ప్రెసిడెంట్ అయ్యాక ఆయనకు ప్రజలు కనిపించారు కానీ ప్రత్యర్థులు కనిపించలేదు. ప్రతీకార పాలన మంచిది కాదు. నీకు ఓటేసిన 51 శాతం ప్రజలకు ఎలా మేలు జరగాలి అని చూడాలి. మొత్తం ప్రజలకు మేలు చేసి వారి అభిమానం పొందాలని చూడాలి గాని ప్రతీకారం తీర్చుకునే విధానం సరికాదు. విపరీతంగా కేసులు పెడుతున్నారు. 

సోషల్ మీడియా-

న్యాయస్థానాలతో, జడ్జిలతో వైకాపా తరఫున వైరం పెట్టుకుంటున్నారు. ఇది మంచిది కాదు. అభ్యంతకరమైన పోస్టులు జడ్జిలపై పెట్టడం సిగ్గుమాలిన చర్య. నిమ్మగడ్డ విషయంలో జగన్ కు ఒళ్లంతా అభద్రతే ఉంది. వైసీపీ నేతలు హైకోర్టులపై చేస్తున్న కామెంట్లు సరికాదు. తీరు మార్చుకోకపోతే చాలా కష్టం. ఏదీ శాశ్వతం కాదు, అధికారమూ శాశ్వతం కాదు.