ఏపీలో రైతు భరోసా కార్యక్రమం మొదలుపెట్టాక వైసీపీ ప్రభుత్వం మంచి జోరు మీదుంది. ముందు చెప్పినకంటే రూ.వెయ్యి అధికంగా ప్రకటించి జనాల్ని సంతోషపెట్టడంతో పాటు పనిలోపనిగా పథకం పేరులో ప్రధానికి కూడా చోటిచ్చి బీజేపీనీ ఖుషీ చేశామని వైసీపీ నాయకులు సంబరపడిపోతున్నవేళ టీడీపీ నేత దూళిపాళ్ల నరేంద్ర వారి ఆనందంపై నీళ్లు చిలకరించారు. ఒకేసారి రూ.12500 ఇస్తామంటూ గతంలో జగన్ చెప్పిన విషయాన్ని వీడియో వేసి మరీ ఆయన జనాలకు గుర్తుచేశారు.
గుంటూరులో 2017 జూలై 9న వైసీపీ ప్లీనరీలో జగన్ స్పష్టంగా ప్రకటించాడంటూ ఓ క్లిప్పింగ్ వేసి మరీ చూపించారు. రైతులకు పెట్టుబడి సాయాన్ని ఒకే దఫాలో మే నెలలోనే రూ.12,500 చెల్లిస్తామని జగన్ ఆవేశంగా ప్రసంగించడం ఆ క్లిప్పింగ్ లో ఉంది. దీనిపై ధూళిపాళ్ల నరేంద్ర మాట్లాడుతూ, తాము అధికారంలోకి వస్తే ప్రతి రైతుకు రూ.50 వేలు ఇస్తామని, ఏటా రూ.12,500 ఇవ్వడం జరుగుతుందని జగన్ అప్పట్లో హామీ ఇచ్చారని వెల్లడించారు. కానీ నేడు వైఎస్సార్ రైతు భరోసాకు ప్రధాన్ మంత్రి కిసాన్ సమృద్ధి యోజన పథకంతో ముడివేసి తాము రూ.13,500 ఇస్తామని కోట్లు ఖర్చుపెట్టి పేపర్ ప్రకటనలు ఇస్తున్నారని విమర్శించారు.
అప్పట్లో జగన్ రైతు భరోసా పథకం ప్రకటించిన సమయంలో ప్రధాన్ మంత్రి కిసాన్ యోజన పథకం కూడా లేదు. రూ.12,500 తామే ఇస్తామని జగన్ ప్రకటించారు. కానీ, ఇప్పుడు రైతులకు రూ.6 వేలు ఇచ్చే కేంద్ర ప్రభుత్వ పథకం ప్రారంభం అయ్యాక జగన్ దాన్ని కూడా తన ఖతాలో వేసుకుని రూ.వెయ్యి పెంచి జనాలను మోసం చేశారని దూళిపాళ్ల నరేంద్ర ఆరోపించారు. ఈ లెక్కన జగన్ ప్రకటించిన కంటే ఇప్పుడు తక్కువ ఇస్తున్నారని.. పైగా అప్పుడు ఒకేసారి ఇస్తామని చెప్పి ఇప్పుడు ఇనస్టాల్మెంట్లలో ఇస్తున్నారని విమర్శించారు.