​​కేసీఆర్ అడుగులో మరో అడుగు వేసిన జగన్

August 07, 2020

గవర్నమెంటు వ్యవసాయ డిపార్టుమెంట్లు అన్నిటికీ పేరు మార్చి రైతు కోసం ఇపుడే అవన్నీ పుట్టినట్లు ప్రచారం చేసుకుంటోంది వైసీపీ. దీనికి కావల్సినంత ప్రచారం చేయడానికి సొంత మీడియా ఎలాగూ సిద్ధంగా ఉంది. ఇక మోడీ- కేసీఆర్ లు జగన్ కి రెండు కళ్లు. ఏ కన్ను ఎక్కువ కాదు, ఏ కన్ను తక్కువ కాదు. వారి అడుగులో అడుగులు వేసుకుంటూ నడుస్తూ ఉంటారు జగన్.

తాజాగా కేసీఆర్ మరో ఆలోచనను జగన్ ఏపీలో అమలుపరుస్తున్నాడు. ఇటీవల కేసీఆర్... పంటల విధానాన్ని ప్రకటించారు. అంతేకాదు, దానిని రైతు బందుకు అనుసంధానించారు. ఎవరైతే ప్రభుత్వ పరిశోధనల ప్రకారం... మార్కెట్ గిరాకీ అనుగుణంగా పంటలు పడిస్తారో వారికి మాత్రమే రైతు బంధు వర్తిస్తుందని కేసీఆర్ ప్రకటించారు.

తాజాగా ఏపీ ముఖ్యమంత్రి జగ​న్ ​ కూడా  ​ ఇదే విధానానికి జై కొట్టారు. పంటల ప్రణాళిక, ఈ మార్కెటింగ్ ప్లాట్ ఫాంపై సమీక్షా సమావేశం పెట్టిన ముఖ్యమంత్రి పంటల ప్రణాళికను రూపొందించాలని ఆదేశించారు. మార్కెట్లో గిరాకీ ఉన్న పంటలనే రైతులు వేసే చూడాలన్నారు. రైతులు కూడా కాలానుగుణంగా మారాలని... మార్కెట్లో గిరాకీ ఉన్న పంటలు వేస్తే రైతులు మరింత ఆదాయం పొందవచ్చన్నారు.

ఈ ప్రణాళికలను వార్డు, గ్రామ సచివాలయాల్లో ​ప్రదర్శించాలని అన్నారు. ​జిల్లా, మండల వ్యవసాయ బోర్డులు ఏర్పాటుచేయాలని ఆదేశించారు. ప్రభుత్వం 30 శాతం పంటలను కొనుగోలు చేయడానికి ప్రయత్నం చేస్తుందన్నారు. మొత్తానికి కేసీఆర్ ఏపీకి మార్గదర్శకుడు అవుతున్నారు. బహుశా జగన్ ఉన్నంత వరకు ఇది కొనసాగుతూనే ఉంటుంది.