జగన్ వీరాభిమానికి చిరంజీవి బాగా నచ్చాడే 

February 27, 2020

ఎదిగే మార్గంలో ఉన్న వారు మంచో చెడో ఏదో ఒక మార్గం ఫిక్సయిపోవాలి. గెలిస్తే సూపర్... లేకుంటే యతా తథ స్థితి. బహుశా ఈ క్లారిటీ వల్ల నటుడు పృథ్వి తెలుగు సినిమారంగంలో లక్కీయెస్ట్ ఫెలోగా నిలిచాడు. అలా మాట్లాడితే తన అవకాశాలు వస్తాయో రావో అన్న బెంగే లేకుండా... ఎన్నికలకు 6 నెలల ముందు నుంచి జగన్ ను ఆకాశానికి ఎత్తేశాడు. జగన్ హీరో అన్నాడు. ఆయన పొగడని రోజే లేదు. జగన్ ఓడిపోతే ఏమయ్యోదే తెలియదు గాని అనూహ్యంగా జగన్ గెలిచాడు. పృథ్వి లక్కీఫెలో అయిపోయాడు. ఏకంగా టీటీడీలో ఓ కీలక పదవి వచ్చింది. ఆ తర్వాత రాజకీయ మైలేజీ కోసం కాస్త తేడా వ్యాఖ్యలు చేశారు. తెలుగు సినిమా ప్రముఖులకు జగన్ సీఎం కావడం ఇష్టం లేదని అన్నారు. ఇది నందమూరి వారికి ఎలాగూ వర్తిస్తుంది కాబట్టి ఓకే. కానీ మెగా ఫ్యామిలీ ఈ వ్యాఖ్యలతో కొంచెం ఇబ్బంది పడింది. ఇండస్ట్రీలో అత్యధిక వర్గం... నందమూరి, మెగా కుటంబాలు ఆక్రమించాయి. ఈ నేపథ్యంలో పృథ్వికి అవకాశాలు ఇక కష్టమే అని ప్రచారం జరిగింది. కట్ చేస్తే... పృథ్విగా తాజాగా అందరినీ ఆశ్చర్యపరిచారు.

పృథ్వి సైరాలో పాత్ర పోషిస్తున్నారు. దీంతో నిన్న రాత్రి జరిగిన ప్రి రిలీజ్ ఈవెంట్ కు హాజరయ్యారు. ఈ సందర్భంగా చిరంజీవి గురించి పొగుడుతూ చిరుని ఆకాశానికి ఎత్తేశారు. తన చర్మం ఒలిచి చెప్పులు కుట్టించినా చిరంజీవి రుణం తీర్చుకోలేను అని పృథ్వి చేసిన వ్యాఖ్యలు అందరినీ షాక్ కు గురిచేశాయి. ఈ జన్మ మొత్తానికి గుర్తుండిపోయే పాత్ర ఈ చిత్రంలో చేశానని, నా పాత్ర ఇంటర్వెల్ లో చాలా కీలకం అని పృథ్వి అన్నారు. ఈ స్థాయిలో అతను చిరంజీవిని పొగడటం చూసి... ఏమైనా పృథ్వి సినిమా వారినే కాదు, రాజకీయ నాయకులను కూడా మించిపోయాడు అంటూ వ్యాఖ్యానిస్తున్నారు పలువురు విశ్లేషకులు.