జగన్ కి ఓటేసినందుకు బూటుతో కొట్టుకున్న వీరాభిమాని 

February 21, 2020

అతడికి జగన్ అంటే ఎంత అభిమానమంటే.. యువనేత ముఖ్యమంత్రి అయ్యే వరకూ గడ్డం.. జట్టు తీయనని భీష్మించుకొని మరీ తన పంతాన్ని నెగ్గించుకున్నోడు. అంతేనా.. పేదరికంలో ఉన్నా వైఎస్ చనిపోయిన తర్వాత.. తనకున్న ఇంటిని అమ్మేసి మరీ ఆయన విగ్రహాన్ని ఏర్పాటు చేసిన వీరాభిమాని. అంతటి వీర ఫ్యాన్ ఇప్పుడు నడుము వరకూ గోనెసంచి కట్టుకొని.. వీధుల్లో నిలబడి.. మెడలో బూట్లు వేసుకొని మరీ కొట్టేసుకుంటున్న వైనం ఇప్పుడు సంచలనంగా మారింది.
ఇంతకీ అతనెవరు? ఎక్కడుంటాడు? ఏం చేస్తుంటాడు? మొన్నటి వరకూ జగన్ ను నెత్తి మీద పెట్టుకొని తిరిగిన అతగాడు ఇప్పుడెందుకంత ఆవేశానికి.. ఆగ్రహానికి గురయ్యాడు? లాంటి ప్రశ్నలకు సమాధానం వెతికితే.. చాలా విషయాలు బయటకు వస్తాయి. చిత్తూరు జిల్లా తవణంపల్లె మండలం కె.పట్నంకు చెందిన రాజమాణిక్యం  దివ్యాంగుడు. అతనికి వైఎస్ అన్నా.. జగన్ అన్నా ప్రాణం. తన పనులు తాను చేసుకోలేకున్నా.. వైఎస్ మీద ఉండే అభిమానాన్ని అవకాశం వచ్చిన ప్రతిసారీ ప్రదర్శించేవాడు.
వైఎస్ కుటుంబం మీద ఉన్న అభిమానంతో జగన్ సీఎం అయ్యే వరకూ అంటే దాదాపు ఆరేళ్లకు పైనే జుట్టు.. గడ్డం తీయకుండా అలానే ఉండిపోయిన వీరాభిమాని. అలాంటి వ్యక్తి ఇప్పుడు నిరాశలోకి కూరుకుపోవటమే కాదు.. నిప్పులు చెరుగుతున్నాడు. తాజాగా చిత్తూరుజిల్లా కేంద్రంలో జరిగిన స్పందన కార్యక్రమంలో పాల్గొన్న అతను.. వినూత్న నిరసనను చేపట్టారు.
వికలాంగుల పింఛను.. తెల్లరేషను కార్డుకు అర్హుడినైనప్పటికీ తనకు వాటిని ఇవ్వటం లేదని ఆగ్రహం వ్యక్తం చేశాడు. మండల వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కన్వీనర్ ప్రతాపరెడ్డి చెబితే మాత్రమే ఇస్తానని తాహసీల్దార్ చెబుతున్నారని.. దళితుడైన తనను అధికారులు పట్టించుకోవటం లేదంటూ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. పార్టీని తాను ఇంతలా అభిమానిస్తున్నా.. ప్రభుత్వ పథకాలు తనకు అందనీయకుండా చేస్తున్నారంటూ నిప్పులు చెరిగారు.
మెడలో బూట్లు వేసుకొని.. వాటితో కొట్టుకుంటూ తన ఆగ్రహాన్నిప్రదర్శించారు. ఏమీ ఆశించకుండా.. కేవలం వైఎస్ కుటుంబం మీద ఇంత అభిమానాన్ని ప్రదర్శించే వారు కేవలం ఆర్నెల్ల వ్యవధిలోనే ప్రభుత్వ తీరును తప్పు పట్టటంపై జగన్ ఆత్మవిమర్శ చేసుకోవటంతో పాటు.. సిస్టంను సెట్ చేయాల్సిన అవసరం ఉందన్న మాట వినిపిస్తోంది.